బీ కూల్.. బీ ప్లానింగ్ : స్కూల్స్ మొదలయ్యాయి.. మళ్లీ హడావిడి.. పేరంట్స్ ఈ టైంటేబుల్ ఫాలో అవ్వండి..!

వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్లు మొదలయ్యాయి. పిల్లలు బడిబాట పట్టారు. సెలవుల బద్ధకాన్ని వదిలించుకొని.. బుల్లి బుల్లి అడుగులేసుకుంటూ.. బ్యాగులు భుజానేసుకొని స్కూళ్లకు వెళ్తున్నారు. బడి మొదలయ్యిందంటే స్కూలు పిల్లలున్న ఇంట్లో ఉండే హడావుడి ఇంతా అంతా కాదు.

ఈ రోజు నుంచి చిన్నారులే కాదు  తల్లులు కూడా కొత్త టైంటేబుల్ కు అలవాటుపడాలి. తండ్రుల జీవితంలోనూ మార్పులుతప్పవు. పిల్లలకైతే పొద్దున్నే నిద్రలెమ్మనే అమ్మానాన్నల అరుపులతో రోజు మొదలై.. రాత్రి హోంవర్క్ ముగుస్తుంది. అయితే, మళ్లీ కొత్తగా పాత అలవాట్లకు సిద్ధం కావడానికి కొంత టైం పడుతుంది. స్కూళ్ల రీఓపెన్లో మొదలయ్యే లైఫ్ ఎలా ఉంటుందంటే...! 

పది నిమిషాలు ప్లీజ్..

పొద్దున్నే "ఈ రోజు నుంచే స్కూల్, తొందరగా లే''. అని అమ్మ లేపుతుంటే.. పిల్లలు బద్ధకంగా పేజ్ అమ్మా ఇంకో పది నిమిషాలు' అంటారు.. లేదా. పక్కకు తిరిగి మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. ఇన్ని రోజుల సెలవులో పొద్దున్నే లేచే అలవాటు తప్పిపోయుంటుంది. స్కూళ్లు మొదలయ్యేసరికి ఏడుగంటలకు లేవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. మళ్లీ పొద్దున్నే లేవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఆ విషయాన్ని తల్లిదండ్రులు. కూడా అర్ధం చేసుకోవాలి. పిల్లలు వెంటనే కొత్తదనానికి అలవాటు పడలేరు. ఒకవేళ మరీ బద్ధకిస్తుంటే.. ముద్దుచేసో, కబుర్లు చెప్పో, అది కొనిస్తా.. ఇది కొనిస్తా.. అని మాటలు చెప్పి చిన్నారుల నిద్ర బద్ధకం వదలగొట్టాలి.

సాకులు చెప్తారు

సెలవుల తర్వాత కొత్తగా స్కూలుకు వెళ్లడానికి పిల్లలు ఇష్టపడరు. 'అమ్మా తలనొప్పి.. నాన్నా కాలునొప్పి, పొట్టనొప్పి..' అని బెడ్ మీద నుంచి లేవకుండానే సాకులు చెప్తారు. లేదా కాసేపు ఏడిస్తే బడి టైం అయిపోతుందులే అని కారణం లేకుండానే ఏడుస్తారు. బ్యాగు కొనివ్వలేదు. డ్రెస్ లేదు, షూస్ బాగాలేవు... లాంటి రీజన్స్ కూడా వాడుకుంటారు. అవన్నీ నిజం కాదని అమ్మానాన్నలకు తెలుసు. అలాంటప్పుడు వాళ్లను బలవంతంగా లేపి, అరవడం మంచిదికాదు. పిల్లలకు నచ్చినట్లు ఏదన్నా చేస్తానంటే ఇట్టే మాట వింటారు. కాబట్టి వాళ్లకు నచ్చిన దారిలోకే వెళ్లి పరిష్కరిస్తే సరి. 

తల్లులు బిజీ...

స్కూళ్లు మొదలయ్యాయంటే ఎక్కువ బిజీ అయ్యేది తల్లులే. ఎందుకంటే.. ఇళ్లల్లో పిల్లలను నిద్రలేపటం నుంచి స్నానం చేయించి రెడీ చేసేదంతా అమ్మలే. టిఫిన్ చేయాలి, మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ సిద్ధం చేయాలి. అమ్మలు కూడా ఇన్నిరోజులు సెలవులు కదా అని కాస్త ఆలస్యంగా నిద్రలేచి, ఇంటి పనులు నిదానంగా చేస్తూ ఉంటారు. ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఈ రోజు నుంచి కొత్త రొటీను అలవాటు పడాల్సిందే. తండ్రులు పిల్లలకు సెలవులు కదా ఇంటిపనులను పట్టించుకోకుండా. ఉంటే ఈ రోజు నుంచి పిల్లలను రెడీ చేయడంలో భాగస్వాములు కాకతప్పదు. అలా కుదరదంటే కరెక్ట్ టైంకు పిల్లలు స్కూలుకు, వాళ్లు ఆఫీసులకు వెళ్లలేదు.

ఫుడ్ విషయంలో..

ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మరో వైపు ఇప్పుడిప్పుడే వానజల్లులు పలకరిస్తున్నాయి. సెలవుల్లో పిల్లలు తినకపోతే అమ్మలు బతిమిలాడి తినిపించి ఉంటారు. స్కూళ్లలో అది కుదరదు. అందుకే పిల్లల ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మొదటి రోజుల్లోనే స్కూల్కు డుమ్మాకొట్టి ఇంట్లో కూర్చుంటారు. హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. మారాం చేస్తున్నారు. కదా అని ఏది అడిగితే అది చేసిపెట్టకుండా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. జలుబు, దగ్గుల్లాంటివి దరిచేరకుండా చూడాలి. శక్తినిచ్చే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో కూడిన ప్రొటీన్ ఫుడ్ ఇవ్వాలి. జంక్ ఫుడ్ కాస్త దూరం పెట్టాలి. కూల్డ్రింక్స్ ఇవ్వకపోవడం బెటర్.

ఉత్సాహంతో ఉరకలు

కొందరు పిల్లలు సెలవులను ఎంత ఎంజాయ్ చేస్తారో.. మళ్లీ స్కూల్ కు మొదటి రోజునుంచే వెళ్లడాన్ని కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. వాళ్లే సొంతంగా రెడీ అవుతారు. టిఫిన్ తింటారు. ముందురోజే బ్యాగు, పుస్తకాలు సర్దిపెట్టుకుంటారు. లేదా అమ్మనో, నాన్ననో రెడీ చేయమని పురమాయిస్తారు. ఇన్ని రోజుల తర్వాత క్లాస్ మేట్ ను కలుసుకోబోతున్నామన్న ఆనందంతో ఉంటారు. అందరికంటే స్కూల్లో మేమే ముందుండాలనుకుంటారు. ఇలాంటి వాళ్లకు అమ్మానాన్నలు ఏమీ చెప్పాల్సిన పనిలేదు, బ్యాగు, పుస్తకాలు, షూస్, లంచ్ బాక్స్ లాంటివి సిద్ధం చేసి పెడితే చాలు, స్కూల్ కు వెళ్లినా ఇలాంటి పిల్లలు క్లాస్మేట్స్ ను, టీచర్స్ ను పలకరిస్తారు. సెలవుల్లో ఏమేం చేశారో మాట్లాడుకుంటారు. స్నేహితులతో కబుర్లు చెప్తూ సంతోషంగా గడుపుతారు.

స్కూల్లో మొదటి రోజు..

మొదటి రోజు స్కూల్లో ఎక్కువగా పాఠాలేం చెప్పరు. పైగా పిల్లలు పై తరగతికి వెళ్లి ఉంటారు. కొత్త సిలబస్, టీచర్స్ కొత్తవాళ్లు మారే అవకాశమూ ఉంటుంది. దాంతో పిల్లలందరూ సందడిగా కబుర్లు చెప్పుకుంటారు. టీచర్లు కూడా పిల్లలతో సరదాగా మాట్లాడతారు. ప్రతి పీరియడ్లో ఏదో మొక్కుబడిగా నాలుగు ముక్కలు చెప్పి వదిలేస్తారు. లేదా ఒక్కొక్కరిని లేపి.. సెలవుల్లో ఏమేం చేశావు? ఎక్కడికి వెళ్లావు? కొత్త సంగతులు ఏం నేర్చుకున్నావు? పై క్లాస్ కు వచ్చావు కదా ఏమనిపిస్తుంది? లాంటివి అడుగుతారు. పాత క్లాస్ల కాదు, బాగా కష్టపడి చదవాలి. లాంటివి చెప్తారు.