కోళ్ల దాణాకే రేషన్​ బియ్యం..!

  • దొడ్డిదారిన క్వింటాళ్లకు క్వింటాళ్లు తరలుతున్న పీడీఎస్ రైస్
  • దందా సాగిస్తున్న కొందరు అక్రమార్కులు 
  • రేషన్ డీలర్లు, మిల్లర్ల సపోర్ట్ తో నూకలుగా మార్చి ఎక్స్​పోర్ట్​
  • ఆఫీసర్లపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు

హనుమకొండ, వెలుగు: పేదల కడుపు నింపేందుకు సరఫరా చేస్తున్న పీడీఎస్ రైస్ అక్రమార్కుల పరమవుతున్నాయి. కొంతమంది రేషన్ డీలర్లు, అక్రమార్కుల పుణ్యమాని నిరుపేదలకు అందాల్సిన బియ్యం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పౌల్ట్రీ ఫారాలకు చేరుతున్నాయి. రైస్ మిల్లుల సహకారంతో బియ్యాన్ని నూకలుగా మార్చి కోళ్ల దాణాగా సరఫరా చేస్తున్నారు. దీంతో పేదల కడుపు నింపాల్సిన బియ్యంతో దందా చేస్తున్న వ్యాపారులు రూ.కోట్లు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లై, పోలీస్ ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

పేదల బియ్యం అక్రమార్కుల పాలు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 2,310 రేషన్ షాపులున్నాయి. వీటిలో 12.02 లక్షల రేషన్ కార్డులుండగా, 32.61 లక్షల వరకు లబ్ధిదారులున్నారు. వారందరికీ ఆరు కిలోల చొప్పున ప్రతినెలా సుమారు 20 వేల టన్నుల వరకు బియ్యాన్ని సప్లై చేస్తున్నారు. కాగా, కొందరు రేషన్ డీలర్లు బియ్యాన్ని అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారు. షాప్ కు వెళ్లే లబ్ధిదారులతో బయోమెట్రిక్ వేయించుకుని, ఇవ్వాల్సిన బియ్యానికి కిలోకు రూ.7 నుంచి రూ.10 వరకు నగదు చెల్లించి, బియ్యాన్ని వ్యాపారులకు అప్పగిస్తున్నారు. ఇంకొందరు వ్యాపారులు నేరుగా లబ్ధిదారుల నుంచే బియ్యాన్ని కొనుగోలు చేసి, రూ.20 నుంచి రూ.25 ధరతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

కోళ్ల ఫారాల్లోనే వందల క్వింటాళ్లు

రేషన్ డీలర్లు, లబ్ధిదారుల నుంచి బియ్యం సేకరిస్తున్న అక్రమార్కులు నూకలుగా మార్చి పౌల్ట్రీ ఫామ్స్, పిగ్ ఫామ్స్ కు తరలిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో తాజాగా టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడుతున్న బియ్యమే ఇందుకు సాక్ష్యం.  20 రోజుల్లో 16 చోట్లా టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టి రేషన్ బియ్యం, నూకలను పట్టుకోగా, అందులో చాలా వరకు పౌల్ట్రీ ఫామ్స్ లో పట్టుకున్నవే. ఈ నెల 17న ఐనవోలు మండలం పంతిని శివారులోని శారదా పౌల్ట్రీ, అభిరాం సాయి పౌల్ట్రీ ఫామ్స్, 18న వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలోని కిరణ్ కుమార్ పౌల్ట్రీ ఫామ్, 21న గీసుగొండ మండలం ఎల్కుర్తి హవేలి సమీపంలోని జ్ఞానశ్రీ పౌల్ట్రీ ఫామ్, 20న గీసుగొండ సమీపంలోని సంతోషిమాత పౌల్ట్రీ ఫామ్, బాసాని శౌర్రెడ్డికి చెందిన పిగ్ ఫామ్ లో క్వింటాళ్ల కొద్ది రేషన్ బియ్యం, నూకలు ఉండగా, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు రైడ్ చేసి, ఓనర్లపై కేసులు నమోదు చేశారు. దాదాపు రూ.5 లక్షల విలువ చేసే బియ్యం, నూకలు సీజ్ చేశారు.

మిల్లులపై చర్యలేవీ..?

రేషన్ బియ్యం నూకలుగా మార్చి పౌల్ట్రీ ఫామ్ లకు తరలించడంలో రైస్ మిల్లులే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆగస్టు 17న హసన్​పర్తి మండలం సీతానాగారం వెంకటేశ్వర రైస్​ మిల్ లో పెద్ద ఎత్తున రేషన్​ బియ్యం, నూకలు పట్టుబడ్డాయి. పౌల్ట్రీ ఫామ్స్ కు తరలించేందుకు సిద్ధంగా ఉన్న దాదాపు 8.07 లక్షల విలువైన 323 క్వింటాళ్ల బియ్యం, నూకలను పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఈ నెల 15న పరకాలలోని జ్యోతి రైస్ మిల్ లో రూ.2.63 లక్షల విలువైన 101 క్వింటాళ్లు, వరంగల్ జిల్లా నెక్కొండ సమీపంలోని కనకదుర్గ రైస్ మిల్ లో 22 క్వింటాళ్లు సీజ్ చేశారు.

15న పరకాల సమీపంలోని శ్రావణ్ కుమార్​బిన్నీ రైస్​ మిల్ లో ఏకంగా రూ.12.81 లక్షల విలువైన 515.5 క్వింటాళ్ల బియ్యం, నూకలు పట్టుబడ్డాయి. అంతకుముందు నెక్కొండలోని మల్లికార్జునస్వామి రైస్ మిల్, అక్రమార్జనకు తెరలేపిన కొన్ని మిల్లులు రేషన్ బియ్యం అని తెలిసినా వాటిని నూకలుగా మారుస్తూ పీడీఎస్ రైస్ దందాకు సహకరిస్తున్నాయి. అయినా వాటిపై సివిల్ సప్లై, పోలీస్ ఆఫీసర్లు యాక్షన్ తీసుకోకుండా లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి, రేషన్​ బియ్యం పక్కదారి పట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.