కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత

  • యూకేజీ స్టూడెంట్​తో పీఈటీ అసభ్య ప్రవర్తనపై ఆందోళన
  • స్కూల్​ ఫర్నిచర్ ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు 
  • ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల లాఠీచార్జ్ 
  • టౌన్​ సీఐతో పాటు మరో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు

కామారెడ్డి/ కామారెడ్డిటౌన్​, వెలుగు : యూకేజీ స్టూడెంట్​తో  పీఈటీ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతకు దారితీసింది.  చిన్నారి పేరెంట్స్​కు మద్దతుగా మంగళవారం విద్యార్థి సంఘాల నేతలు, మున్సిపల్​ చైర్ పర్సన్ తో పాటు.. బాధితుల తరపున ఓ వర్గం వారు భారీగా అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. స్కూల్​పై రాళ్లు విసిరి.. ఫర్నిచర్ ధ్వంసం చేయగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో  పోలీసులు లాఠీచార్జీ చేసి  చెదరగొట్టారు. స్థానికులు,  పోలీసుల కథనం ప్రకారం.. 

కామారెడ్డిలోని జీవదాన్​స్కూల్​లో యూకేజీ స్టూడెంట్(6) తో పీఈటీ ఈనెల 21న అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సోమవారం బాలిక పేరెంట్స్ టౌన్​  పోలీసులకు కంప్లయింట్ చేయగా..  పీఈటీ నాగరాజుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ.. మంగళవారం స్కూల్​ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. మున్సిపల్ చైర్​పర్సన్ ​గడ్డం ఇందుప్రియ, ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. నిందితుడిపై, స్కూల్​మేనేజ్​మెంట్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.  బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తులు కూడా భారీగా అక్కడికి చేరారు. 

కొందరు స్కూల్ ఆఫీసు రూమ్​లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది.  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్​పై రాళ్లు విసిరారు.   ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.  స్కూల్ మేనేజ్​మెంట్​సమాధానం చెప్పాలని అప్పటివరకు ఆందోళన విరమించమని పేర్కొన్నారు. ప్రిన్సిపపాల్ అందుబాటులో లేరని స్కూల్ ఇన్​చార్జి చెప్పగా..గుర్తు తెలియని వ్యక్తులు మళ్లీ రాళ్లు విసరడంతో  టౌన్​ సీఐ చంద్రశేఖర్​రెడ్డి తలకు గాయమైంది.  దీంతో పోలీసులు ఆందోళనకారులను లాఠీ చార్జీ చేసి చెదరగొట్టారు.  

ఇందులో భాగంగా ఏఆర్​ హెడ్​కానిస్టేబుల్ నజీరోద్దిన్​ కుడి కాలుకు, టౌన్​ ఎస్ రాజారం కింద పడిపోగా గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించారు.  విషయం తెలుసుకున్న ఎస్పీ సింధూశర్మ, అడిషనల్ కలెక్టర్​శ్రీనివాస్​రెడ్డి, ఆర్డీవో రంగనాథ్​రావు వెళ్లారు. బాధిత ఫ్యామిలీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడితో పాటు మేనేజ్​మెంట్​పై ఎంక్వైరీ చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.  అంతకు ముందు స్కూల్​నుంచి వెళ్లిన వారు భారీగా నిజాంసాగర్​ రోడ్డులో ఆందోళనకు దిగడంతో ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ ​నచ్చజెప్పారు. 

మరోసారి స్టేషన్​ ఎదుట ధర్నా కు వస్తున్నారని భావిస్తూ పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. రైల్వే బ్రిడ్జి వద్ద ర్యాలీగా వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయినా ముందుకెళ్లడంతో మరోసారి లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు.  ఆందోళన ఉద్రిక్తతకు దారి తీయడంతో  నిజామాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి కామారెడ్డికి ప్రత్యేక బలగాలను రప్పించారు.  టౌన్  పికెటింగ్ ఏర్పాటు చేయటంతో పాటు పెట్రోలింగ్​ 
నిర్వహిస్తున్నారు.