సిరిసిల్ల మున్సిపల్‌‌‌‌‌‌‌‌ విలీన గ్రామాల పోరుబాట

  • తిరిగి జీపీలుగా మార్చాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ 
  • కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న గ్రామస్తులు 
  • నాడు వ్యతిరేకించినా మున్సిపల్‌‌‌‌‌‌‌‌లో కలిపారు 
  • పన్నుల భారం తప్ప అభివృద్ధి కనిపించడం లేదని ఆవేదన 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల ప్రజలు పోరుబాట పట్టారు. తిరిగి తమ గ్రామాలను జీపీలుగా మార్చాలని డిమాండ్​ చేస్తున్నారు. సిరిసిల్ల సమీపంలో ఉన్న ఏడు గ్రామాలను 2021లో నాటి ప్రభుత్వం మున్సిపాలిటీలో విలీనం చేశారు. రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, పెద్దూర్, సర్థాపూర్, చిన్నబోనాల, జగ్గరావుపల్లి గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. విలీనం టైంలో వ్యతిరేకించినా తమ గోడు వినిపించుకోలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పెరిగిన ట్యాక్సులు.. శానిటేషన్​అస్తవ్యస్తం

సిరిసిల్ల మున్సిపల్‌‌‌‌‌‌‌‌లో కలిసిన ఏడు గ్రామాల్లో ట్యాక్సులు పెరిగాయి తప్ప అభివృద్ధి కనిపించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీపీలుగా ఉన్నప్పుడు ఇంటి పన్ను, ఇతర పన్నులు, రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉండగా.. మున్సిపల్‌‌‌‌‌‌‌‌లో విలీనమయ్యాక ఈ ట్యాక్సులన్నీ అమాంతం పెరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. తమపై ఆర్థిక భారం పెరిగింది తప్ప అదనంగా వచ్చిన ప్రయోజనమేమీ లేదంటున్నారు. ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు. 

గ్రామ స్థాయిలో ఉన్న వ్యవసాయ భూములకు సైతం కమర్షియల్ ఫ్లాట్లకు ఉన్నంత చార్జీలు పెరగడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో విలీన గ్రామాలను తిరిగి జీపీలుగా మార్చాలని ఏడాదిగా డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. మరికొన్ని నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో విలీన గ్రామాలను తిరిగి జీపీలుగా మార్చాలన్న డిమాండ్​ ఊపందుకుంది. కొన్ని రోజులుగా ఏడు గ్రామాల ప్రజలు పోరుబాట పట్టారు. ప్రతిరోజూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు మున్సిపల్‌‌‌‌‌‌‌‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విలీన గ్రామాల్లో పాలన పడకేసింది. శానిటేషన్‌‌‌‌‌‌‌‌ నిర్వహణ అంతంతమాత్రంగా మారింది. 

హామీ ఇచ్చి మోసం చేశారు.. 

2023 అసెంబ్లీ ఎన్నికల ముందు విలీన గ్రామాలను తిరిగి జీపీలుగా మార్చుతానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఏడాదైనా ఇచ్చిన హామీ పై ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని  ఏడు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా విలీన గ్రామాల సమస్యపై విప్ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు చెబుతున్నారు. 
 
జీపీలుగా మార్చే వరకు ఉద్యమం ఆగదు

మున్సిపల్ లో అన్యాయంగా కలిపిన ఏడు గ్రామాలను తిరిగి జీపీలుగా మార్చే వరకు ఉద్యమం చేస్తాం. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు విలీన గ్రామాల ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఐదేండ్లుగా విలీన గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. శానిటేషన్‌‌‌‌‌‌‌‌ నిర్వహణ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విలీన గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. తిరిగి జీపీలుగా మార్చితేనే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.  - సలేంద్రి బాల్ రాజు, పెద్దూర్ వాసి.