హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య బాధాకరమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై తాను పోలీసులతో మాట్లాడానని, నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్లు చెప్పారు. ఈ కేసును పార్టీ పరంగా మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.
మార్కెట్ కమిటీలో అవకాశం
కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కిసాన్ కాంగ్రెస్ నేతల పాత్ర విస్మరించరానిదని, వారికి మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీలలో ప్రాధాన్యతనిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి చీఫ్ గెస్టుగా హాజరైన పీసీసీ చీఫ్..రాబోయే రోజుల్లో వివిధ కార్పోరేషన్ ల పదవుల్లో, పార్టీ పరంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని సరిచేస్తానన్నారు.
నియోజకవర్గ స్థాయిలో నాయకులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కిసాన్ కాంగ్రెస్ నేతలను పీసీసీ చీఫ్ కోరారు. సోషల్ మీడియాపై కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. బీఆర్ఎస్ ఇంతగా దిగజారి రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని కిసాన్ కాంగ్రెస్ కేడర్ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.