ఓటు రేటు పెరిగింది

మన దేశంలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు అభ్యర్థులకు డబ్బులు పంచాలనే ఆలోచన, ఓటర్లకు తీసుకోవాలనే ఆలోచన లేదు. క్యాండిడేట్లు, పార్టీలను బట్టి ఓట్లు వేశారు. చాలాకాలంపాటు పరిస్థితి అలానే ఉంది. ఒకప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థికి ఐదు వేల రూపాయలు ఖర్చవడమే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు కొన్నిచోట్ల ఒక్క ఓటు కోసం ఐదు వేల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థులు కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. రాజకీయ నాయకులు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడం పెరగడంతో డబ్బులు పంచైనా అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈ పద్ధతిని తెచ్చారు కొందరు. 

అది ఇప్పుడు చాలామందికి అలవాటుగా మారింది. కొన్ని చోట్ల నోటు లేనిదే ఓటు వేయమని ప్రజలే తెగేసి చెప్పే పరిస్థితి. అందుకే నాయకులు పైసలు పంచేందుకు రెడీ అవుతున్నారు. జనాలు ఓట్లు వేసేందుకు మరో 10 రోజుల సమయం ఉండగా.. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు రేట్‍ ఫిక్స్‌‌ చేసి పంచేందుకు రెడీ అవుతున్నాయి. కొందరు నాయకులు ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. 

డబ్బు పంచేందుకు ఊళ్లలో ప్రత్యేకంగా కొందరిని ఇన్‌‌‌‌ఛార్జ్‌‌లుగా నియమించుకున్నారు. వాళ్ల చేతికి ఎన్నికలకు ఒకట్రెండు రోజుల ముందు ఓటర్ల లిస్ట్‌‌, డబ్బులు ఇస్తారు. డబ్బు చేతికి  అందగానే గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేసేలా ప్లాన్‍ చేసుకుంటున్నారు. అపోజిషన్‍ పార్టీలు బలంగా ఉన్నచోట, మంత్రుల నియోజకవర్గాలు, జనరల్‍ స్థానాలు, బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు అభ్యర్థులుగా ఉన్నచోట పోటీని బట్టి ఓటుకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు పంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

మద్యం జోరు

ప్రచారంలో పొద్దంతా తిరిగిన నాయకులు, కార్యకర్తలు చీకటి పడగానే మందుతో విందు చేసుకుంటారు. బిర్యానీతో కడుపు నింపుకుంటున్నారు. ఈ దావత్‌‌ల ఖర్చు కూడా పోటీచేస్తున్న అభ్యర్థులదే. కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఓటర్లకు కూడా మందు, మటన్‌‌ పంచుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు పండుగలు వస్తే చాలా చోట్ల ఇంటికి కిలో మటన్‌‌, ఒక మందు బాటిల్‌‌ పంచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. కొన్ని చోట్ల డివిజన్లు, వార్డుల వారీగా కుల సంఘాలకు లిక్కర్‍ పంపిణీ చేస్తున్నారు. 

జెండాలు.. కండువాలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పెట్టే సభలు, సమావేశాలకు వచ్చే కార్యకర్తలకు జెండాలు, కండువాలు, టీషర్ట్‌‌లు, టోపీలు, కరపత్రాలు పంచుతుంటారు అభ్యర్థులు. వాటన్నింటికీ లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. పార్టీల తరఫున పోటీ చేసే నాయకుల నుంచి ఇండిపెండెంట్‌‌ అభ్యర్థుల వరకు అందరూ తమ గుర్తును ప్రమోట్‌‌ చేసుకునేందుకు ఇలాంటివి ఇస్తుంటారు.  ఒక్కో కరపత్రానికి మూడు నుంచి ఐదు రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక టీషర్ట్‌‌ల విషయానికి వస్తే.. కాస్త క్వాలిటీ టీషర్ట్‌‌ల కోసం 150 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. 

సభకు ఖర్చు

ఒక చోట సభ పెట్టాలంటే మామూలు విషయం కాదు.. అందుకు పెద్ద ఎత్తున ప్లానింగ్‌‌తోపాటు భారీగా డబ్బు కూడా ఖర్చవుతుంది. సభకు కావాల్సిన లైటింగ్‌‌ నుంచి సౌండ్‌‌ సిస్టమ్‌‌, ఫ్లవర్ డెకరేషన్‌‌, కుర్చీలు, టెంట్లు అన్నీ అద్దెకు తీసుకురావాలి. చిన్న సభ పెట్టినా లక్షల్లోనే ఖర్చు చేయాలి. 30 నుంచి 40 వేల మందితో భారీ సభ పెట్టాలంటే 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. 

ఇన్​ఫ్లుయెన్సర్​లతో...

అభ్యర్థులే కాదు పార్టీలు కూడా తమ అభ్యర్థులను గెలిపించడానికి చాలా ఖర్చు చేస్తుంటాయి. మన రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచే సోషల్‌‌ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​లు ఓ ప్రధాన పార్టీకి ఓటు వేయాలని సోషల్‌‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దాదాపు 250 మంది సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని మెచ్చుకుంటూ వీడియోలు చేశారు. అయితే.. వాళ్లు షేర్‌‌‌‌ చేసిన వీడియోల్లో అభ్యర్థుల ఫొటోలు, వీడియో క్లిప్‌‌లు లేవు. 

కాబట్టి ఆ ఖర్చు అభ్యర్థుల ప్రచార ఖర్చు కిందికి రాదు. ఒకవేళ అభ్యర్థులు ఫొటోలతో ప్రచారం చేస్తే.. అది అభ్యర్థి ఖర్చు కిందకి వస్తుందని ఎలక్షన్​ కమిషన్​ ముందుగానే చెప్పింది. అయితే.. పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా ఇలా సోషల్‌‌ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​లతో ప్రచారం చేయించడానికి అడ్వర్టైజింగ్‌‌ కంపెనీలకు భారీగానే చెల్లిస్తున్నారు. కొందరైతే యాక్టర్లు, కళాకారులను సభలకు తీసుకెళ్లి మరీ ప్రచారం చేయించుకుంటున్నారు. అలాంటప్పడు ఇంకాస్త ఎక్కువగానే  ఖర్చు చేయాల్సి వస్తుంది. కొందరు నాయకులు సోషల్‌‌ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లతో ఇంటర్వ్యూలు కూడా చేయించుకుంటున్నారు. 

సోషల్‌‌ ప్రచారం

సోషల్‌‌ మీడియాలో ప్రచారం చేయడానికి, ఆ అకౌంట్లను మెయింటెయిన్‌‌ చేయడానికి చాలామంది అభ్యర్థులు ప్రత్యేకంగా టీంలు పెట్టుకున్నారు. సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌లతో హల్​చల్‌‌ చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు మండలానికి ఒకరు చొప్పున నియమించుకున్నారు. అలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వివిధ హోదాల్లో కనీసం 300 నుంచి 500 మంది వరకు పనిచేస్తున్నారు. వీళ్ల వల్లే ఎన్నికల వాతావరణం రాగానే యూట్యూబ్ ఛానెల్స్, ఫేస్‌‌బుక్ పేజీలు, ట్విట్టర్ ఖాతాలు రెట్టింపు యాక్టివ్‌‌గా పనిచేస్తున్నాయి. వాళ్లు ఆ మెయిన్ లీడర్లు, కార్యకర్తలతో కలిపి ఒక వాట్సా​ప్‌‌ గ్రూప్‌‌ క్రియేట్‌‌ చేస్తారు. 

అభ్యర్థి ప్రచారం చేసే రూట్‌‌ మ్యాప్‌‌, ఇంతకుముందు ఆయన చేసిన మంచి పనుల గురించి, ప్రత్యర్థి లోపాలు.. లాంటివన్నీ ఆ గ్రూపుల్లో షేర్‌‌‌‌ చేస్తారు. కార్యకర్తలకు అభ్యర్థి ఏదైనా విషయం చెప్పాలన్నా ఈ గ్రూపుల ద్వారానే చెప్తాడు. అంతేకాదు.. వీళ్లే ఫేస్‌‌బుక్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌, ట్విట్టర్‌‌‌‌ లాంటి వాటిలో అభ్యర్థి ఫ్యాన్ పేజీలు క్రియేట్‌‌ చేసి, వాటిలో రకరకాల పోస్ట్‌‌లు పెట్టి జనాలను ఇన్​ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అంతేకాదు.. ప్రత్యర్థుల మీద నెగెటివిటీ పెంచే పోస్ట్‌‌లు కూడా పెడుతుంటారు. పార్టీల కోసం ఆన్‌‌లైన్‌‌లో సర్వేలు చేస్తుంటారు. వెబ్‌‌సైట్లలో కంటెంట్‌‌ పోస్ట్ చేస్తుంటారు. 

మొబైల్ ద్వారా...

చదువు లేనివాళ్లు, సోషల్ మీడియా వాడని వాళ్లు కూడా ఉంటారు. అలాంటివాళ్ల కోసం ప్రత్యేకంగా ఎస్సెమ్మెస్, ఫోన్​ కాల్స్‌‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు చాలామంది అభ్యర్థులు. నియోజకవర్గంలోని ప్రజలకు మెసేజ్‌‌లు పంపించడం, ఫోన్​ కాల్​లో అభ్యర్థి వాయిస్‌‌ మెసేజ్‌‌ వినిపించడం లాంటివి చేస్తున్నారు. దీనికోసం కూడా డబ్బు బాగానే ఖర్చు చేస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. ఓటర్లు మాత్రం జాగరూకతతో ఉండాలి. ఐదేండ్లు మనల్ని పాలించే అధికారం వాళ్లకు కట్టపెడుతున్నాం. కాబట్టి, వాళ్లు విద్యా, వైద్యం లాంటి కనీస అవసరాలు అందించాలి.  మనకోసం పనిచేయలేనప్పుడు వాళ్లను నిలదీసేందుకైనా.. ప్రలోభాలకు లొంగకుండా చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడినే ఎన్నుకోవాలి. 

హుజురాబాద్‍, మునుగోడు ఎఫెక్ట్‌‌ 

ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై హుజురాబాద్‍, మునుగోడు ఎలక్షన్ల ఎఫెక్ట్‌‌ పడింది. ఇదే విషయాన్ని అధికార పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులే ఒప్పుకుంటున్నారు. పార్టీ కండువా కప్పుకునే లీడర్లను లక్షల రూపాయలు పెట్టి అడ్డగోలుగా కొనే సంస్కృతి అక్కడి నుంచే వచ్చింది. అందుకే ఖర్చు తడిసి మోపెడవుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సిట్టింగ్‍ ఎమ్మెల్యే తల పట్టుకున్నాడు. ఇదే అదనుగా ఓటర్లను ఎక్కువ స్థాయిలో ప్రభావితం చేసే ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సిటీలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తమ సేవలు అందించేందుకు ఓ రేట్ అడుగుతున్నారు. 

పోటీలో ఉండే పార్టీలు అవసరానికి అనుగుణంగా వారిని కొనుగోలు చేసి కండువా వేస్తున్నారు. గతంలో ఓటుకు 500 రూపాయలు ఇచ్చే స్థానాల్లోనూ హుజురాబాద్‍, మునుగోడు ఎన్నికల తర్వాత తక్కువలో తక్కువ రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు ఎక్స్​పెక్ట్​ చేస్తున్నారని చెప్తున్నారు. దీనికితోడు గతంలో ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు లిక్కర్‍ వంటి ప్రలోభాలు ఉండగా.. ఇప్పుడు షెడ్యూల్‍ మొదలైన మొదటిరోజు నుంచే ఖర్చు పెట్టాల్సి వచ్చిందట!

పెరిగిపోతున్న ఎన్నికల ఖర్చు

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అతి ముఖ్యమైన ఘట్టం. మన దేశంలో ఐదేండ్లకు ఒకసారి ఎన్నికల్లో ఓటు వేసి నాయకులను ఎన్నుకుంటాం. అయితే రాను రాను ఎన్నుకున్న నాయకులు ప్రజాసేవకుల స్థాయి నుంచి ప్రజాపాలకులుగా మారి అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత అక్రమాలకు తెరలేపి పెద్ద ఎత్తున ధనార్జన చేస్తున్నారు. ఒకసారి శాసనసభ్యుడు అయితే చాలు మూడు తరాలకు సరిపడే డబ్బు సంపాదిస్తున్నాడు. 50వ దశకంలో జరిగిన మొదటి రెండు ఎన్నికలలో అభ్యర్థులు చాలావరకు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నవాళ్లే. ప్రజలు వారి సేవలను గుర్తించి ఎన్నుకునేవారు. అప్పట్లో ఓటర్లకు డబ్బు, మద్యం పంచడం కానీ.. వారిని ప్రలోభపెట్టి రకరకాల తాయిలాలు (ఉచితాలు) పంచడం గానీ జరగలేదు. అందుకే కాబోలు ఒక శాసనసభ్యుడి ఎన్నికల ఖర్చు ఐదు వేల రూపాయలకు మించేది కాదు. 

కోటీశ్వరులే పోటీలో!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు కేవలం కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అభ్యర్థులు ఖర్చు చేస్తారు. కొన్ని రిజర్వ్‌‌‌‌డ్‌‌ నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కోటీశ్వరులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో నేడు ఒక శాసనసభ్యుడి ఎన్నిక ఖర్చు ఆ నియోజకవర్గ పరిస్థితిని బట్టి పాతిక నుంచి 100 కోట్ల వరకు ఉంది. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం మన రాష్ట్రంలో ఒక అభ్యర్థి ఎన్నికల ఖర్చు 40 లక్షల కంటే మించకూడదు.

వివరాలు ఇవ్వాలి

ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 77 ప్రకారం ప్రతి అభ్యర్థి ఎన్నికల్లో జరిపిన ఖర్చు వివరాలు, ఫలితాలు వెలువడిన 30 రోజుల్లో జిల్లా ఎన్నికల అధికారికి అందజేయాలి. లేదంటే వాళ్లపై చర్యలు తీసుకుంటారు. అలాగే ఎన్నికలప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, ఎన్నికల ఎక్స్పెండిచర్​ అబ్జర్వర్ వచ్చి అభ్యర్థుల ఖర్చులపై గట్టి నిఘా పెడుతున్నారు.
రాజకీయ పార్టీలు తెలంగాణలో ఎన్నికల చట్టాలను ఉల్లంఘించి ఓటర్లను ప్రలోభపెట్టడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఓటర్లకు డబ్బు, మద్యం పంచడం, కులం, మతం పేరుతో ఓట్లు అడగడం వంటివి ఉంటున్నాయి. దీనికి తోడు అధికారంలో ఉన్న పార్టీ ప్రజల డబ్బును ఉచితాల రూపంలో పంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది.

ఎన్నో కేసులు 

2018లో జరిగిన ఎన్నికలలో అధికార యంత్రాంగం డబ్బు, మద్యం పంచుతున్నప్పుడు ఎన్నో కేసులు వేసినా ఎన్నికల తరువాత వాటిపై సరైన విచారణ జరపకపోవడంతో ఏ కేసులోను దోషులకు శిక్ష పడలేదు. అదీకాక గెలుపు గుర్రాల వేటలో రాజకీయ పార్టీలు నేరచరిత్రులకు టికెట్లు ఇవ్వడంతో పరిస్థితి తీవ్రత ఇంకా పెరిగింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ 56 మంది నేర చరిత్రులకు టికెట్లు ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇతర పార్టీలు కూడా నేర చరిత్రులకు టికెట్లు ఇస్తున్నాయి.

వారసుల కోసం...

మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే విధమైన పద్ధతిలో నడుచుకుంటాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఒక గట్టి నాయకుడు ఉంటాడు. ఆయన తన సంతానాన్ని రాజకీయాల్లోకి దింపి వారసుడ్ని తయారుచేసుకుంటాడు. అలాగే దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక లేక కేవలం ప్రజలకు డబ్బు పంచి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తారు. అయితే బెంగాల్‌‌‌‌లో మమతాబెనర్జీ, యు.పి.లో మాయావతి, తమిళనాడులో జయలలితకు వారసులు లేనందున పరిస్థితి వేరుగా ఉంది.

ఫస్టు పాస్టు ద పోస్టు

ప్రస్తుతం మన ఎన్నికల వ్యవస్థ ‘‘ఫస్టు పాస్టు ద పోస్టు” అన్న సిద్ధాంతంపై నడుస్తుంది. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 100 ఓట్లు ఉన్నాయనుకుంటే ముగ్గురు అభ్యర్థులు పోటీచేస్తే ఒకరికి 33 ఓట్లు, ఇంకొకరికి 33 ఓట్లు, మూడవ అభ్యర్థికి 34 ఓట్లు వేస్తే మూడో అభ్యర్థి గెలిచినట్లు లెక్క. ఇక్కడ గమనించాల్సిన విషయం 100 ఓట్లలో 66 మంది గెలిచిన అభ్యర్థిని వ్యతిరేకించారు. అయినా అతనే గెలిచాడు. జర్మనీ వంటి దేశాల్లో ప్రపోర్షనల్ రిప్రజెంట్ పద్ధతిన అంటే ద.మా.ష. పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ పద్ధతిలో అభ్యర్థులు కాక రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో ఉంటాయి. వారికి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి రాజకీయ పార్టీలకు సీట్లు కేటాయిస్తారు. అంటే అభ్యర్థులు పెద్దగా ప్రచారం చేయడం లేదా ఓటర్లను డబ్బు, మద్యంతో ప్రలోభపెట్టే అవసరం కానీ లేదు. పార్టీ సిద్ధాంతంపై ఎన్నికలు జరుగుతాయి.

పొంతన లేదు

ప్రస్తుతం మన దగ్గర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఖర్చు పరిమితికి, అభ్యర్థులు పెట్టే ఖర్చుకు ఎక్కడా పొంతన లేదు. ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే పౌరులందరికి ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ ఎన్నికల్లో సుమారు 10 లక్షల వరకు కొత్త ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటరుగా నమోదు చేసుకున్నారు. వీరు ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి ప్రలోభాలను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.
 

- ఎం. పద్మనాభరెడ్డి