ప్రజా వీరుడు పండుగ సాయన్న ..

పండుగ సాయన్న 1840 నుంచి 1900 మధ్య కాలానికి చెందినవాడు. అతని తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. సాయన్న  తెలంగాణలోని మహబూబ్‌‌ నగర్‌‌కు దగ్గర నవాబ్‌‌పేట మండలం, మెరుగోనిపల్లె గ్రామానికి చెందినవాడు. అతను గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడు. 20 కేజీల గుండును అవలీలగా ఒక్కచేత్తో లేపేవాడు. ఎద్దులబండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడు. పేదలకు సహాయం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ ఆధిపత్య వర్గాల వాళ్లు బందిపోటుగా చిత్రించారు. అతను ప్రజల కోసం నిలబడి ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేశాడు. భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర.

ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు పండుగ సాయన్న. పండుగ సాయన్న 18వ శతాబ్ధం చివరలో జీవించిన ప్రజావీరుడు. 35–-38 ఏళ్ల వయసులో చంపబడ్డాడు. తెలంగాణ రాబిన్‌‌హుడ్, ప్రజా వీరుడుగా సుపరిచితుడు. ప్రజలను హింసలకు గురిచేస్తూ, నిరంతరం దోచుకుంటూ, ప్రజల మాన ప్రాణాలను హరిస్తున్న దొరల, దేశముఖ్​ల, అధికారుల, సంపన్నుల ఆట కట్టించాడు.  రాబిన్‌‌హుడ్ లాగ, పండుగ సాయన్న కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పెట్టే పని మాత్రమే పెట్టుకోలేదు.

ఆనాటి నిరంకుశ నిజాం అధికారాలను, అధికారులను ప్రశ్నించి, వారిని ఎదిరించి, తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకొని, ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆధిపత్య శక్తులైన దేశముఖ్​లు, కరణంపటేళ్లు, భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించారు. పండుగ సాయన్న కథను నేటికీ దర్శనం మొగులయ్య వంటి బిక్షుక గాయకులు 12 మెట్ల కిన్నెరపై వీరోచితంగా గానం చేస్తారు.

- శివ ముదిరాజ్,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు,  ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోషియేషన్