పత్రలేఖ పాల్. బాలీవుడ్ నటి. అయితే తనకంటూ ఈ గుర్తింపు రావడానికి చాలాకాలం పట్టింది. సినిమాలు చేస్తున్నా, సక్సెస్ అవుతున్నా.. ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు మొన్నమొన్నటివరకు రాలేదు. నిజానికి ఆమె ఎన్నుకునే స్క్రిప్ట్‌లు, చేసే పాత్రలు ఆమెకు ఎప్పుడో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాల్సింది. ఆలస్యం అయితేనేం! ఇప్పుడు ఆమె పేరు బాలీవుడ్లో బాగానే వినిపిస్తోంది. ‘ఐసీ 814 : ది కాందహార్ హైజాక్’ సిరీస్‌లో ఆమె చేసిన పాత్ర ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించేందుకు పదేండ్లు ఫైట్ చేసిన ఆమె జర్నీ ఇది...
బాధల్లో కనెక్ట్ అయ్యాం
నా సెకండ్ ఫిల్మ్ ‘లవ్ గేమ్స్’ ఫ్లాప్ అవడంతో నేను చాలా బాధలో ఉన్నా. అదే టైంలో రాజ్‌కుమార్ వాళ్ల అమ్మ చనిపోయారు. అలా ఇద్దరం ఒకే టైంలో బాధల్లో ఉన్నప్పుడు కనెక్ట్ అయ్యాం. తను నన్ను మొదటినుంచి ఇప్పటివరకు ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాడు. అయితే కెరీర్ బిగినింగ్‌లో చాలామంది నాతో ‘మీ బాయ్‌ఫ్రెండ్ పెద్ద స్టార్ కదా. తనని అడిగితే అవకాశాలు ఇప్పిస్తాడు. అడగొచ్చు కదా’ అనేవాళ్లు. కానీ, అలా అడిగితే నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. అందుకని నేనా పనిచేయలేదు.
మాది బెంగాలీ ఫ్యామిలీ. నేను పుట్టి పెరిగింది షిల్లాంగ్‌లో. నాన్న చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసేవారు. అమ్మ హోమ్ మేకర్. మేం ముగ్గురం తోబుట్టువులం. మాకు అన్ని విషయాల్లో ఒకేలాంటి ప్రియారిటీ ఉండేది. విమెన్స్ కాలేజీకి వెళ్లేవరకు నాకు లింగ వివక్ష అనేది తెలియదు. మా పేరెంట్స్ మమ్మల్ని అలా పెంచారు. నాతో, నా సిస్టర్‌తో అమ్మానాన్నలు ఎప్పుడూ ‘పెండ్లి చేసుకోవద్దు. ముందు కెరీర్ మీద దృష్టి పెట్టండి’ అని చెప్తుండేవాళ్లు. కానీ సమాజం చూస్తే అలా లేదు. ‘పెళ్లెప్పుడు?’ అనే అడుగుతుంటారు. అంతెందుకు నా ఫ్రెండ్స్ అయితే ఇరవై ఏండ్లు దాటగానే పెండ్లి చేసుకున్నారు.
పెండ్లి తర్వాత వర్క్ చేస్తున్నారు వాళ్లు. కొందరు అయితే ఇంకా పెండ్లి చేసుకోలేదు. సంస్కృతిలో మార్పు అవుతూ వస్తోంది.నా ఎడ్యుకేషన్ విషయానికొస్తే.. అస్సాంలో స్కూల్ చదువు పూర్తి అయ్యింది. బెంగళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేశాక పై చదువుల కోసం ముంబయిలోని హెచ్.ఆర్ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో చేరా. కాలేజీలో చదివేటప్పుడే బ్లాక్ బెర్రీ, టాటా డొకొమో వంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్లో నటించా. భరతనాట్యం నేర్చుకున్నా. సినిమా ఇండస్ట్రీలో మాకు తెలిసిన వాళ్లెవరూ లేరు.
సక్సెస్.. ఫెయిల్యూర్.. డైలమా
సినిమాల్లో అవకాశం కోసం నేను చాలా కష్టపడ్డా. కమర్షియల్ యాడ్స్ చేశా. ఆ యాడ్స్‌లో చూసి కాస్టింగ్ డైరెక్టర్లు నాకు ఫోన్ చేసేవాళ్లు. అయితే యాడ్స్, సినిమాలకు చేయడంలో చాలా తేడా ఉంటుంది. అందుకని నేను వర్క్‌షాపులు చేయాల్సి వచ్చింది. మొదటి సినిమా ‘సిటీ లైట్స్’ చేసేటప్పుడు నాకు 24 ఏండ్లు. అందులో నాది తల్లి పాత్ర. వలస వెళ్లి బతుకుతున్న కుటుంబంలోని ఇల్లాలి పాత్ర అది. ఆ సినిమా క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. నా పాత్రకు గుర్తింపు వచ్చింది. కానీ, అవకాశాలు మాత్రం చాలా తక్కువ వచ్చాయి. అప్పుడు ఇదసలు వర్కవుట్ అవుతుందా?
లేదా? అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా. కానీ, ఎంచుకోవడానికి కథలే లేవు నా దగ్గర. అలా ఆరు నెలలు ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘లవ్ గేమ్స్’ అనే మూవీలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. పైగా నాపై కూడా చాలా దారుణమైన రివ్యూస్ వచ్చాయి. ఆ టైంలో నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్లు కూడా లేరు. దాంతో నేను డైలమాలో పడిపోయా. నా కెరీర్ వెనకపడింది.
పదేండ్ల తర్వాత పెండ్లి
నా మొదటి సినిమా ‘సిటీ లైట్స్’ రాజ్ కుమార్ రావుతో కలిసి నటించా. ఆ పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఏడేండ్లు డేటింగ్ చేశాం. మా నాన్న నన్ను పెండ్లి చేసుకోమనేవాళ్లు. మేం కూడా పెండ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. పదేండ్ల తర్వాత.. మా పెండ్లి జరిగింది. అయితే.. మేం పెండ్లి చేసుకునే టైంకి మా నాన్న సిమ్లాలో ఉన్నారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మాకు శాశ్వతంగా దూరమయ్యారు. దాంతో ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయింది. అప్పుడు నేను మా అమ్మతో పెండ్లి డేట్ మార్చడం గురించి మాట్లాడా. దానికి మా అమ్మ .. ‘నువ్వు ఆ డేట్లోనే పెండ్లి చేసుకోవాలి.
ఎందుకంటే చివరగా ఆయనకు తెలిసిన డేట్ అదే. ఆ రోజు వస్తుందని ఆయన హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఆ రోజే నీ పెండ్లి జరగాలి’ అని చెప్పింది. అలా ఒక పక్క బాధలో ఉన్నా మా పెండ్లి జరిగింది. నా భర్త రాజ్ అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉంటాడు. అలాంటి సిచ్యుయేషన్‌లో అన్నీ వదిలిపెట్టి రెండు నెలలు మాతోనే షిల్లాంగ్‌లో ఉండిపోయాడు రాజ్. అదే టైంలో కొవిడ్ ప్యాండెమిక్ కావడంతో లాక్ డౌన్ అయింది. అప్పుడు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేశాడు. మా నాన్న ఆఫీస్, బ్యాంక్ పనులు దగ్గరుండి చూసుకున్నాడు.
అలా గుర్తించేవాళ్లు
సినిమాల్లో నటిస్తున్నప్పటికీ నన్నొక నటిగా కాకుండా రాజ్ కుమార్ గర్ల్ ఫ్రెండ్ లేదా పార్ట్నర్గా మాత్రమే గుర్తించేవాళ్లు. మొదట్లో నాకు అది నచ్చేదికాదు. ఎందుకంటే ఎంత పార్ట్నర్ అయినా తనకు ఒక పేరు ఉంటుంది. పేరుతో పిలవొచ్చు లేదా తను కూడా ఒక యాక్టర్ అని గుర్తించినా పర్లేదు. అవన్నీ పక్కనపెడితే నాకంటూ ఒక కెరీర్ ఉంది. నేను నటిని. సినిమాల్లో చేస్తున్నా.
అలా ఎందుకు గుర్తించట్లేదు? అనేది నాకు అర్థం అయ్యేది కాదు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే.. నేను ఏం చేసినా వాళ్లని మార్చలేను. నా పని నేను చేసుకుంటూ పోవాలంతే. గుర్తింపు దానంతటదే వస్తుంది. ఇప్పుడైతే నన్ను వాళ్లు పిలిచినా పట్టించుకోవట్లేదు. నా లైఫ్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇలాంటివి నన్ను బాధపెట్టలేవు. ఎందుకంటే యాక్టింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఎన్ని సవాళ్లు ఎదురైనా పట్టుదలతో ముందుకెళ్లా. అనుకున్నది సాధించా” అని తన పదేండ్ల సినిమా సక్సెస్ జర్నీ గురించి చెప్పింది.
రిగ్రెట్ ఉండకూడదు
నాకు పదిహేడు లేదా పద్దెనిమిదేండ్లు ఉన్నప్పుడు ఒక విషయం గురించి గట్టిగా అనుకున్నా. కొన్నేండ్ల లైఫ్ జర్నీ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలో రిగ్రెట్ ఫీల్ కాకూడదు అని. ‘‘ఇది చేయలేదే... అది ట్రై చేయలేదే’’ అనే రిగ్రెట్ ఉండకూడదు. అదే సూత్రాన్ని ఇప్పటికీ పాటిస్తా. నేను చేసిన సినిమాలు, తీసుకున్న నిర్ణయాల విషయంలో ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ కాలేదు.
రియలైజ్ అయ్యా
సరైన స్క్రిప్ట్స్ లేక, నచ్చిన కథలు రాక.. ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నా. దాంతో మానసికంగా నేను చాలా డౌన్ అయిపోయా. అప్పుడు నా భర్త హిట్స్ మీద హిట్స్ కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అప్పుడు నాకు... మంచి రోజులు, చెడ్డ రోజులూ వస్తుంటాయి. పోతుంటాయి. వాటి గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు అనిపించింది. కెరీర్ విషయంలో నా భర్త చాలా సపోర్ట్ చేస్తాడు. తను స్టార్ అయినా కూడా ఏ రోజూ అలా ప్రవర్తించడు. చాలా మంచి వ్యక్తి.
ప్రజ్ఞ