నాయకుడు ముందు నడుస్తుంటే వెనుక పెద్ద గుంపు వెళ్తుంటుంది. అలా అతని వెంట నడుస్తూ... ‘జై’ కొట్టే వాళ్లలో సగం కంటే ఎక్కువమంది కూలీలే ఉంటారు. ఎన్నికలప్పుడు ప్రచారంలో పాల్గొంటూ లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు రోజూ ఉదయం గ్రామాల్లో ఉన్న తమ పార్టీ లీడర్లకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇస్తున్నారు. ఆ రోజు ప్రచార పనికి వచ్చిన జనాలకు కూలీ ఇవ్వడం, వారికి భోజనాలు పెట్టించడం, వాహనాల కిరాయి, సాయంత్రం లిక్కర్ దావత్ వంటివన్నీ ఈ డబ్బులతో మేనేజ్ చేస్తున్నారు.
వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీలకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువ. మరుసటి రోజు పనికి వస్తారో, రారోనన్న అనుమానం ఉన్నచోట అడ్వాన్స్‌గా డబ్బులు ఇచ్చి మరీ పని చేయించుకుంటున్నారు. అభ్యర్థుల నడుమ ఉన్న పోటీని బట్టి ఒక్కో నియోజవర్గంలో ఒక్కో రేటు నడుస్తోంది. ఇంటింటి ప్రచారానికి వస్తే ఓ రేటు, పెద్ద నాయకుల మీటింగులకు వస్తే ఇంకో రేటు, జనాలను తీసుకొచ్చే వ్యక్తులకు ఓ రేటు, పాదయాత్రలో పాల్గొంటే ఓ రేటు.
రాజకీయ పార్టీల ప్రచారానికి వచ్చేవాళ్లకు రోజుకు 200 రూపాయలు. చేతిలో బతుకమ్మతో వస్తే 300 రూపాయలు ఇస్తున్నారు. పెద్ద నాయకుల సభలు, ర్యాలీలకు వస్తే 300 రూపాయలతో పాటు బీరు లేదంటే క్వార్టర్ సీసా పంచుతున్నారు. ప్రచారానికి 50 నుంచి 100 మందిని పట్టుకొచ్చే టీమ్ ఇంఛార్జ్‌కు రోజుకు రెండు వేల రూపాయలు. అన్ని పనులు నెత్తినేసుకుని ప్రచారం నిర్వహించే వార్డ్ మెంబర్ స్థాయి లీడర్‍కు డైలీ ఐదు వేల రూపాయలు. అయితే.. రిజర్వ్‌డ్ సీట్లలో ఈ రేట్లు కాస్త తక్కువగా ఉన్నాయి.
పోటీ ఎక్కువగా ఉన్న జనరల్ సీట్లలో కోట్లాది ఆస్తులు ఉన్నోళ్లు, వ్యాపారులు, రియల్టర్లు మాత్రమే పోటీలో నిలబడగలుగుతున్నారు. ఎందుకంటే మండిపోతున్న రేట్లను తట్టుకోవాలంటే మామూలోళ్లకి సాధ్యం కాదు కదా!
చేరికల ఖర్చు
మామూలు ఓటర్లలాగే లోకల్ లీడర్లు కూడా ఏ పార్టీ నాయకుడు ఎక్కువ డబ్బులు ఇస్తే, ఆ పార్టీలో చేరి ఆ నాయకుడికి ‘జై’ కొడుతున్నారు. దాంతో తమ పార్టీ లీడర్లను కాపాడుకోవడం కోసం, ఇతర పార్టీల నుంచి లీడర్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొత్త రాష్ట్రంలో గత రెండు ఎన్నికలతో పోలీస్తే..ఈసారి పోటీ ఎక్కువగా ఉంది. ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి వరంగల్ లాంటి జనరల్ స్థానాల్లో గట్టి పోటీ ఉన్న వాటిగా చెప్పుకునే నియోజకవర్గాల్లో లోకల్ లీడర్లకు ఫుల్ డిమాండ్ ఉంది.
పార్టీలు బలమైన లీడర్లకు ఓ రేటు ఫిక్స్ చేసి మార్కెట్‌లో సరుకులా కొంటున్నాయి. 500 నుంచి 700 ఓట్లు ఉండే చిన్న గ్రామాల సర్పంచులు తమ పార్టీలో చేరితే ఐదు లక్షల రూపాయలు.. పెద్ద గ్రామపంచాయతీ అయితే 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ కండువా కప్పుకుంటే డిమాండ్ ఆధారంగా 8 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. టిక్కెట్ ఆశించి రానివాళ్లలో ఐదు వేలకు పైగా ఓటర్లను ప్రభావితం చేసే సత్తా ఉన్న లీడర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకునేందుకు కోటి రూపాయల వరకు ఇస్తున్నారు. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండే రెబల్ లీడర్లు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.