రాష్ట్ర ఆదాయం ఎక్కడ తగ్గిందో కేటీఆర్​ చెప్పాలి : పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్

  • అధికారం పోయిందనే బీఆర్ఎస్ నేతల అడ్డగోలు మాటలు: పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్
  • వాళ్లు చేసిన అప్పులకే రాబడిలో 60 శాతం వడ్డీలు, కిస్తీలు కడుతున్నం 
  • అవినీతి పాలన వద్దనే ప్రజలు తమ ప్రభుత్వాన్ని  ఎన్నుకున్నారని వ్యాఖ్య

నిజామాబాద్, వెలుగు: అధికారం పోయిందనే అక్కసుతో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు​విమర్శలు చేస్తున్నారని పీసీసీ ప్రెసిడెంట్​మహేశ్​​కుమార్​ గౌడ్​ మండిపడ్డారు. ప్రజల ఛీత్కారంతో అధికారం కోల్పోయాక కేటీఆర్​లో అసహనం పెరిగిందని, చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఫైర్​అయ్యారు.

 సీఎం రేవంత్​రెడ్డి సర్కారుతో రాష్ట్ర ఇన్​కం తగ్గిందని కొత్తగా అబద్ధాలు ప్రచారం షురూ చేశారని, ఆదాయం ఎక్కడ తగ్గిందో చూపెట్టాలని మహేశ్​గౌడ్ ​డిమాండ్ చేశారు. మంగళవారం నిజామాబాద్​లోని నీలకంఠేశ్వరాలయంలో ఆయన పూజలు చేశారు. అనంతరం మహేశ్​గౌడ్​మీడియాతో మాట్లాడారు. పదేండ్లు అధికారంలో ఉండి కేవలం అప్పులు చేయడమే తమపనిగా వ్యవహరించారన్నారు. 

రాష్ట్ర రాబడిలో 60 శాతం నిధులు బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పుల వడ్డీలు, కిస్తులకే  పోతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని  తెలిసి కూడా రూ.లక్షా 20 వేల కోట్ల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. అవినీతి, నియంతపాలన వద్దనుకునే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు.  

హైడ్రా ఫోకసంతా అక్రమ కట్టడాలపైనే.. 

‘‘హైదరాబాద్​సిటీలోని చెరువులు, కుంటలు కుంచించుకుపోవడానికి మీ నాయకులే కారకులు. మీతో అంటకాగి చెరువులు, కుంటలను కబ్జా చేసిన నాటి మీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నిర్మాణాలు కూల్చవద్దంటున్నారా? ప్రజాహితం కోసం అలాంటి అక్రమ కట్టడాలను కూలుస్తామంటే మీకు నొప్పేంటి? మూసీ ప్రక్షాళన ఎందుకు వద్దంటున్నరు” అని మహేశ్​గౌడ్​ప్రశ్నించారు.

 బీఆర్​ఎస్​నేతలకు వారి స్వార్థం తప్ప ప్రజల అవసరాలు వారికి అనవసరమన్నారు. హైడ్రాకు తన, మన భేదం లేదని, అక్రమ కట్టడాలను కూల్చేయడమే టార్గెట్​గా పనిచేస్తుందన్నారు. పేదల కట్టడాలు కూల్చాల్సి వస్తే ప్రభుత్వం మానవతా దృక్పథంతో పునరావాస ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా తరహా వ్యవస్థలు ఏర్పాటు చేయబోతున్నామని మహేశ్​గౌడ్​స్పష్టం చేశారు.

హత్యా రాజకీయాలు సరికాదు

ప్రజాస్వామ్య వ్యవస్థలో హత్యా రాజకీయాలకు తావులేదని మహేశ్​​కుమార్​ గౌడ్​అన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్​ నేత మారు గంగారెడ్డి హత్యోదంతాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ హత్యలు, దాడులు తెలంగాణ సంస్కృతి కాదని, హంతకులు ఎవరైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నుడా చైర్మన్​ కేశవేణు, ఆర్మూర్​ సెగ్మెంట్​ ఇన్​చార్జ్​ వినయ్​రెడ్డి, నరాల రత్నాకర్​ తదితరులు పాల్గొన్నారు.