లెటర్​ టు ఎడిటర్ : ఆర్టీసీ వీలీన ప్రక్రియ ముందుకు సాగేదెన్నడు? : పందుల సైదులు

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో 42 రోజుల సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల పాత్ర వెలకెట్టలేనిది. అదే తరహాలో నిరవధిక  సమ్మె చేసి స్వరాష్ర్ట పాలనకు బీజాలు వేసిన కార్మికుల పోరాటం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో లిఖించదగినది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో తెలంగాణ ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​తో పాటు మరో 25 డిమాండ్లను కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుపెట్టాయి. ఇందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. 

ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచన చేసి సమ్మెను అణచివేసే ప్రయత్నం చేసింది. అనేక పోరాటాల నడుమ ప్రాణ త్యాగాలతో 52 రోజుల అనంతరం సమ్మె ముగిసింది.ఈ మధ్యకాలంలో ప్రజల నుంచిప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బీఆర్​ఎస్ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ, వారి అభిమానాన్ని చూరగొనలేకపోయింది. కొంతకాలం తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో వీలినం చేసే ప్రక్రియను మొదలు పెట్టింది. అసెంబ్లీలో సైతం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. 

అయితే, ఆ ప్రక్రియ ముందుకు కొనసాగలేదు. పాత ప్రభుత్వంలోని  90% ఆర్టీసీ వీలీన ప్రక్రియ పూర్తి అయినదని ఆర్టీసీ కార్మికులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి కావొస్తున్నప్పటికీ ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్ అయిన వీలీన ప్రక్రియ గురించి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. వేలాది కార్మికులు నైరాశ్యంలో ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం వేగవంతంగా ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఉంది.

‑ పందుల సైదులు,తెలంగాణ విద్యావంతుల వేదిక