మంచి చేసే వారికి సహకరించాలి

మా రోడ్లు పటిష్టంగా, నాణ్యతగా ఉన్నాయి కాబట్టి, మా దేశము అభివృద్ధి చెందింది. అంతేకాని మేము అభివృద్ధి చెందిన తర్వాత మా రోడ్లను అభివృద్ధి చేసుకోలేదు. అని అప్పటి అమెరికా దేశ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడి ఒక సందర్భములో అన్న విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకుందాం. ఒక దేశాన్ని లేదా ఒక నగరాన్ని అభివృద్ధి చెయ్యాలన్నా పాలించే పాలకునిపై ఆధారపడి వుంటుంది. రాజరికంలో కూడా రాజలు తమ రాజ్యాలను చక్కగా నిర్మించుకున్నారు. ఇప్పటికీ కొన్ని దేశాలలో ఆ నిర్మాణాలని చూడడానికి పర్యాటకులు వస్తూనే వుంటారు. 

ఏ దేశమైతే పర్యాటకులను ఆకర్షిస్తుందో ఆ దేశం అభివృద్ధిలో నడుస్తుంది. కొన్ని నగరాలు అందంగా నిర్మించబడుతాయి. కొన్ని ప్రకృతి పరంగా గ్రీనరీ, నదులు, కొండలు, గుహలతో అందంగా వుండి పర్యాటకులను ఆకర్షిస్తాయి. దీనికి పాలనలో నిజాయితీ తోడై చక్కటి రోడ్లు నడవడానికి చక్కటి ఫుట్పాత్​లు, ఉద్యానవనాలు, పరిశుభ్రత, రక్షణ ఉంటే ఆ ప్రాంతానికి ఔత్సాహిక, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. పెట్టుబడులు వచ్చినప్పుడు యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.

ఒక పాలకుడు ముందు చూపుతో మంచి ఆలోచనతో నిస్వార్ధంగా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే అక్కడ ప్రజలకు జీవనోపాధికి ఇబ్బంది వుండదు. అన్ని రంగాల ప్రజలు ఆనందంగా వుంటారు. రాజరికంలో ఒక రాజు ప్రజలకు మంచి చెయ్యాలన్నా ఖచ్చితంగా అమలు జరిగేది. నిరంకుశ, స్వార్థపూరిత రాజులు ప్రజలకు చెడు చేయాలన్నా చెడు చేసేవారు, దిక్కరించే సాహసం కూడా ప్రజలు చేసేవారు కాదు. ఆ రాజు మరణిస్తే కానీ, లేదా మరియొక రాజు వచ్చి దండయాత్ర చేస్తే తప్ప ఆ ప్రజలకు విముక్తి వుండేది కాదు. కాని ప్రస్తుత రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో మంచి పాలకులను ఎన్నుకునే అధికారం మనకు ఓటు హక్కు కల్పించింది. ప్రజలు తమ ఓటు హక్కుతో పాలకులను మార్చుకుంటున్నారు. అధికార మార్పిడి జరుగుతున్నప్పటికీ పాలకులు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. 

ఈ మధ్య కాలములో వీధి కుక్కలు విచ్చలవిడిగా చిన్న పిల్లలను కరవడం, లాకెళ్ళడంలో మరణాలు సంబంధిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు 4 లక్షల వీధి కుక్కలున్నాయని ఒక రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నాం. వీధులలో నడవాలంటే కుక్కల బెడదతో నడవలేక చిన్న చిన్న దూరాలకు కూడా వాహనాలు ఉపయోగించేవారు లేకపోలేదు. వీటిపై ప్రత్యేకమైన అధికారిని నియమిస్తే పూర్తిగా కుక్కుల బెడద నుండి కాపాడవచ్చును. నిజాయితీ గల, సమర్థవంతమైన, చిత్తశుద్ధిగల అధికారి కొరకు ప్రభుత్వము వెతకాలి. ఈ రోజు హైడ్రా శ్రీ రేవంత్ రెడ్డి  ప్రభుత్వంలో మంచి ఫలితాలు అందిస్తుంది. ఎటువంటి ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గేదిలేదు. 

హైదరాబాద్ నగరంలో వేల గొలుసుకట్టు చెరువుల నుండి వందల చెరువులకు చేరుకుంది. గత పాలకుల నిర్లక్ష్యం, అజ్ఞానంతో చెరువులు స్వార్థ పరులకు అంకితమైనాయి. ప్రజల దాహార్తిని తీర్చిన ఒకనాటి మూసీ నది ఈనాడు కంపుకొడుతోంది. వ్యర్థ జలాలను ట్రీట్ చెయ్యకుండా మూసీ నదిలోకి వదలడం దానితో పాటు కబ్జా చేసి నిర్మాణాల వ్యర్థాలను నింపడం దానిని కబ్జా చేసి ఇళ్ళ నిర్మాణాలు చేపట్టి హైదరాబాద్ నగరంలో నడి బొడ్డున పారుతున్న మూసీని చూడలేక ముక్కు మూసుకొని పోతున్నాము. మూసీ పరివాహాక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నీటిలో బోటింగ్, సైకిల్ ట్రాక్లు నిర్మించి సదుపాయాలు కల్పిస్తామని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. నిజంగా ఈ పనిని చేపడితే ఎన్నటికీ ప్రజలు పాలకులను మరువరు. 

శాశ్వతమైన పరిష్కారం కొరకు అన్వేషించాలి

ఈ రోజు ప్రజల పన్నులతో జీతాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు వారికి సేవలందించక ప్రజల హక్కుగా పొందేవాటికి ధరను నిర్ణయించి ప్రజలను బాధపెడుతుంటే పాలకులు చెవిటి వారిలాగా, గుడ్డి వారిలాగా ప్రవర్తిస్తే వారిని నిర్ధాక్షిణ్యంగా హెచ్చరించాలి. కానీ, ఆ పనిని మనం చెయ్యలేము, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోలేము. కానీ ఈ రోజు ప్రభుత్వం రోజుకి నలుగురి చొప్పున రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకుంటుంటే అధికారులలో భయము మొదలైంది. ఈనాడు అభివద్ధి పథంలో వున్న దేశాలన్ని కూడా ఇటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు ఒకనాడు తీసుకున్నారు. 

కాబట్టి వారు మనకంటే ముందున్నారు. ఇటువంటి మంచి చర్యలకు ప్రజలు అభినందించాలి. లేదంటే కంచే చేనును మేస్తుంది.  అదేవిధంగా ప్రజలకు మంచి ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించాలి. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు పోవడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పటికీ సదుపాయాలు లేక మందులు లేక ప్రజలు సతమతమౌతున్నారు. మంచినీరు కూడా అన్ని టెస్టులు జరిపి ప్రజలకు అందివ్వాలి. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు పరిస్తే దేశములోనే మన రాష్ట్రం అగ్రగామిగా వుంటుంది. జి.డి.పి. దానంతట అదే  పెరుగుతుంది. 

- సోమ శ్రీనివాస్ రెడ్డి
సెక్రెటరీ, ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్​