పగలంతా ఎండ, రాత్రి చలి.. వరంగల్‌లో ఎందుకిలా..?

  • కాలుష్యం, తుఫాను వల్ల వాతావరణంలో మార్పులు
  • నవంబర్​ సగానికొచ్చినా దంచికొడుతున్న ఎండలు
  • గత సీజన్లతో పోలీస్తే అధికంగా 2 డిగ్రీల ఉష్టోగ్రతలు
  • చలి కాలంలోనూ ఏసీలు, కూలర్ల వాడకం తగ్గట్లే

వరంగల్, వెలుగు: రాష్ట్రంలో నవంబర్ నెల వచ్చిందంటే జనాలు ఒంటిపై స్వెట్టర్లు, ముఖానికి మంకీ క్యాపులతో వణుకుతూ కనిపించేది. వాతావరణం ఈ ఏడాది అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పగలంతా సమ్మర్ సీజన్ లా ఎండలు దంచికొడుతుండగా, సిటీ ఏరియాల్లో రాత్రి పడుకునే సమయానికి కూడా ఉక్కపోత తగ్గడంలేదు. గత సీజన్లతో పోలీస్తే..ఈ నవంబర్ రెండో వారానికి వచ్చాక కూడా రాష్ట్రంలో ఉష్టోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. అర్ధరాత్రి దాటాక మాత్రమే చలి ఎఫెక్ట్ కనిపిస్తోంది. పెరిగిన టెంపరేచర్ల కారణంగా గతం కంటే ఈసారి చలిగాలి, పొగమంచు తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

పెరిగిన టెంపరేచర్లు.. 

రాష్ట్రంలో చలి కాలంలో నమోదు కావాల్సిన టెంపరేచర్ల కంటే భిన్నంగా ఈసారి మరో 2 డిగ్రీల ఉష్టోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటలకు చలితో వణకాల్సిన జనాలు, పొద్దున్నే మండే ఎండకు భయపడ్తున్నారు. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారమే గతంలో శీతాకాలం వచ్చిందంటే గరిష్టంగా 28 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన టెంపరేచర్ ఇప్పుడు 32 డిగ్రీలు ఉంటోంది. కనిష్టంగా 16 నుంచి 17 మధ్య ఉండాల్సింది 19 డిగ్రీల వరకు నమోదవుతోంది. మొత్తంగా గత చలికాలంతో పోలిస్తే ఎక్కువ ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. డిసెంబర్ వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.  

కాలుష్యం, తుఫాన్ల ఎఫెక్ట్..​

రాష్ట్రంలో వాతావరణంలో మార్పులకు కాలుష్యం పెరగడం, తుఫాన్లు కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే కారణంతో రాష్ట్రంలో అక్టోబర్ చివర్లో కూడా ఒకేరోజు మూడు సీజన్ల వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు, మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు పిడుగులతో కూడిన వర్షాలు, రాత్రి పదకొండు దాటాక చలికాలం కనిపించింది. 

దక్షిణ భారత దేశంలో ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు ఈశాన్య రుతు పవనాలు వచ్చాయి. అయితే వానలు తగ్గినా ఎండలు మాత్రం అలానే ఉన్నాయి. కాలుష్యానికి కారణమయ్యే గ్యాస్, ఆయిల్స్, బొగ్గు వినియోగం రాష్ట్రంలో పెరగడానికితోడు, మన ప్రాంతం, చుట్టూరా ఉండే రాష్ట్రాల్లో తుఫాన్ల ఎఫెక్ట్ ప్రస్తుతం మన వాతావరణంలో హెచ్చుతగ్గులకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

కూలర్లు, ఏసీలు ఇంకా వాడుతున్రు..

రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో వర్షాలు మొదలవగానే ఓ పది రోజులు అటుఇటుగా ఇండ్లల్లో కూలర్లు, ఏసీల వాడకం పక్కనబెడతారు. కానీ ఈ సీజన్​లో గజగజ వణికించాల్సిన నవంబర్ రెండో వారంలోనూ జనాలు వీటి వాడకం లేకుండా ఉండలేని దుస్థితి నెలకొంది. ఇండ్లు, ఆఫీసులనే తేడా లేకుండా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు ఏసీలు, కూలర్లు నడుస్తూనే ఉన్నాయి. దీంతో కేవలం సమ్మర్​లో మాత్రమే కరెంట్ బిల్లుల మోత చూసిన పబ్లిక్​ ఇప్పుడు చలికాలంలోనూ ఎక్కువ మొత్తంలో వినియోగానికి చెల్లించాల్సి వస్తోంది.