జై భీమ్ నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్  

  • ఆఖరి రోజూ ఉభయసభల్లో రచ్చ
  • సభకు అంతరాయంపైధన్ ఖడ్ సీరియస్
  • పార్లమెంట్ గేట్ల వద్ద నిరసనలను బ్యాన్ చేసిన స్పీకర్ ఓం బిర్లా  
  • ఉభయ సభలు నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వింటర్ సెషన్ ఆఖరి రోజు శుక్రవారం కూడా ఇటు రాజ్యసభ, అటు లోక్ సభలో అధికార, ప్రతిపక్షాల ఆందోళనలతో గందరగోళం నెలకొంది. ఉభయ సభలు జై భీమ్ నినాదాలతో దద్దరిల్లాయి. ఉదయం లోక్ సభలో సమావేశాల ప్రారంభానికి ముందు నుంచే కాంగ్రెస్ ఎంపీలు జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. సభ ప్రారంభం కాగానే జమిలి బిల్లులను జేపీసీకి పంపే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు స్పీకర్ ఓం బిర్లా సూచించారు.

అనంతరం పార్లమెంట్ కు చెందిన ఏ గేటు వద్దా ఇకపై నిరసనలు చేపట్టకుండా నిషేధం విధిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో సభలో ప్రతిపక్ష ఎంపీలు జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళం మధ్యే ప్రధాని మోదీ లోక్ సభ చాంబర్​లోకి ప్రవేశించారు. మేఘ్వాల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్, ఇతర సభ్యులు వెల్​లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడంతో సభలో వందే మాతర గీతం ఆలాపన మొదలైంది. దీంతో ఎక్కడి ఎంపీలు అక్కడే నిలబడిపోయారు. 

చర్చలా? ఆందోళనలా?..: ధన్ ఖడ్  

రాజ్యసభలోనూ చివరిరోజున సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు నిరసనలతో హోరెత్తించాయి. దీంతో సభ కొద్దిసేపట్లోనే వాయిదా పడింది. తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించారు. గందరగోళం మధ్యే జమిలి బిల్లులపై నియమించిన జేపీసీలోకి రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులను ఎంపిక చేసిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలని న్యాయ మంత్రికి చైర్మన్ సూచించారు.

వాయిస్ ఓట్​తో తీర్మానాన్ని ఆమోదించినట్టు ప్రకటించి, సభను నిరవధికంగా వాయిదా వేశారు. అంతకుముందు సభలో ధన్ ఖడ్ మాట్లాడుతూ.. సమావేశాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో అర్థవంతమైన చర్చలు జరగాలా? అంతరాయాలు మాత్రమే కొనసాగాలా? అన్నది నిర్ణయించుకోవాలని చెప్పారు.  

లోక్ సభ 20 రోజులు..రాజ్యసభ 19 రోజులు

పార్లమెంట్ వింటర్ సెషన్ సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమై, డిసెంబర్ 20న ముగిశాయి. ఈసారి అదానీ, జార్జ్ సోరోస్, జమిలి బిల్లులు, అంబేద్కర్, రాజ్యాంగం వంటి అంశాలపై ఉభయసభల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. వింటర్ సెషన్ లో ఓవరాల్ గా లోక్ సభ 20 రోజులు, రాజ్యసభ 19 రోజులు సమావేశమయ్యాయి. అయితే, రాజ్యసభ కేవలం 43 గంటల 27 నిమిషాలు (40.03 శాతం ప్రొడక్టివిటీ) మాత్రమే నడిచింది. లోక్ సభ లో మాత్రం 57.87 శాతం ప్రొడక్టివిటీ నమోదైంది. లోక్ సభలో 4 బిల్లులు, రాజ్యసభలో 3 బిల్లులు పాస్ అయ్యాయి. రాజ్యాంగంపై లోక్ సభలో 16 గంటలు, రాజ్యసభలో 17 గంటలు చర్చ జరిగింది. 

స్పీకర్ టీ పార్టీని బహిష్కరించిన ప్రతిపక్షాలు 

పార్లమెంట్ వింటర్ సెషన్ ముగింపు సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ఎంపీలకు శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా టీ పార్టీ ఇచ్చారు. అయితే, ఈ విందును ప్రతిపక్షాలు బాయ్ కాట్ చేశాయి. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఆందోళనల సందర్భంగా గురువారం పార్లమెంట్ ముందు ఎంపీల మధ్య తోపులాట జరిగింది.

ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు కాగా, వారిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తోసివేశారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అందుకే తమ ఎంపీలపై కేసులు పెట్టినందున స్పీకర్ టీ పార్టీని బాయ్ కాట్ చేస్తున్నామని ఇండియా కూటమి నేతలు ప్రకటించారు.