మార్పును స్వాగతించాల్సిందే!

పాలకులు ఎవరైనా, పరిపాలన ఎవరిదైనా  వారి చుట్టూ భూమి ప్రధాన అంశంగా ఉంటుంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఏదో ఒక మార్పును తీసుకొస్తున్నారు. ప్రజా అవసరాలంటూ అమలుచేస్తున్న మార్పులు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఆలోచించడం లేదు.  గత  బీఆర్​ఎస్​ ప్రభుత్వ ‘ధరణి’ నిర్ణయంతో  మేలు జరగలేదు అనేది ప్రజలు గుర్తించారు.

ఆ నిర్ణయాన్ని తిరస్కరించి కొత్త ఆలోచనలతో ముందుకువచ్చిన  కాంగ్రెస్ ప్రభుత్వం..ధరణిలో  లోపాలున్నాయంటూ దాని స్థానంలో కొత్త ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని ‘భూ భారతి’ బిల్లు పేరుతో తీసుకువచ్చారు.  మొన్న అసెంబ్లీలో  టేబుల్  కూడా అయింది.  గత కాలపు  ధరణిలో ఉన్న 33 మాడ్యూల్స్ నుంచి  ఆరు మాడ్యూల్స్​గా కుదించి  చట్టం చేశారు.

1971 అంటే యాభై మూడు సంవత్సరాల క్రితం కొందరు న్యాయ నిపుణులు, అంటే లా డిపార్టుమెంటువారు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, సర్వే సెటిల్మెంట్ సిబ్బంది అందరూ కలిసి చట్టం తయారు చేశారు. అది ఇప్పుడు, అప్పుడు ఎప్పటికైనా ఒక ఆదర్శవంతమైన చట్టం.

దాంట్లో నుంచి కొన్ని సవరణలు చేస్తూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొన్నింటిని సరళీకరించి రూపొందించినది  ఆర్ఓఆర్ చట్టం.  ఇది ధరణిలో నిలిపి వేసిన సౌకర్యాలను, ధరణి మాడ్యూల్స్​కు జవాబు  దొరకని పరిష్కార మార్గాలకు కొత్త చట్టంలో వెసులుబాటు కల్పిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇది ఆచరణలోనే అర్థమవుతుంది.

చట్టం చేయడంతోనే సరిపోదు,అమలు తీరే కీలకంమనం ఒక దగ్గర కూర్చొని చట్టాలు తయారు చేయవచ్చును.  కానీ, ఆచరణలో సరిగా అమలు కాకుంటే చేసిన చట్టం వృథా అయిపోతుంది. అందులో భాగంగా 'భూదార్’ ఇది ప్రతి కమతానికి ఇవ్వాలనుకుంటున్న యూనిక్ నెంబర్. పూర్తిగా స్థానికంగా క్షేత్రస్థాయి సిబ్బంది లేకుండా ముందుకు వెళ్ళలేదు.

క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది, సర్వే సిబ్బంది సమన్వయం లేకుండా ఒక్క ఇంచు భూమికి  కూడా హామీ ఇవ్వలేం. టెంపరరీ  భూధార్,  పర్మినెంట్ భూధార్  తెలంగాణ భూమి కొలతలకు ముందు తర్వాత  ఇచ్చే భూధార్ అంత సులభ సాధ్యం కాదు.చట్టం చేయడంతోనే సరిపోదు. దాని అమలు తీరు పైనే ఫలితాలు ఆధారపడతాయి.

అనుభవదారుకు హక్కులు ఉన్నాయా?

తెలంగాణ రాష్ట్రంలో టెనెన్సీకి హక్కులు లేవు. కాబట్టి,  అనుభవదారుడు కాలంలో పేరు రాసినంత  మాత్రాన అతనికి చట్టంలో ఏ హక్కులు పొందే అవకాశం లేదు. ‘పార్ట్ బి’లో 18 లక్షల ఎకరాలు ఉంది. ధరణి కంటే ముందునుంచి  కూడా కొన్ని పాస్ పుస్తకాలను డ్యూ ప్రాసెస్ అఫ్ లా  కింద జారీ చేశారు. ఇప్పుడు వాటిని ఎలా పరిష్కరిస్తారు? వాటి గురించి కూడా చర్చించవలసింది.

మ్యుటేషన్  అయినా సక్సేషన్ అయినా ఏ తప్పులు  జరిగినా 1971 చట్టంలోనే ఉన్నది. వీటికి అప్పిలేట్ అథారిటీ..  ఆర్డీఓ,  కలెక్టర్, తదనంతరం హైకోర్టు.  మ్యాప్​తో సహా మ్యుటేషన్  ఆర్డర్స్ ఇస్తామంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది? 13బి, 38ఇ, ఓఆర్సీ, లావుణీ ఈ భూములన్నింటికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామంటున్నారు. గతంలో లేవు. ఇపుడు ఎలా ఇస్తారో చూడాలి. 

సాదాబైనామాలపై పారదర్శకత  అవసరం

సాదా బైనామా అనేది ఒక విచిత్ర ప్రహసనం. దేశంలో నిరక్షరాస్యత అధికంగా ఉన్న దశలో అది 1964 నుంచి చాలా సంవత్సరాల వరకు వ్యక్తుల మీద నమ్మకంతో తెల్లకాగితం మీద  రాసుకున్నారు. అది ఫోరెన్సిక్ వారికి ఇస్తేగాని కొంత పారదర్శకత ఉండదు. అందులో చాలా అబద్ధపు రాతలు ఉన్నాయి. అవి  తొమ్మిది లక్షల నుంచి ఇంకా మూడు లక్షల వరకు పెండింగ్ ఉన్నాయంటే    అది నమ్మశక్యంగా లేదు. అందుకు చట్టంలో  ప్రత్యేకమైన  సవరణ  అవసరమవుతుంది.

దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడవలసిందే.  నిజానికి ఇప్పుడున్నతరం తాత ముత్తాతల ఇండ్లు గ్రామాల్లో ఉన్నాయి. వాటికి ఇంటి నెంబర్ తప్ప, రిజిస్ట్రేషన్​, ఒక డాక్యుమెంట్ అంటూ లేదు. పాత ఇండ్ల రిజిస్ట్రేషన్​కు సబ్ -రిజిస్ట్రార్ కార్యాలయంలో చాలా అవినీతి జరుగుతోంది. గ్రామ కంఠం, అలాగే ఆబాది హక్కులు కల్పిస్తామని అంటున్నారు.  మంచి నిర్ణయం, కానీ ఎదురుచూడాలి. 

ట్రిబ్యునల్స్​ అనివార్యం 

ట్రిబ్యునల్స్​లో ఎవరు ఉంటారు. ఎట్లా ఆర్గ నైజ్ చేస్తారు అనేది స్పష్టత ఇవ్వలేదు. జిల్లాల వారీగానా,  రాష్ట్రానికి ఒకటా అని చెప్తే బాగుండేది. ఉచిత న్యాయ సలహా అనేది ప్రాథమిక హక్కుల్లో భాగంగానే ఉంది. అది క్రిమినల్ అయినా, సివిల్ అయినా అది ప్రభుత్వాల బాధ్యత. వ్యక్తిగత గోప్యత ధరణిలో ఉంది.

ALSO READ : ధరణి తప్పులకు భూ భారతితో చెక్

భూ భారతి బిల్లులో ఉండదు అని అంటున్నారు మంచిదే.  ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి బాధ్యులు ఎవరైనా, అన్యాక్రాంతం చేసిన వ్యక్తికి అన్యాక్రాంతం ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి ఇద్దరిపైనాక్రిమినల్ చర్యలు తీసుకుంటామని భూ భారతి బిల్లు చెబుతున్నది..

అసెంబ్లీలో విస్త్రృత చర్చ జరగాలి

కొత్త చట్టం 2024 ఆర్ఓఆర్  భూ భారతి బిల్లు పేరున వస్తున్న బిల్లు కేబినెట్​లో ఆమోదం పొందింది.  టేబుల్ అయ్యింది. ఆలస్యం అయినా సరే అసెంబ్లీలో విస్తృత మైన చర్చకు గడువు  ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే మరింత పారదర్శకంగా ఉంటుంది. లేదంటే గవర్నర్ ఆమోద ముద్రతో  బయటకు వస్తుంది. ఈ చట్టానికి  నిబంధనలు (రూల్స్) తయారు కావాలి. ఎగ్జిక్యూటివ్ సూచనలు కూడా ఉండాలి. అది చేయడానికి మూడు నెలల కాల వ్యవధి అంటున్నారు.

పని ఏదైనా ఆచరణలో ధరణిలో ఉన్న ఇబ్బందులను తిరిగి పొడ సూపకుండా గ్రామంలోని ప్రతి చిన్న రైతుకు అందుబాటులో ఉండేవిధంగా ఉంటేనే  స్వాగతిస్తారు. లేకుంటే ధరణి పేరు మార్పు తప్ప 
ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదు.

గ్రామానికి ఇద్దరు రెవెన్యూ అధికారులు అవసరమే

భూమి లెక్కలు తేలాలి అంటే జమాబందిని పునరుద్ధరించాలి.  కంప్యూటర్ పోర్టల్​లో కాకుండా ప్రతి సంవత్సరం చేతిరాత పహాణీ ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. 2018  పహాణీని ప్రతి గ్రామ చావడిలో ప్రతి సంవత్సరం చదివి వినిపించేలా చట్టంలో ఉండాలి. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు,  గ్రామానికి రెవెన్యూ అధికారి అందుబాటులో ఉంటాడంటూ చట్టంలో చెబుతున్నారు. గత కాలపు వీఆర్వోలను తీసుకుంటే బాగుండేది.

పదివేలపై చిలుకు గ్రామాలు ఉండటం వల్ల ఇదివరకటి 25వేల మంది వరకు ఉన్న విఆర్వో, వీ ఆర్ ఏలను తిరిగి విధుల్లోకి తీసుకోగలుగుతారా ? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గ్రామానికి ఇద్దరు చొప్పున అవసరమే. కానీ, ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందనేది వేచి చూడాల్సిందే.

-  వి.బాలరాజు,
 తహసీల్దారు (రిటైర్డ్​)