నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే

  • పదేండ్లుగా రిపేర్లు చేయక తిప్పలు పడుతున్న ప్రజలు

గద్వాల, వెలుగు : పదేండ్లుగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక్క రోడ్డు రిపేరుకు నోచుకోలేదు. కొత్త రోడ్లు వేయకపోవడంతో జిల్లాలోని రోడ్లన్నీ అధ్వానంగా మారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోడ్లపై వెట్ మిక్స్ వేసి బీటీ వేయకపోవడంతో, కంకర రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు. రోడ్లు బాగు చేయాలని ఐజ, గద్వాల, అలంపూర్​ ప్రజలు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. ఐజ మండలం మేడికొండ నుంచి పులికల్  వరకు 17 కిలోమీటర్ల మేర వెట్  మిక్స్  వేసి ఆరేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ బీటీ వేయలేదంటే జిల్లాలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బీఆర్ఎస్​ పాలనలో బిల్లులు చెల్లించకపోవడంతో, టెండర్లు పిలిచినా, నోటిఫికేషన్  వేసినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ప్రధాన రోడ్లతో పాటు గ్రామీణ ప్రాంత రోడ్లు అడుగడుగునా గుంతలతో నిండిపోయాయి. పనులు చేశాక బిల్లులు చెల్లించకుండా ఏండ్ల తరబడి పెండింగ్​ పెట్టడం, ఫండ్  రిలీజ్  కోసం కమీషన్లు డిమాండ్  చేయడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడమే మానుకున్నారనే విమర్శలు వచ్చాయి.

రోడ్లన్నీ పెండింగ్ లోనే..

నేషనల్​ హైవే 44 నుంచి వెంకటాపురం రోడ్డుకు రూ.3.30 కోట్లు, హైవే నుంచి పాగటూరు రోడ్డుకు రూ.3 32 కోట్లు, ఐజ–రాజాపూర్  రోడ్​కు రూ.2.60 కోట్లు, మానవపాడు–చెన్నిపాడు రోడ్ కు రూ.2.22 కోట్లు, ఐజ రోడ్డుకు 1.60 కోట్లు, మిట్టదొడ్డి– బలిగెరా రోడ్​కు రూ.1.33కోట్లు, గద్వాల–రాయచూరు రోడ్​కు రూ.2.72 కోట్లు, దరువు–కర్నాటక బార్డర్  రెన్యువల్  రోడ్ కు రూ.1,02కోట్లు, కొండపల్లి రోడ్​కు1.80 కోట్లు, గద్వాల–రాయచూర్  రోడ్​(5వ కిలోమీటర్ 2వ బిట్టు) రూ. 2.22కోట్లు

పంచాయతీ రాజ్ రోడ్– రేపల్లె రోడ్​కు రూ. కోటి, గంజి రోడ్–రాయచూర్  రోడ్  రూ.1. 29 కోట్లు, అలంపూర్–మారమునగాల రూ.2.50 కోట్లు, ఎరిగెరా–ఐజ, అలంపూర్  రోడ్​కు రూ.3.34 కోట్లు, నేషనల్  హైవే–కలుకుంట్ల రోడ్​కు రూ.95 లక్షలు మంజూరైనా ఎస్టిమేషన్ల దశలోనే పెండింగ్​లో ఉన్నాయి. కొందరు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకొని, అగ్రిమెంట్  చేసుకున్నా పనులు చేయలేదు. 

గుంతల రోడ్లతో తిప్పలు..

ధరూర్  నుంచి జూరాల డ్యామ్​ వెళ్లే రోడ్ పై​12 కిలోమీటర్లు అడుగుకో గుంత ఉండడంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఈ రోడ్డుకు రిపేర్లు చేసినా పరిస్థితి మారలేదు. మానవపాడు–చెన్ని పాడు, పెద్దపోతులపాడు–చిన్న పోతులపాడు రోడ్​ పదేండ్లుగా వేయలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఐజ–నాగులదిన్నె, పర్దిపురం–గుడిదొడ్డి రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో ప్రమాదకరంగా మారింది. గుడిదొడ్డి– యాపలదిన్నె, ఐజ–ఉప్పల క్యాంపు రోడ్, ఐజ–తాండ్రపాడు రోడ్లు అధ్వానంగా మారాయి. ఐజ నుంచి మేడికొండ మీదుగా పులికల్  వరకు 17 కిలోమీటర్ల రోడ్​పై వెట్  మిక్స్  వేసి ఆరేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు బీటీ వేయలేదు.

పుల్లూరు నుంచి కలుగొట్ల, మిన్నిపాడు వెళ్లే రోడ్​ 2021లో స్టార్ట్ కావాల్సి ఉంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 18 నెలలలో కంప్లీట్  చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు. కానీ 2022లో పనులు స్టార్ట్  చేసి వెట్ మిక్స్ వేసి వదిలేశాడు. ఆర్అండ్ బీ రోడ్​ నుంచి బిజ్జరం వెళ్లే రోడ్​పై కంకర వేసి పనులు పెండింగ్​లో పెట్టారు. పదికి పైగా ఆర్అండ్​బీ రోడ్లపై, నాలుగు పీఆర్  రోడ్లపై వెట్ మిక్స్  వేసి వదిలేయడంతో ప్రజలు తిప్పలు పడుతున్నారు.

బీటీ వేపిస్తాం..

కొన్ని రోడ్లపై వెట్  మిక్స్  వేసిన మాట వాస్తవమే. బిల్లుల సమస్య ఉంది. వెట్  మిక్స్  వేసిన రోడ్లపై బీటీ వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పనులు స్టార్ట్  చేయాలని కాంట్రాక్టర్లకు చెప్పాం. త్వరలోనే అన్ని రోడ్ల వర్క్స్​ కంప్లీట్  చేసేలా చూస్తాం.

- విజయ్ కుమార్, ఈఈ పీఆర్