కబ్జాలతో వరద ముప్పు .. నాలాలు, డ్రైనేజీలు ఆక్రమించి నిర్మాణాలు

  • పారుదలలేక రోడ్లపై నిలుస్తున్న వరద నీరు
  • ఇండ్లలోకి చేరుతున్న మురుగు
  • భారీ వర్షాలు కురిసిన ప్రతీసారి తప్పని తిప్పలు

ఖాళీ స్థలాల కబ్జాలు, ఆక్రమణలతో  కామారెడ్డి జిల్లా కేంద్రంలో  వరద ముప్పు తిప్పలుపెడుతోంది.  నాలాలు, డ్రైనేజీలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల ఫలితంగా రోడ్లపై వరద నీటితోపాటు ఇండ్లలోకి మురుగు చేరుతోంది.  భారీ వర్షాలు కురిసిన ప్రతీసారి ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. అయినప్పటికీ యంత్రాంగం మాత్రం  వరద  సమస్య పరిష్కారంపై దృష్టి సారించడం లేదు.  తాజాగా కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  మెయిన్​ రోడ్లు, పలు కాలనీల్లో రోడ్లపై నీరు నిలిచి రాకపోకలు స్థంభించాయి.  ఇండ్లలోకి వర్షపు నీరు రావటంతో జనం ఇబ్బందిపడ్డారు.  భారీ వర్షమే కాకుండా చిన్నపాటి వర్షం కురిసినా ఇదే పరిస్థితి.

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డిలో రోడ్లు, డ్రైనేజీలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.   నిర్మాణాల కారణంగా రోడ్లు ఇరుకుగా మారటమే కాకుండా వర్షాకాలంలో వరద నీరు కూడా ప్రవహించటం లేదు.   రోడ్లకు ఇరువైపులా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు.   భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీలను తగినంతగా నిర్మించడంలేదు. దీనికి తోడు ఉన్న డ్రైనేజీలను ఆక్రమించి వాటిపై కబ్జాదారులు భవనాలను నిర్మిస్తున్నారు.

దీంతో వరద నీరు డ్రైనేజీలోకి వెళ్లే పరిస్థితి లేక రోడ్లపై నిలుస్తోంది.  అంతేకాకుండా వెహికల్స్​ రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.  నాలాలను కూడా ఆక్రమించి నిర్మాణాలు  చేపట్టారు.   రెండు రోజులపాటు జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి పలు కాలనీలు, మెయిన్​ రోడ్లు జలమయమయ్యాయి.  దీనికి అధికారులు, పాలకుల నిర్లక్ష్యమే కారణమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అక్రమ నిర్మాణాల ఫలితం 

  • కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్​ కాలనీ జన్మభూమి రోడ్డు 80 ఫీట్ల రోడ్డు.  ఈ  రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో 40 ఫీట్లకు కుదించుకుపోయింది.   రోడ్డుకు ఇరువైపులా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు.  మురుగు కూడా రోడ్డుపైనే పారుతోంది. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరి దారుణం.  వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇక్కడి నుంచి నీరు నిజాంసాగర్​ రోడ్డుపైకి, ఆర్యనగర్​, విద్యానగర్​గుండా ఇండ్లలోకి చేరుతోంది. 
  • నిజాంసాగర్​ రోడ్డుకు ఇరు వైపులా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు.  ఇక్కడ నాలాలను ఆక్రమించి భవనాలు నిర్మించారు.  డ్రైనేజీలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు.  వర్షపు నీరు  డ్రైనేజీలోకి పారే పరిస్థితి లేదు.  దీంతో రోడ్డుపైనే నిలుస్తోంది. వరద నీటిలో వెహికల్స్​ చిక్కుకుపోతున్నాయి. నిజాంసాగర్​ రోడ్డు నుంచి  కామారెడ్డి పెద్ద చెరువు వైపు ఉన్న కాల్వను సైతం ఆక్రమణకు గురైంది.
  • కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పారి  ప్రవహించే  వాగుకు  ఇరువైపులా బఫర్​ జోన్​ లేదు.  10  మీటర్ల వాగు  ఉంటే కనీసం ఇరువైపులా రెండు మీటర్ల మేర బఫర్​ జోన్​ వదిలి నిర్మాణాలు చేపట్టాలి.  కానీ, వాగుకు ఆనుకొని భవనాలు నిర్మించారు.  ఆదివారం చెరువు అలుగుపారడంతో  నీరు కాలనీల్లోకి , జీఆర్ కాలనీలో ఇండ్లలోకి నీరు చేరింది.
  •  రామారెడ్డి రోడ్డులో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు.  జిల్లా కేంద్రంలోని పలు ఏరియాల్లో వర్షపు నీరు రామారెడ్డి రోడ్డు వైపు వెళ్తుంది.  రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో  రాకపోకలు స్థంభించాయి. 
  •  స్టేషన్​రోడ్డులో ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ లేదు. చిన్న పాటి డ్రైనేజీ ఉండటం కంప్లీట్​గా పూడుకుపోయింది. వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచి వెహికల్స్ రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.