ముర్రెడు వాగుతో ముప్పు!

  • వాగు ఉధృతికి కూలుతున్న ఇండ్లు, కోతకు గురవుతున్న భూములు
  • ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో 30కిపైగా నీటిపాలైన నివాసాలు 
  • గతేడాది కరకట్ట నిర్మాణానికి రూ.30 కోట్లు కావాలన్న ఆఫీసర్లు 
  • ఫండ్స్​ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయాని బీఆర్ఎస్​ సర్కారు
  • వరుసగా వానలొస్తే భయాందోళకు గురవుతున్న స్థానికులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ముర్రెడు వాగు ఉప్పొంగితే కొత్తగూడెం పట్టణంతో పాటు లక్ష్మీదేవిపల్లి మండలంలోని పలు గ్రామపంచాయతీల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాగు ఉధృతికి ఇండ్లు కూలిపోతున్నాయి.. వ్యవసాయ భూములు కోతకు గురవుతున్నాయి. గతేడాది జనవరిలో కొత్తగూడెంలో పర్యటించిన అప్పటి సీఎం కేసీఆర్​ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో ప్రజలు ఇంకా అవస్థలు పడుతున్నారు. 

ఇదీ పరిస్థితి.. 

లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్, సంజయ్​నగర్, హమాలీ కాలనీ గ్రామపంచాయతీలతో పాటు కొత్తగూడెం పట్టణంలోని ముర్రెడు వాగుకు ఇరువైపులా దశాబ్దాల కాలంగా ప్రజలు ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. కాగా కొన్నేండ్లుగా ముర్రెడు వాగు ఉధృతి ఏటేటా పెరుగుతోంది.  దీంతో ఇప్పటి వరకు 30కిపైగా ఇండ్లు కూలాయి. వాగుకు పక్కన ఐదెకరాల వరకు వ్యవసాయ భూమి కోతకు గురైంది. భారీ వర్షం వస్తే ఇండ్లలోకి వరద నీరు కూడా వస్తోంది. గతేడాది వరద నీటిలో పలు ఇండ్లలోని సామగ్రి కొట్టుకుపోయింది. 

హామీ ఇచ్చి ఫండ్స్​ ఇయ్యలే.. 

గత జనవరిలో కొత్తగూడెం పర్యటనకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్​కు అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ముర్రెడు ముప్పు గురించి వివరించారు. భూమి కోత నివారణలో భాగంగా కరకట్ట నిర్మాణానికి రూ.  150కోట్లు అవసరమని విన్నవించారు. స్పందించిన కేసీఆర్​ సమగ్ర సర్వే చేయించి ప్రపోజల్స్​ పంపితే ఫండ్స్​ ఇస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.150కోట్లతో ప్రభుత్వానికి ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపారు. 

ALSO READ : పెద్దపల్లి జిల్లాలో .. చేప పిల్లల పంపిణీ టెండర్లపై సందిగ్ధత

ప్రతిపాదనలు పరిశీలించిన ఉన్నతాధికారుల సూచనలతో లెటెస్ట్​ టెక్నాలజీ ప్రకారంగా గతేడాది జూలై నెలలో రూ. 30కోట్లతో ఇరిగేషన్​ ఆఫీసర్లు మరోసారి ప్రతిపాదనలు పంపారు. ప్రగతి భవన్​లో కేసీఆర్​ను కలిసిన టైంలో ఫండ్స్​ రిలీజ్​ చేస్తున్నట్టుగా ఆయన హామీ ఇచ్చారని వనమా స్పష్టం చేశారు. గవర్నమెంట్​ నుంచి ఫండ్స్​ రిలీజ్​ చేస్తున్నట్టుగా లేఖ కూడా వచ్చిందని అధికారులు తెలిపారు. కానీ ఫండ్స్​ రాలేదు.. పనులు కాలేదు.. కాగా ప్రస్తుతం ఆ ఫండ్స్​ కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో ఫండ్స్​ రిలీజ్​ అయ్యే అవకాశాలున్నాయని 
పేర్కొన్నారు.