పిల్లల రక్షణకు..తల్లిదండ్రులూ చేయాలి ప్రతిజ్ఞ

యువతీ, యువకులు.. స్నేహితులు, తోటివారి ప్రభావానికి సులువుగా లోనవుతారు. అది కొన్నిసార్లు మేలు చేయవచ్చు.  ఇంకొన్నిసార్లు కీడు కూడా చేయవచ్చు. ఉదాహరణకు తోటివారితో చదువులోనూ, క్రీడల్లోనూ ఆరోగ్యకరమైన  పోటీవల్ల కొందరు  జీవితంలో రాణించవచ్చు.  మరి కొందరు  తోటివారికి ‘నో’ చెప్పలేక మద్యం, మాదక ద్రవ్యాల వంటి దుర్వ్యసనాలకు లోను కావచ్చు.  పెద్దలను ఎదిరించి జీవించగలమనే ధైర్యం ఉంటుంది గానీ తోటి స్నేహితులను మాత్రం అతిగా మన్నించడం యుక్త వయస్కులలో కనిపించే ఒక వైరుధ్య భావం. ‘ఆత్మహత్యల నివారణ అవగాహనా మాసం’గా సెప్టెంబర్​ను గుర్తించారు.  ఆత్మహత్యల సంఖ్య విషయంలో భారతదేశం మొదటి స్థానంలో ఉండటం విషాదకరం.  జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదిక ప్రకారం 2022లో 1.71 లక్షల ఆత్మహత్యలు నమోదయ్యాయి.  వీరిలో 70,000 మంది 30 ఏండ్లలోపు యువతీ యువకులు.  పరీక్షలలో అనుత్తీర్ణత కారణంగా 2,000 ఆత్మహత్యలు మాత్రమే జరిగాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి పార్లమెంట్​కు తెలిపారు గనుక  మిగిలినవారు ఇతరత్రా కారణాల వల్ల బలవన్మరణానికి పాల్పడ్డారని భావించాలి.  

 ప్రతి లక్ష మందిలో 12.4 శాతం ఆత్మహత్య

దేశ చరిత్రలోనే అత్యధికంగా ప్రతి లక్ష మందిలో 12.4 శాతం మంది  ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరోవైపు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలోని నేషనల్ డ్రగ్ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్ వారి జాతీయ సర్వే 2018 ప్రకారం 18 ఏండ్ల లోపు యువత 1.18 కోట్ల మంది  మాదక ద్రవ్యాల బారినపడ్డారు. ఈ పరిణామాలకు చెడు స్నేహం కారణం కాకపోయినా మంచి స్నేహితులు లేకపోవటం మాత్రం  ఒక కారణం.  సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి సరిదిద్దే అవకాశం తోటివారికే ఉంటుంది. అందుకు కావలసిన నేర్పు, తపన ఉంటేనే  ఆ స్నేహం వల్ల ఉపయోగం.  తల్లిదండ్రులు కూడా పిల్లలతో  స్నేహం చేయడం మరో  పరిష్కారం. “భారతదేశం నా మాతృభూమి. ...నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను.” అంటూ పిల్లలు ప్రతి రోజూ పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించిన ప్రతిజ్ఞ చేయడం మనకు తెలుసు. కానీ, తల్లిదండ్రుల మాటేమిటి? మాట్లాడటానికి, వారి సమస్యలు వినడానికి పిల్లలకు ఎంత సమయం కేటాయిస్తున్నారు? పిల్లల మంచి పనులను మెచ్చుకునేవారెందరు? 

దృఢమైన బంధానికి ప్రశంస పునాది 

అభినందించేవారికి  అవసరమైనపుడు విమర్శించే అర్హత కూడా వస్తుంది. విమర్శను కూడా చక్కెర పూత పూసిన చేదుమాత్రగా ప్రశంస మారుస్తుంది.  ఐస్ లాండ్ వంటి  కొన్ని దేశాలలో  తల్లిదండ్రుల ప్రతిజ్ఞ తప్పనిసరి చేశారు. పిల్లలకు తగు సమయం కేటాయిస్తామని,  వారి మంచి పనులను ప్రశంసిస్తామని, అవసరమైనప్పుడు ‘నో’ చెప్పినా స్వీకరిస్తామని, తగిన ఆహారం, నిద్ర, వ్యాయామం పొందేలా చూస్తామని తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేస్తారు.  ఇందువల్ల ఐస్ లాండ్ లో 16 ఏండ్లలోపు యువతలో మద్యపానం 1998లో  42% నుంచి 2016 లో 5% కు,  ధూమపానం  23%  నుంచి 3% కు,  గంజాయి వాడకం 17% నుంచి 7% కు తగ్గిపోయింది. రెక్కలు రాగానే  పక్షి కూనలు  ఎగిరిపోతాయి.  మానవులలో  సమంజసమైన నిర్ణయాలు చేయగలిగే  మెదడులోని  ‘ప్రిఫ్రంటల్ కార్టెక్స్’  25 ఏండ్ల వయసులోగానీ వృద్ధి కాదు. అంతకాలం వారి పరిరక్షణ బాధ్యత పెద్దలకు ఉంటుంది.  యువతను సంక్షోభం నుంచి రక్షించాల్సిన బాధ్యత స్నేహితులతో పాటు తల్లిదండ్రులు కూడా స్వీకరించాలి. 

- శ్రీనివాస్ మాధవ్
రీసెర్చర్​, రచయిత