పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కితే ప్రాణాలు పోతున్నయ్‌‌‌‌‌‌‌‌.. 

  • పెద్దపల్లి జిల్లాలో ఇష్టారాజ్యంగా టిప్పర్లు, లారీల నిర్వహణ
  • రెండేళ్లలో రోడ్డు ప్రమాదాల్లో 100 మందికిపైగా మృత్యువాత 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కాలంటే జనం వణుకుతున్నారు. జిల్లాలో ఇటుక, ఇసుక,మట్టి, యాష్‌‌‌‌‌‌‌‌, బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, టిప్పర్లు రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండేళ్లలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 100 మందికి పైగా చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటిల్లో భారీ వాహనాల వల్ల జరిగిన ప్రమాదాలే అధికం.  పది రోజుల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఒకరు చనిపోగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. 

నిబంధనల ఉల్లంఘించినా చర్యలుండవ్‌‌‌‌‌‌‌‌..

పెద్దపల్లి జిల్లాలో ఇటుక, ఇసుక, మట్టి, యాష్‌‌‌‌‌‌‌‌, బొగ్గు రవాణా లారీలు, టిప్పర్ల ద్వారా జరుగుతుంటుంది. మానేరు రీచ్‌‌‌‌‌‌‌‌ల నుంచి ఇసుక, చెరువుల నుంచి మట్టి, ఎన్టీపీసీ నుంచి యాష్​ తరలించే టిప్పర్లు, లారీల వల్ల వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని కంట్రోల్​ చేయడంలో పోలీసులు, ఇతర శాఖల అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రమాదాల్లో ఎక్కువగా అతివేగం, డ్రంక్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌  వల్లనే జరుగుతున్నా లారీ డ్రైవర్లకు ఎప్పుడూ డ్రంక్​ అండ్​ డ్రైవ్​ టెస్ట్​ చేసిన దాఖలాలు లేవు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. కానీ సంబంధిత కాంట్రాక్టర్లు, బడా వ్యాపారులపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు కట్టడి కావడం లేదు. 

రోడ్డెక్కాలంటే జనాల్లో జంకు 

పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కాలంటే జనం జంకుతున్నారు. ఇటీవల సుల్తానాబాద్​లో ఓ లారీ డ్రైవర్​ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. రోడ్డు పక్కన నిలుచున్న వారిని ఢీకొనడంతో స్పాట్‌‌‌‌‌‌‌‌లోనే ఒకరు చనిపోగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ మరుసటి రోజే పెద్దపల్లిలో  ఓ లారీ, కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన పలువురికి గాయాలయ్యాయి. గతంలో మట్టి తరలిస్తున్న టిప్పర్​ అప్పన్నపేటలో మహిళను ఢీకొట్టడంతో ఆమె కాలు పూర్తిగా తెగిపోయింది.

పెద్దపల్లి పట్టణ నడిబొడ్డులో వేగంగా వచ్చిన ఓ లారీ.. స్కూటీని ఢీకొని ఏఎస్‌‌‌‌‌‌‌‌ఐ భాగ్యలక్ష్మి చనిపోయారు. పెగడపల్లిలోనూ బాలుడి నడుముపై లారీ టైర్​ ఎక్కడంతో మధ్యలోకి తెగిపోయాడు. ఇలాంటి సంఘటనలు నిత్యం జరగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. సంఘటనలకు బాధ్యులైన వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. చాలా ఘటనల్లో పోలీసులు నామమాత్రంగా గుర్తు తెలియని వాహనం అని కేసులు నమోదు చేస్తూ.. కేసు తీవ్రతను తగ్గిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.