- నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 144 సెక్షన్ అమలు
- ప్రలోభాల కట్టడికి అధికారుల యాక్షన్
- ఇతర జిల్లాల వ్యక్తులు వెళ్లిపోవాలని ఆదేశాలు
నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. మే 13న ఎన్నికలు జరగనుండగా.. శనివారం సాయంత్రం మైక్ లు బంద్ అయ్యాయి. ఇందూరులో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడి మరీ ప్రచారాన్ని నిర్వహించాయి. దీంతో పాటు జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో కూడా ఆయా పార్టీల నాయకులు జోరుగా ప్రచారం చేపట్టారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారాలు
కుల సంఘాల మీటింగ్‌లతో ఆయా పార్టీల నేతలు బిజీ బిజీగా గడిపారు. ఈ వేసవిలో ఎండ ప్రతాపానికి చాలా రోజులు ఉదయం, సాయంత్రం మాత్రమే ప్రచారం నిర్వహించగా.. రెండు రోజులు గా వాతావరణం చల్లబడటంతో ప్రచారం జోరుగా నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు అసెంబ్లీ స్థానాలలో మొత్తం 17,04,867 మంది ఓటర్లుండగా పురుషులు 8,06,130
మహిళలు 8,98,647 ఇతరులు 90 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 8,77,747 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 4,22,641 మంది, మహిళలు 4,55,063 మంది, ఇతరులు 43 మంది ఉన్నారు. వీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సరైనన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మైక్ లు బంద్
మే 13న తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరగనుండగా.. మైక్ లు మూగబోయాయి. ఈ సారి ఇందూరు పార్లమెంట్ స్థానం నుంచి 29 మంది పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీలైన బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి వీరు ప్రజల్లోకి వెళ్లి వివిధ రకాల హామీలు కురిపిస్తూ ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఇందూరులో నిర్వహించగా.. బీజేపీ నుంచి ప్రధాని మోదీ నిజామాబాద్, జగిత్యాలకు వచ్చారు. సీఎం కేసీఆర్ నిజామాబాద్, కామారెడ్డిలో కార్నర్ మీటింగ్ లు నిర్వహించి తమ అభ్యర్థినే గెలిపించాలని కోరారు. చివరి రోజు కామారెడ్డికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
ప్రలోభాలకు తావు లేకుండా..
48 గంటల ముందు నుంచే ప్రచారానికి బ్రేక్ పడగా.. ఈ సైలెన్స్ పీరియడ్ ను అధికారులు చాలెంజ్ గా తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో పర్యవేక్షణ కోసం ఇందూరు జిల్లాలో 2500 పైగా సీసీ కెమెరాలను పోలింగ్ సెంటర్లలో ఏర్పాటు చేశారు.
ప్రతి నియోజకవర్గంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. మొత్తం 1900కు పైగా పోలింగ్ సెంటర్ల లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. లిక్కర్, డబ్బు పంపిణీ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిజామాబాద్, జహీరాబాద్ సెగ్మెంట్లకు మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్ ఉండడంతో పటిష్ట నిఘా పెట్టారు.
ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్
ఎంపీ ఎన్నికల ప్రచారం ముగిసిందని, శనివారం సాయంత్రం నుంచి నిషేధం అమలులోకి వచ్చిందని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, జితేశ్ వి. పాటిల్ తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్అమలులో ఉంటుందన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించటం నిషేధమన్నారు. ఐదుగురికి మించి ఒక చోట గూమిగూడరాదన్నారు. 48 గంటల సైలైన్స్ పీరియడ్‌లో ఇతర జిల్లాల వ్యక్తులు ఉండకూదన్నారు.
పోలీసు ఆఫీసర్లు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎఫ్టీ టీమ్స్అలర్టుగా ఉండాలన్నారు. అభ్యంతకరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ఎస్ఎమ్ఎస్లు ఎలక్షన్ కమిషన్ నిషేధించిందన్నారు. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మద్యం షాపులు మూసివేయించి డ్రై డేగా ప్రకటించినట్లు కలెక్టర్లు పేర్కొన్నారు.