ఉనికిని ప్రశ్నిస్తున్న పార్లమెంటు ఎన్నికలు

సహజంగానే  ప్రాంత పార్టీ పట్ల ప్రజలకు విశ్వసనీయత ఎక్కువ.  అంతే విశ్వసనీయంగా పరిపాలన జరిపితే ఆ పార్టీకి తిరుగుండదు. కానీ, ప్రాంతం ముసుగులో కుటుంబపార్టీగా మారిపోవడం, వ్యక్తిగత మహత్వాకాంక్షల్లో కూరుకుపోవడం, అవినీతి, అక్రమాలు, అహంకారం రాజ్యమేలడం వంటి అవలక్షణాలు వికటాట్టహాసం చేసినపుడు ఆ పార్టీ ప్రాంతం ముసుగుతో ఎంతో కాలం ప్రజలను మభ్యపెట్టడం సాధ్యం కాదు.  (పార్టీ పేరు మార్చినా, మాది తెలంగాణ పార్టే అని ఓటమి పాలయ్యాక నొక్కి చెపుతున్నారు) ప్రజల విశ్వసనీయతను కోల్పోయి ఓటమి పాలైనపుడు, ఆ ప్రాంత పార్టీ పునరుజ్జీవం దుర్లభంగా మారిపోతుంది. ఇపుడు బీఆర్​ఎస్​ను వెంటాడుతున్నది ఆ దుర్లభ పరిస్థితే. లోక్​సభ ఎన్నికలు ఆ పార్టీ ఉనికిని తేల్చే ఎన్నికలుగా మారిపోయాయి కూడా. 

ప్రాంతేతరపార్టీలను నమ్మకుండా, ప్రాంతపార్టీని నమ్మితే ప్రజల విశ్వసనీయతను ‘సొమ్ము’ చేసుకుంటారని ఎవరూ అనుకోలేదు. చేసిన అభివృద్ధి పనులు నిరర్థకంగా మారుతాయనుకోలేదు. ప్రజలను ఓట్ల యంత్రాలుగా మార్చి రాజ్యమేలుతారనుకోలేదు. పేద ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం ఉచితంగా ఇచ్చి సమాజ ఎదుగుదలను  తెస్తారని ప్రాంత పార్టీని నమ్మారు.  ఆ రెండు రంగాలలో ప్రగతిని సాధించని ప్రాంతపార్టీ తన ఫక్తు రాజకీయంతో తెలంగాణను వెనక్కి నడిపించింది. ఒక ప్రాంతపార్టీ ప్రతిష్టకే అదొక అప్రతిష్ట. 

అప్పులు తెచ్చి నిరర్థక ఆస్తులు సృష్టించారు

అత్యధిక క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్ (అభివృద్ధి వ్యయం)​ చేసిన రాష్ట్రం తెలంగాణే అని పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్​​ పదిసార్లు చెప్పారని ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ చెప్పడం గమార్హం. వాస్తవంగా అభివృద్ధిపై బాగానే ఖర్చుపెట్టారు. కానీ అవి సద్వినియోగం అయ్యాయా? నిరర్థకమయ్యాయా అనేదే కీలకాంశం. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు, మిషన్​ భగీరథ, భద్రాద్రి, యాదాద్రి పవర్​ ప్లాంట్లు వంటి వాటిపైన భారీగా క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​  చేసిన విషయం తెలిసిందే. 

వాటిపై వెచ్చించిన నిధులు సుమారుగా రూ. 3 లక్షల కోట్లు. ఇందులో  మిషన్​ భగీరథలో జరిగిన అవినీతి సంగతి పక్కన పెడితే, ఆ పథకం ప్రజలకు కొంత ఉపయోగపడింది ఎంత నిజమో.. మిగతా అన్ని ప్రాజెక్టులూ నిరర్థక ఆస్తులుగా మారాయనేదీ అంతే నిజం. కాళేశ్వరం ప్రాజెక్టు వయబులిటికే దిక్కులేదు. పాలమూరు ప్రాజెక్టు వయబులిటీపైనా నిపుణులకే అనుమానాలున్నాయి. భద్రాద్రి పవర్​ప్లాంట్​లో వాడిన సబ్​ క్రిటికల్​ టెక్నాలజీవల్ల అధిక వ్యయంతో కూడిన ఉత్పత్తితో అది కూడా కాళేశ్వరం లాగే  వైట్​ ఎలిఫెంటయింది. అనువుకాని చోట చేపట్టిన యాదాద్రి పవర్​ప్లాంట్ అంతే కానుంది.ఈ విధంగా ప్రాంతపార్టీ చేసిన క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ లో సింహ భాగం పనికిరాని ఆస్తులుగా మారాయి!  ఒక ప్రాంతపార్టీ నుంచి ఇలాంటి  నిరర్థక అభివృద్ధిని ఎవరూ ఆశించలేరు.

సగం అప్పలు గుదిబండలకే..

అప్పులు చేయడం తప్పు కాదు. కానీ అప్పులతో పాటు సృష్టించిన ఆస్తులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? అవి తెలంగాణకు గుదిబండలుగా మారాయా? అనేదే కీలకం. రాష్ట్రానికి ఉన్న అప్పులు సుమారు 6 లక్షల కోట్లపైన, అందులో పైన చెప్పిన 5 భారీ ప్రాజెక్టులపై చేసిన ఆప్పులే సుమారు 3 లక్షల కోట్లు.  అవినీతి ప్రపంచ సమస్యనే కావచ్చు. కానీ అవినీతి జరిగినా, కనీసం చేసిన అభివృద్ధి పని అయినా ప్రజలకు ఉపయోగ పడాలె కదా! 

గత ప్రభుత్వాలు చేసిన భారీ అభివృద్ధి పనులలోనూ ఒకవేళ అవినీతి జరిగి ఉన్నా.. చేసిన అభివృద్ధి పనులైనా ప్రజలకు ఉపయోగంలోకి వచ్చాయి. కానీ, అవినీతితోపాటు.. చేసిన అభివృద్ధి కూడా ఉపయోగంలోకి రాకుండా నిరర్థకంగా మార్చిన ప్రాంతపార్టీ ఉనికిని ఇవాళ ప్రజలు మళ్లీ ఏమని కాపాడేది? అవినీతి తోపాటు, చేసిన అభివృద్ధిని నిరుపయోగం చేసిన ఇలాంటి ప్రాంతపార్టీ పాలన దేశంలోనే  మరొకటి లేదు!

ప్రజలకు పట్టని​ కేసీఆర్​ రాజకీయం

ప్రజల విశ్వసనీయతను తిరిగి తెచ్చుకోవడం కేసీఆర్​కు ఒక సాహసమై కూర్చుంది.  అందుకే, లేని సమస్యలను వెదికి కొత్త ప్రభుత్వాన్ని వెంటాడే పనిలో పడ్డారు. నిజానికి రాష్ట్రంలో కరెంటు కోతలు ఎక్కడా లేవు. కానీ కేసీఆర్​ మాత్రం తన బస్సుయాత్రలో కరెంటు కోతలు ఉన్నట్లు మాట్లాడటం చూసి ప్రజలే నవ్వుకుంటున్న పరిస్థితి! కేసీఆర్​ ఊడ్చేసిపోయిన ఖజానాతో కొత్త ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం ప్రజలకూ తెలుసు. అందుకే, ఒక అనర్థపాలనను ఇంటికి పంపించామనే ప్రజల సంతృప్తి​ ముందు.. కేసీఆర్​ విమర్శలు నిలబడలేకపోతున్నాయి. 

దేశంలో లోక్​సభ ఎన్నికల్లో జాతీయ అంశాలే ఎజెండాగా మారినా.. తెలంగాణలో మాత్రం పదేండ్ల బీఆర్​ఎస్​ పాలన చేదు అనుభవాలే ప్రజలను వెంటాడుతున్నాయి. లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అవసరాన్ని  ప్రజలు గుర్తించలేకపోతున్నారనడానికి.. తెలంగాణలో రెండు జాతీయపార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉండటం అందుకు ఒక నిదర్శనం. పన్నెండు సీట్లు గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్​ బస్సు యాత్రల్లో చెపుతున్నారు. ఆ చక్రం ఏదో సొంత పనులు చక్కదిద్దుకునేందుకు తిప్పుతారు తప్ప, రాష్ట్రానికి ఆయన ఏదో సాధించడానికి తిప్పుతారని ఎవరూ అనుకోవడం లేదు. పదేండ్లలో 11 మంది ఒక సారి, 9 మందిని ఒకసారి బీఆర్​ఎస్​ ఎంపీలను గెలిపిస్తే ఏ చక్రం తిప్పి ఏమి సాధించుకొచ్చారో ప్రజలకు తెలిసిందే. ప్రజల విశ్వసనీయతను సొమ్ము చేసుకోవడం తప్ప, మేలు చేసిన దాఖలా ఉంటే మూడోసారి ఓడిపోయేవారు కాదు కదా!

తన కోసమే ప్రజలు మారాలంటాడు!

ప్రజలకు, వ్యవస్థలకు అతీతుడను అనే నాయకుడి పార్టీ తెలంగాణకు అవసరమా? అభివృద్ధిని గుదిబండలు చేసిన ఆ పార్టీ తిరిగి తెలంగాణకు ఉపయోగపడుతుందనే నమ్మకం ఎక్కడైనా కనిపిస్తున్నదా? ఆ నాయకుడి ఆలోచనా విధానంలో మార్పు వస్తుందని ప్రజలేమీ ఆశించడంలేదు. ఆయన కోసం ప్రజలు మారాలె తప్ప, ప్రజల కోసం ఆయన మారుతాడనుకోవడం ఆత్యాశే. 

అలాంటి నాయకుడు తిరిగి పునరుజ్జీవం పొందితే, తెలంగాణ మరోసారి మోసపోవడమే కదా అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రాంతపార్టీ నేతలో మార్పు లేకపోతే, ఆయనపార్టీ మనకెందుకు అనే హక్కు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ ఉంటది.  ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బీఆర్​ఎస్​ ఉనికిని లోక్​సభ ఎన్నికలు వణికిస్తున్నాయి. ‘ప్రాంతం వాడు ద్రోహం చేస్తే పాతరేయాలె’ అనే కాళోజీ మాట తెలంగాణకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ శిరోధార్యమే!

వ్యతిరేకత ఆగిపోయేది కాదు!

చేసిన అనర్థం, అవినీతి, అహంకారం, ప్రజా సంబంధాలు లేని ఒంటి స్థంభం పాలనను తిరస్కరించిన ప్రజలు,  మళ్లీ ఆ పార్టీని  తిరిగి బతికించుకోవాలని అనుకుంటున్న ఛాయలు కనిపించకపోవడమే ఇవాళ కేసీఆర్​ కు ఆందోళన కలిగిస్తున్న విషయం. ఆ పార్టీ తెలంగాణకు మళ్లీ అవసరమా? అనే చర్చ మాత్రం ప్రజల్లో విస్తృతంగా ఉంది. అదేమీ కాదనట్లు.. ఓడిపోయిన మరుసటి రోజు నుంచే, ప్రజలు అబద్దాలను నమ్మి తమను ఓడించారంటూ ప్రజలపైనే దాడి మొదలుపెట్టారు.

 తమ పరిపాలనా తప్పిదాలకు కనీసం సంజాయిషీలు ఇచ్చుకొనని కేసీఆర్..​ ప్రజలను మాత్రం నిందించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.    వ్యక్తిగత మహత్వాకాంక్షల కోసం  కొత్త రాష్ట్ర భవిష్యత్తుతో పదేండ్లు చెలగాటమాడుకున్నారు. అందుకే కేసీఆర్​ పట్ల ప్రజల్లో  వ్యతిరేకత ఆగిపోయేది కాదు. ఆ విధంగా రోజు రోజుకు ప్రజలు మాత్రం రాజకీయంగా కేసీఆర్​ను మర్చిపోతున్నారని ఎన్నికల వాతావరణం చెప్పకనే చెపుతున్నది.

వ్యవస్థలకు అతీతుడిగా..

తాను వ్యవస్థలకు అతీతుడననే అహం స్పష్టంగా కనిపిస్తోంది.  ప్రతిపక్షనేతగా ఆయనను ప్రజలు ఎన్నుకొని పంపిన అసెంబ్లీకి కూడా హాజరుకావడంలేదంటే రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఆయనకున్న గౌరవం ఏపాటిదో  తెలిసిపోతుంది. నిజంగానే తమ పాలనలో అవినీతి జరిగి ఉండకపోతే.. అసెంబ్లీకి వెళ్లి విద్యుత్​పై,  కాళేశ్వరంపై,  మిషన్​ కాకతీయపై, శ్వేతపత్రాలపై ఎందుకు జవాబులు చెప్పలేదు అని ప్రజల్లో చర్చ ఉంది. కానీ, అసెంబ్లీలో చెప్పాల్సిన జవాబులు, ఓ టీవీ చానెల్​లో ఇంటర్వ్యూ పెట్టించుకొని  తమకు అనుగుణమైన  జవాబులు చెప్పుకోవడం చూస్తే.. అవినీతిపై అనుమానాలు పెరగడం తప్ప తరగవు.

కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి, సీనియర్​ జర్నలిస్ట్​