గెరువియ్యని వాన ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు

  •    ఇండ్లలోకి చేరిన వరద నీరు
  •     మూడో రోజు ఊరు దాటని దిందా గ్రామస్తులు

నెట్​వర్క్, వెలుగు : వాన గెరువిస్తలేదు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనాలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు బురదమయంగా మారాయి. ఆసిఫాబాద్ మండలం గుండి పెద్ద వాగు, కెరమెరి మండలం లక్ష్మాపూర్, అనార్​పల్లి వాగులు  ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

జిల్లా వ్యాప్తంగా 63.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులు మూడ్రోజులుగా జల దిగ్బంధంలోనే ఉండిపోయారు. ఊరికి వెళ్ళే దారిలో ఉన్న వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మించకపోవడం వల్లే ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితి ఎదర్కొంటున్నామని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో దహెగాం మండలం లోని పెద్దవాగు, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతాల్లోని వందల ఎకరాల పత్తి పంట నీట మునిగింది.

 కుంగిన నేషనల్ హైవే సర్వీసు రోడ్డు

కడెం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తేయడంతో జన్నారం మండల సమీపంలోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి పరివాహక గ్రామాల ప్రజలకు రెవెన్యూ, పోలీసులు హెచ్చరికలు జారీ చేసి గోదావరి వైపు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలతో మందమర్రి పాత బస్టాండ్ ​ఏరియాలోని నేషనల్​హైవే సర్వీసు రోడ్డు ఫీట్​ లోతుకు కుంగింది. మంచిర్యాల నుంచి మార్కెట్ వైపు వెళ్లే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఫిల్లర్ ​పక్కనున్న సర్వీసు రోడ్డు భాగం ఆదివారం ఉదయం ఒక్కసారిగా కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

కుంగిన ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు ట్రాఫిక్​ స్టాఫ్స్​ఏర్పాటు చేశారు. ఆరు నెలల కిందట అధికారులు ఈ రోడ్డును నిర్మించారు. నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతోనే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విపత్తు నివారణలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్​సిబ్బందితో ర్యాపిడ్​ యాక్షన్​ టీమ్​ను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్​కమిషనర్​ నిలిగొండ వెంకటేశ్వర్లు తెలిపారు. విపత్తు సంభవిస్తే హెల్ప్ డెస్క్ నెంబర్లను 18004253611(టోల్​ఫ్రీ) 08736293611 కు సమాచారం ఇవ్వాలన్నారు.