ఏడాదైనా గుంతలు పూడ్చరా?

  • కరీంనగర్, జగిత్యాల హైవే రేకుర్తి వద్ద ప్రమాదకరంగా గుంతలు 

కొత్తపల్లి, వెలుగు : కరీంనగర్​- జగిత్యాల నేషనల్​ హైవే కొత్తపల్లి మండలం రేకుర్తి వద్ద రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. స్మార్ట్​సిటీ పనుల్లో భాగంగా రేకుర్తి బస్టాండ్​ నుంచి బ్రిడ్జి వరకు సెంట్రల్​ లైటింగ్​ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు, కాంట్రాక్టర్ గతేడాది రోడ్డును తవ్వారు. సెంట్రల్​ లైటింగ్​ పనులు ప్రారంభించకుండా అలాగే వదిలేయడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు.

 ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఆ గుంతల్లో నీరు చేరడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు పోలీసులు గుంతల వద్ద బారికేడ్లను అడ్డుగా ఉంచారు. బారికేడ్లు ఏర్పాటుచేసి రెండు నెలలు గడుస్తున్నా అధికారులు గుంతలను పూడ్చలేదు. 

నిత్యం ఉదయం, సాయంత్రం కాలేజీలు, స్కూళ్ల వ్యాన్లతో ఈ ప్రదేశంలో ట్రాఫిక్​ జామ్​ అవుతోంది. అధికారులు ఇకనైనా స్పందించి గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.