బీఆర్ఎస్​ నేతలు 1,500 చెరువులను కబ్జా చేశారు

  • మూసీని బాగుచేస్తుంటే అవినీతి అంటున్నరు
  • పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్ ఫైర్
  • హైదరాబాద్ మరో వయనాడ్  కాకూడదంటే ప్రక్షాళన తప్పదు

నిజామాబాద్, వెలుగు: ప్రజలకు ఉపయోగపడే 1,500 చెరువులను బీఆర్ఎస్  నేతలు కబ్జా చేశారని పీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్ ​కుమార్​ గౌడ్  ఆరోపించారు. తమ ప్రభుత్వం హైదరాబాద్​లో మూసీ నదిని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్  నేతలు ఇంగిత జ్ఞానం లేకుండా అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రక్షాళన జరిగి తీరుతుందని, నిజామాబాద్​ జిల్లాలో కూడా హైడ్రా తరహా వ్యవస్థ తప్పక వస్తుందన్నారు. 

శనివారం ఇందూరులో మీడియాతో ఆయన చిట్ చాట్​ చేశారు. రాష్ట్రాన్ని రూ.ఏడున్నర లక్షల కోట్ల అప్పులతో తమకు అప్పగించినా ప్రజలికిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్​ మాఫీ చేసిన పంట రుణాల విలువ ఎంతో హరీశ్ ​రావు చెప్పాలని డిమాండ్​ చేశారు. తాము అధికారం చేపట్టిన 9 నెలల్లోనే రూ.18 వేల కోట్లు మాఫీ చేశామని, దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్​ చేశారు. 

నాయకులందరికీ అందుబాటులో ఉండే హరీశ్ ​రావు మంచోడనుకున్నానని, ఆయన అబద్ధాలు మాట్లాడతాడనుకోలేదని ఎద్దేవా చేశారు. హైడ్రాపై కూడా బీఆర్ఎస్  నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.  చెరువుల సంరక్షణ అవసరమని, లేకపోతే మున్ముందు హైదరాబాద్​లో వయనాడ్  లాంటి పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా ఏర్పాటుపై వ్యక్తిగతంగా సీఎం రేవంత్ ​రెడ్డిని అభినందించానన్నారు. ఇటీవల వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ ఫాంహౌస్​ నుంచి బయటకు రాలేదని విమర్శించారు. 

నిజాం షుగర్  ఫ్యాక్టరీ రీఓపెన్​కు కట్టుబడి ఉన్నాం

తన రాజకీయ ఎదుగుదలలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని మహేశ్ గౌడ్ తెలిపారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల పరిష్కారానికి తన పరిధిలో చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్​కు కట్టుబడి ఉన్నామని చెప్పారు. నిజామాబాద్  జిల్లాకు మరో మెడికల్​ కాలేజీ అవసరమని, స్పోర్ట్స్​ స్టేడియంను అభివృద్ధి చేస్తామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి జిల్లాకు చెందిన బాక్సర్లు హసన్​ అలీ, నిఖత్​ జరీన్​ను డీఎస్పీలుగా నియమించామని చెప్పారు.