సుల్తానాబాద్, వెలుగు: క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, దానిలో భాగంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే విద్యాలయాల అండర్–17 క్రీడా పోటీలను బుధవారం సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ స్కూల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ 2024 పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, టెన్నిస్, షటిల్, క్యారం, చెస్, అథ్లెటిక్స్ విభాగాల్లో సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అంతకుముందు సుల్తానాబాద్ మార్కెట్ యార్డులో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్‌ను ప్రారంభించారు. వడ్ల కటింగ్ అనేదే ఉండొద్దని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట లైబ్రరీ సంస్థ జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మి, ప్రిన్సిపాల్ జె.రాజేశం, ఎంజేపీ విద్యాలయాల జిల్లా కన్వీనర్ మణిదీప్తి, డీసీవో శ్రీమాల, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, లీడర్లు ప్రకాశ్‌రావు, మహేందర్, చిలుక సతీశ్, జానీ పాల్గొన్నారు.