ఇల్లు పీకి పందిరేస్తున్నయ్ .. ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రమైన కోతుల బెడద

  • ఏడాదిలోనే 200 మంకీ బైట్ కేసులు
  • పంటలను ధ్వసం చేస్తున్న వానరాలు 
  • బర్త్ కంట్రోల్’ ప్రకటనలకే పరిమితం 
  • కోతులను నియంత్రించాలని ఆందోళలు

మంచిర్యాల, వెలుగు: అడవుల్లో ఉండాల్సిన వానరాలు జనారణ్యంలోకి వచ్చి స్వైరవిహారం చేస్తున్నాయి. పల్లెలు, టౌన్లు అనే తేడా లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆగమాగం చేస్తున్నాయి. పొద్దంతా ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడడమే కాకుండా వీధుల్లో వెళ్లే వారిపై దాడులు చేస్తుండడంతో జనాలు భయపడుతున్నారు. చేతిలో ఏదైనా వస్తువుతో వెళ్లాలంటే జంకుతున్నారు. 

షాపుల్లోకి చొరబడి సామాన్లు ఎత్తుకుపోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు జనాలకు కోతులతో అవస్థలు తప్పడం లేదు. ఎవరైనా బెదిరించడానికి ప్రయత్నిస్తే వారి మీదపడి రక్కుతున్నాయి. మహిళలు, పిల్లలు కోతులకు భయపడి పారిపోతూ గాయాల పాలవుతున్నారు. కోతుల భయానికి కొంతమంది వేల రూపాయల ఖర్చుతో ఇండ్ల చుట్టూ జాలీలు బిగించుకుంటున్నారు.  కోతుల బెడద భరించలేక ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రను అర్థం చేసుకోవచ్చు. 

పంటలు ధ్వంసం

కోతులు అటు పంటలనూ ధ్వంసం చేస్తూ అన్నదాతలకు నష్టం కలిగిస్తున్నాయి. యాభై నుంచి వంద వరకు గుంపులుగా తిరుగుతూ పంటలపై దండెత్తుతు న్నాయి. చేన్లలో కూరగాయల తోటలను పాడుచేస్తున్నాయి. వానరాల బెడదతో కూరగాయల తోటలు సాగు చేయాలంటేనే రైతులు భయపడుతున్నారు. టమాట, బెండకాయ, దొండకాయ, దోసకాయతో పాటు ఏ కూరగాయలనూ దక్కనివ్వడం లేదని వాపోతున్నారు. మక్క, పల్లి, ఉల్లి పంటలకు కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో రైతులు వాటిని సాగు చేయడానికి జంకుతున్నారు. 

200లకు పైగా మంకీ బైట్ కేసులు 

మనుషులపై దాడి చేసేందుకు ఏమాత్రం జంకడం లేదు. ఎవరైనా బెదిరిస్తే గుంపుగా చేరి రచ్చ చేస్తు న్నాయి. లక్సెట్టిపేటలోని ఓ షాపులో ఒక కోతి గాయపడడంతో పెద్ద గుంపుగా వచ్చి షాపును చిందరవందర చేయడమే కాకుండా అందులో ఉన్నవారిపై దాడి చేశాయి. ఇటీవల నిర్మల్ జిల్లాలో ఓ మహిళపైకి దూసుకురావడంతో ఆమె భయంతో బిల్డింగ్ పైనుంచి కిందపడి చనిపోయింది. ఇలా పిల్లలు, మహిళలు, వృద్ధులు వానరాల బారినపడి హాస్పిటళ్ల పాలవుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో 200లకు మంకీ బైట్ కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్​మెంట్ తీసుకొని ప్రభుత్వం దగ్గర రికార్డు కాని కేసులు వందల సంఖ్యలో ఉన్నాయి. 

కోతులతో వేగలేక రోడ్డెక్కిన జనం

భీమారంలో కోతుల బెడద తట్టుకోలేక వారంరోజుల క్రితం ప్రజలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని వివిధ కాలనీలకు చెందినవారు బస్టాండ్ నుంచి ఎంపీడీవో ఆఫీస్ వరకు ర్యాలీ తీసి వారి బాధను వ్యక్తం చేశారు. చాలాసార్లు కోతుల సమస్యలు పరిష్కరించాలని వినతులు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. 

భీమారంలో రోజూ పది మంది కోతుల దాడిలో గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోతులను నియంత్రించడానికి గత సర్కారు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తామని చెప్పినా అది ప్రకటనలకే పరిమితమైంది. దీంతో గత ఐదారేండ్లలో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వం స్పందించి వానరాల బెడదను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

పట్టుకొని అడవుల్లో వదిలిపెట్టాలె..

విచ్చలవిడిగా తిరుగుతున్న కోతులు దాడులు చేస్తూ అనేక మందిని గాయపరుస్తున్నాయి. చాలామంది ఆస్పత్రుల పాలవుతున్నారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఫారెస్ట్ ఆఫీసర్లు వెంటనే స్పందించి కోతులను పట్టుకొని అడవుల్లో వదిలిపెట్టాలె. కోతుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి. 

మద్దెల శ్రీనివాస్, టేకులబస్తీ, బెల్లంపల్లి

కోతుల వల్ల ఒక్క చెట్టూ దక్కుతలేదు

రోజూ పొద్దటి నుంచి సాయంత్రం దాకా కోతులతో చాలా అవస్థలు పడుతున్నాం. ఇంటి దగ్గర వేసిన తోటలో కూరగాయలను దక్కనిస్తలేవు. చెట్లను సైతం పీకేస్తున్నాయి. ప్రభుత్వం, అధికారులు ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలి. 

బుచ్చిలింగం, పొనకల్, జన్నారం