పెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం : పటేల్ రమేశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు ప్రభుత్వపరంగా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్​ చైర్మన్ పటేల్ రమేశ్​రెడ్డి అన్నారు. గురువారం పెద్దగుట్ట ఆలయాన్ని కాంగ్రెస్ నాయకులతో  కలిసి ఆయన సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుట్టపై చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ పెద్దగట్టు ఆలయానికి చైర్మన్ ను త్వరలోనే నియమిస్తామన్నారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరిగే లింగమంతులస్వామి జాతరకు పెద్దసంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 

గుట్ట అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. అనంతరం ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు పటేల్​రామేశ్​సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరినవారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామ్మూర్తియాదవ్, కౌన్సిలర్ షఫీ ఉల్లా, ముదిరెడ్డి రమణారెడ్డి, గట్టు శ్రీను, వల్దాస్ దేవేందర్, జ్యోతి కరుణాకర్, తండు శ్రీనివాస్ గౌడ్, ఫరూఖ్, రమేశ్ నాయుడు, యాట వెంకన్న, ఎడ్ల వీరమల్లు, 
ధర్మా నాయక్, బైరబోయిన శ్రీనివాస్, సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.