జగిత్యాల టౌన్​లో పార్కింగ్‌‌‌‌ కష్టాలు  

  •     జాగ లేక రోడ్లపైనే వాహనాలను నిలుపుతున్న వాహనదారులు 
  •     మాల్స్‌‌‌‌, ప్రైవేట్‌‌‌‌ హాస్పిటళ్లలో పేపర్లలోనే పార్కింగ్ స్థలాలు 
  •     సెల్లార్లు, పార్కింగ్‌‌‌‌ ప్లేసుల్లోనూ కమర్షియల్‌‌‌‌ అవసరాలకు వినియోగం 
  •     జిల్లాకేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్కింగ్‌‌‌‌కు జాగ దొరుకుతలేదు. జిల్లాకేంద్రంగా మారాక ట్రాఫిక్‌‌‌‌ పెరగగా, దానికి తగ్గట్టుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయకపోవడంతో టౌన్‌‌‌‌లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల మెడికల్ హబ్‌‌‌‌, వస్త్ర, వ్యాపార వాణిజ్య రంగాలకు కేంద్ర బిందువుగా మారడంతో జిల్లావాసులతో పాటు పొరుగున ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి కూడా రాకపోకలు పెరిగాయి. దీంతో జగిత్యాల పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ వద్ద తీవ్రమైన పార్కింగ్ సమస్య తలెత్తుతోంది. ఈక్రమంలో రోడ్లపైనే వాహనాలను నిలుపుతుండడంతో ట్రాఫిక్‌‌‌‌ కష్టాలు పెరుగుతున్నాయి. 

కనిపించని పార్కింగ్‌‌‌‌ స్థలాలు 

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్, జంబి గద్దె ఏరియాలు హాస్పిటల్ జోన్స్ కావడంతో నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. హాస్పిటల్స్‌‌‌‌లో చాలావరకు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో అంబులెన్స్‌‌‌‌లు, రోగులకు చెందిన వాహనాలు రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బిల్డింగ్స్ నిర్మాణం చేసేప్పుడు కొందరు సెల్లార్లలో పార్కింగ్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నట్లు చూపుతున్నప్పటికీ.. వాటిని కమర్షియల్‌‌‌‌ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. దీంతో పార్కింగ్‌‌‌‌కు జాగ లేక వాహనదారులు రోడ్లపైనే వాహనాలను నిలపాల్సిన పరిస్థితి. ముఖ్యంగా సెల్లార్లను డయాగ్నస్టిక్స్‌‌‌‌ సెంటర్లు, మెడికల్ షాపులు, ల్యాబ్ ల నిర్వహణకు వినియోగిస్తున్నారు. మరికొందరు హాస్పిటల్స్ మేనేజ్‌‌‌‌మెంట్లు మాత్రం కేవలం సిబ్బంది వాహనాలకే పార్కింగ్‌‌‌‌ అనుమతిస్తున్నారు. 

పర్యవేక్షణ అంతంతమాత్రమే.. 

ట్రాఫిక్‌‌‌‌ సమస్యపై అటు ట్రాఫిక్ పోలీసులు, పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై మున్సిపల్ ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మున్సిపాలిటీ ఆధ్వర్యం లో ప్రైవేట్ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు.  మరోవైపు నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటల్స్,  కమర్షియల్ బిల్డింగ్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలోనూ మున్సిపల్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి.

ప్రైమ్ లొకేషన్స్ లో ట్రాఫిక్ సమస్య ఉన్నప్పటికీ కొందరు బడా వ్యాపారులు, ఇతర లీడర్లు ఒత్తిడితో ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదన్న చర్చ నడుస్తోంది. పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ జంక్షన్ల వద్ద ఫొటోలు మాత్రమే తీస్తూ ఫైన్లు వేస్తున్నారే తప్ప సమస్యపై దృష్టి సారించడం లేదని టౌన్‌‌‌‌వాసులు వాపోతున్నారు.