గ్రామ కంఠం స్థలాలపై ప్రజలకు పక్కా హక్కులు

  •     మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాలు, గ్రామాల్లో జనాలకు తీరనున్న చిక్కులు  
  •     ఇండ్ల నిర్మాణాలకు ఇక సులువుగా పర్మిషన్లు, బ్యాంకు లోన్లు
  •     రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త రెవెన్యూ చట్టంతో లక్షలాది మందికి ఊరట
  •     దశాబ్దాల నాటి సమస్యకు కొత్త చట్టంతో పరిష్కారం

కరీంనగర్, వెలుగు : సర్వే నంబర్ లేకుండా గ్రామ కంఠం, ఆబాదీ భూములుగా నమోదైన ఇండ్ల స్థలాలపై ప్రజలకు త్వరలో పక్కా హక్కులు దక్కనున్నాయి. ప్రస్తుతం నివాసముంటున్న ఇండ్లపై  యజమానులకు హక్కులు కల్పించడమేగాక రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ప్రభుత్వం తీసుకురాబోతుంది. దీంతో ఇన్నాళ్లు మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలు, పల్లెలు, గ్రామపంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరకబోతోంది. ఈ చట్టం ఆమోదం పొంది, అమల్లోకి వస్తే ఇంటి స్థలాలకు కూడా ప్రత్యేకంగా పాస్ బుక్స్ జారీ కానున్నాయి. ఇదే జరిగితే ఇక సులువుగా ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు కావడమేగాక ఇల్లు కట్టుకునేందుకు బ్యాంకుల నుంచి లోన్ కూడా మంజూరయ్యే అవకాశముంది. 

ఇంటి పన్ను రశీదే ఇన్నాళ్లు ఆధారం.. 

గ్రామాలు, పల్లెలు ఏర్పడిన తొలినాళ్లలో శతాబ్దాల క్రితం ప్రజలు ఇండ్లు నిర్మించుకునేందుకు కేటాయించిన భూములనే గ్రామకంఠం లేదా ఆబాదీగా పిలుస్తున్నారు. ఈ భూముల్లో సగానిపైగా ఇండ్లకు సర్వే నంబర్లు లేవు. ఇంటి నంబర్ కేటాయించడం తప్పా ఆ ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఉందనే వివరాలు కూడా గ్రామపంచాయతీ రికార్డుల్లో నమోదై లేవు. 2020 అక్టోబర్​లో నిర్వహించిన వ్యవసాయేతర ఆస్తుల సర్వే ప్రకారం గ్రామపంచాయతీల్లో సుమారు 60 లక్షల ఆస్తులను గుర్తించారు.

 ఇందులో సగానికిపైగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేనివే ఉన్నాయి. తాతలు, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇండ్లకు సంబంధించి ఓనర్ల దగ్గర ఇంటి పన్ను రశీదు తప్పా వేరే ఆధారాల్లేని పరిస్థితి నెలకొంది. లేదంటే గ్రామాల్లో ఎవరైనా ఇల్లు లేదా ఇంటి స్థలం ఎవరి దగ్గరైనా కొంటే తెల్ల కాగితం, లేదా నోటరీపై రాసుకోవాల్సిందే. ఇంటి నిర్మాణ అనుమతులకు అప్లై చేసినప్పుడు రిజిష్టర్డ్ డాక్యుమెంట్లు అడుగుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

 పంచాయతీల్లో ప్రస్తుతం ఇంటి పన్ను రశీదు ఆధారంగానే పర్మిషన్లు ఇస్తున్నప్పటికీ..మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో టీఎస్ బీపాస్ ద్వారా రిజిస్ట్రేషన్ పేపర్లు లేకుండా అప్లై చేసుకుంటే పర్మిషన్ ఇవ్వడం లేదు. దీంతో ప్రజలు అనధికారిక నిర్మాణాలు చేపట్టాల్సి వస్తోంది. 

పైలెట్ ప్రాజెక్టు దశలోనే వదిలేసిన గత సర్కార్

గ్రామకంఠం/ఆబాదీ స్థలాలపై దశాబ్దాల తరబడి నివాసముంటున్నా వాటిపై పక్కా హక్కుల్లేని సమస్య దేశవ్యాప్తంగా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా(స్వమిత్వ) స్కీమ్​ను 2021లో ప్రారంభించింది. రాష్ట్రంలోనూ స్వమిత్వ స్కీం పైలట్ విలేజీలుగా 2022లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ, మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట, జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఆర్లి(కే), కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామాలను ఎంపిక చేశారు. 

సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గ్రామ కంఠాలకు సంబంధించి కొత్త మ్యాప్ లను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. రాష్ట్ర పంచాయతీ అధికారులు ఆ మ్యాపులను మరోసారి క్రాస్ చెక్ చేసుకుని ఓనర్లవారీగా ప్రాపర్టీ కార్డులను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ ప్రాపర్టీ కార్డులను జారీ చేయలేదు. ఆ తర్వాత స్వమిత్వకు పోటీగా రాష్ట్ర సర్కార్ మరో పైలట్ ప్రోగ్రాం చేపట్టింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని కొత్తపల్లి, మల్లంపేట, మహబూబ్ నగర్ జిల్లాలోని అన్నారెడ్డిపల్లి, నంచెర్ల గ్రామ పంచాయతీలను గ్రామ కంఠం స్థలాల అధ్యయనానికి పైలట్ విలేజీలుగా సెలక్ట్ చేసింది. కానీ ఈ పైలెట్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు.