Manali Cloudburst: క్లౌడ్ బరస్ట్తో.. కులు-మనాలి ఆగమాగం

హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో భారీ ఎత్తున క్లౌడ్ బరస్ట్ ( మేఘాల విస్ఫోటనం ) జరిగింది. క్లౌడ్ బరస్ట్ తో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో కులు జిల్లాలోని పలు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం జూలై 24 , 2024  అర్థరాత్రి ఒక్క సారిగా క్లౌడ్ బరస్ట్ జరగడంతో వరదలు కులు జిల్లాలోని మనాలి ప్రాంతంలోని అంజనీ మహాదేవ్ నుల్లా వంతెన పూర్తిగా కూలిపోయింది. ఈ NH3 రహదారిపై ధుండి, పల్చన్  మధ్య వంతెన తెగిపోయింది. దీంతో ఈ రహదారిని మూసివేశారు. అటల్ టన్నెల్ ఉత్తర పోర్టల్ ద్వారా లాహౌల్, స్పితి నుంచి మనాలికి వెళ్లే వాహనాలను రోహతంగ్ వైపు మళ్లించారు పోలీసులు.  

హిమాచల్ రాష్ట్రంలో భారీ వర్షాలతో కులు  జిల్లాతో సహా అనేక జిల్లాలు ఆగమాగమయ్యాయి. మండి, కిన్నైర్, కాంగ్రా జిల్లాలో రోడ్లు తెగిపోయాయి. మండిలోని 12 , కిన్నౌర్ లో రెండు, కాంగ్రా జిల్లాలో ఒకటి సహా మొత్తం 15 రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. బుధవారం రాత్రి రాష్ట్రంలో పలు చోట్ల ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక పవర్ ప్రాజెక్టుతో సహా 62 ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయాయని హిమాచల్  ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. భారీ వరదలకు వందల్లో ఇండ్లు దెబ్బతిన్నాయి. 

హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలున్నాయని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన గాలులు, లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలని సూచించింది వాతావరణ శాఖ.