డబుల్​ బెడ్​ రూమ్ .. ఇండ్ల పొజిషన్ ​ఏమిటి!

  • ఫిల్డ్​విజిట్​చేసి, ఫొటోల తీయండి
  • త్వరగా రిపోర్ట్​ ఇవ్వాలని ఆఫీసర్లకు కలెక్టర్​ ఆదేశం
  • జిల్లాలో ఆయా స్టేజీల్లో ఉన్న ఇండ్లు 3,422
  • టెండర్లు కూడా పిలువనివి 1,038

కామారెడ్డి, వెలుగు : గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం అర్హులైన వారికి డబుల్​బెడ్​రూమ్ ​ఇండ్లు కట్టివ్వాలని నిర్ణయించింది. గడిచిన పదేండ్లలో ఈ స్కీమ్ ​క్షేత్రస్థాయిలో ఆశించిన మేర అమలు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి రావడంతో డబుల్ బెడ్​రూమ్​ ఇండ్ల పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంతో డబుల్​ ఇండ్ల పొజిషన్​పై రిపోర్ట్ ​ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ జితేశ్​వీ పాటిల్ తహసీల్దార్లు

ఆయా శాఖల ఆఫీసర్లను ఆదేశించారు. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో రూ. 565 కోట్ల అంచనా వ్యయంతో 10,765 ఇండ్లు శాంక్షన్​ చేశారు. ఇప్పటి వరకు 7,343 ఇండ్లు కంప్లీట్​కాగా, 3,422 ఇండ్లు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. వీటి పనులను మధ్యలో ఆపేశారు. 1,038 ఇండ్ల పనులు ఇంకా షురూ కాలేదు. నిర్మాణం పూర్తయిన వాటిలో కూడా కొన్నింటిని పంపిణీ చేయలేదు.

పరిస్థితి ఇది..

కామారెడ్డి నియోజకవర్గానికి 1,715 ఇండ్లు శాంక్షన్​కాగా, 1,567 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతావి వివిధ స్టేజీల్లో నిర్మాణాల్లో ఉన్నాయి.  మున్సిపాలిటీ పరిధిలో 750 ఇండ్లను అసెంబ్లీ ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు తాళాలు అప్పగించగా, పట్టాలు ఇవ్వలేదు. ఎల్లారెడ్డికి 1, 689 శాంక్షన్ ​చేస్తే ఇందులో 403 మాత్రమే కంప్లీటయ్యాయి. 1,328 ఇండ్ల పనులకు అసలు టెండర్లు కూడా పిలువలేదు.

బాన్సువాడకు 5,895 ఇండ్లు మంజూరు కాగా 4,953 ఇండ్లు పూర్తయ్యాయి. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 942 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. జుక్కల్​ నియోజకవర్గానికి 1,466 శాంక్షన్​చేస్తే 420 మాత్రమే కంప్లీట్​చేశారు. 1,046  ఇండ్ల పనులను వివిధ స్టేజీల్లో పనులు ఆపేశారు. 

 ఆరా తీస్తున్న యంత్రాంగం

కామారెడ్డి కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్ ​నాలుగు రోజుల కింద తహసీల్దార్లు, ఇంజనీరింగ్​ శాఖల ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. మండలాల వారీగా శాంక్షన్ ​చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లెన్ని, అవి ఏ స్టేజీల్లో ఉన్నాయనే వివరాలపై రిపోర్ట్​ ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ ​ఆదేశాలతో ఆయా చోట్ల ఆఫీసర్లు ఇండ్లను పరిశీలిస్తున్నారు.

క్షేత్ర స్థాయి నుంచి రిపోర్టులు వెళ్లిన తర్వాత ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. కంప్లీటయిన ఇండ్ల పంపిణీ, అసలు పనులు చేయని చోట ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే అవకాశముందని అంటున్నారు.