Success: పంచాయతన శైలి దేవాలయాల చరిత్ర విశేషాలు ఇవే

భారతదేశంలో తొలిసారిగా ఆలయాలను ఇక్ష్వాకులు కృష్ణా నది ఒడ్డున వీరాపురంలో నిర్మించారు. కాగా, ఉత్తర భారతదేశంలో తొలిసారి ఆలయాల నిర్మాణాన్ని గుప్తులు చేపట్టారు. వీరు తొలి దశలో ఆలయ నిర్మాణానికి రాతిని ఉపయోగించారు. మలిదశలో రాతితోపాటు ఇటుకను సైతం ఉపయోగించారు. గుప్తుల కాలంలో ఆలయ నిర్మాణాలు, వాస్తుశైలి అత్యున్నత స్థాయికి చేరింది. కాబట్టి, భారత వాస్తు చరిత్రలో గుప్తుల కాలంలో కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ వాస్తుశైలిలో ఆలయ నిర్మాణ ప్రగతి ఐదు దశల్లో జరిగింది. 

మొదటి దశ: ఎలాంటి గోపురాలు లేని సమతల పైకప్పు ఆలయాలు, చతురస్రాకార ఆలయాలు, బోలు స్తంభాలతో ఉన్న ప్రవేశ ద్వారాలు, తక్కువ ఎత్తుగల వేదికపై నిర్మాణం వంటివి నిర్మించారు. 

రెండో దశ: ఈ దశలో మొదటి దశలోని సమతల పైకప్పు, చతురస్రాకారం వంటి లక్షణాలను రెండో దశలోనూ కొనసాగించారు. మొదటి దశలో బోలుగా ఉన్న స్తంభాలతో ప్రవేశ ద్వారాలు నిర్మిస్తే  రెండో దశలో నిండైన శిలాస్తంభాలతో ప్రవేశద్వారాలు నిర్మించారు. మొదటి దశలో తక్కువ ఎత్తు గల వేదికలపై ఆలయాలను నిర్మిస్తే రెండో దశలో ఎత్తయిన వేదికలపై ఆలయాలను నిర్మించారు. ఈ దశలో గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ కోసం స్థలాన్ని వదిలి మందిరాన్ని నిర్మించారు. రెండంతస్తుల ఆలయాలను సైతం రెండో దశలో నిర్మించారు. 

  • ఉదా: పార్వతీ ఆలయం – నాచన కూతార (మధ్యప్రదేశ్​) 

మూడో దశ: ఈ దశలో రెండో దశలోని నిర్మాణ రీతులను కొనసాగిస్తూనే కొన్ని నూతన పద్ధతులను ప్రవేశపెట్టారు.

కొత్త పద్ధతులు

  • 1. పైకప్పులకు శిఖరాలను నిర్మించారు.
  • 2. పంచాయతన శైలిని ప్రారంభించారు.

పై కారణాల వల్లనే మూడో దశ నుంచి నగర శైలి/ శిఖర శైలి ప్రారంభమైందని అనేక మంది చిత్రకారులు పేర్కొంటారు. ఉత్తర్​ప్రదేశ్ లోని కాన్​పూర్​ వద్ద భితర్​గావ్​లోని టెర్రాకోట ఇటుకలతో నిర్మించిన ఆలయం ఈ దశకు చెందింది. 

నాలుగో దశ: ఇందులో పూర్వ లక్షణాలకు కొత్తగా దీర్ఘచతురస్రాకార మందిర నిర్మాణం చేపట్టారు. 

  • ఉదా: టెరా దేవాలయం

ఐదో దశ: ఈ దశలో వృత్తాకార ఆలయాలను నిర్మించడం ప్రారంభించారు. 

  • ఉదా: దునియుమర్​ – రాజ్​గిర్​ (బిహార్​) 

పంచాయతన శైలి

ఆలయ ప్రాంగణంలోని ముఖ్య దేవునితోపాటు మరో నలుగురు దేవతలకు మందిరాలను నిర్మించడం మొదలుపెట్టారు. ముఖ్య దేవుని గర్భగుడిని భారీ పరిమాణంలోనూ మిగిలినవి తక్కువ పరిమాణంలోనూ నిర్మించారు. 

  • ఉదా: ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రం దేవ్​గర్​లోని దశావతార ఆలయం. దీనిని 1 మీటర్​ 54 సెం.మీ. ఎత్తయిన వేదికపై నిర్మించారు. గోడలపై రామాయణ, మహాభారత ఘట్టాలను చెక్కారు. ఈ ఆలయాన్ని  స్థానికంగా సాగర్​మర్​ అంటారు
  • దుర్గ ఆలయం: ఐహోల్​ (కర్ణాటక) 

నగర శైలి వాస్తు నిర్మాణం 

పంచాయతన శైలిని ఉపయోగించారు. చతురస్ర, దీర్ఘచతురస్రాకార ఆలయాలను నిర్మించారు. ఈ శైలిలో ఆలయ ప్రాంగణాల్లో కోనేరును నిర్మించలేదు. ఆలయ గోడలను నిలువుగా మూడు భాగాలుగా విభజించారు. వీటిని రథా అని పిలిచేవారు. త్రిరథ అనే మూడు భాగాల్లో పలు శిల్పాలు రూపొందించేవారు. తర్వాతి కాలంలో త్రిరథ అనే పంచరథ, సప్తరథ, నవరథ అనే విధంగా విస్తరించింది. ఈ శైలి ఉత్తర, మధ్య భారతదేశంలో అత్యధిక ప్రాచుర్యం పొందింది. 

ఒడిశా శైలి: ఈ శైలి క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు విలసిల్లింది. శిఖరశైలిని ఒడిశాలో దియోల్​ అని అంటారు. చుట్టూ గోడలకు బయటి వైపున సుందరమైన, ఆడంబర నమూనాలతో అలంకరించి, లోపలి వైపు మాత్రం అలంకరణ లేకుండా నిర్మించారు. వీరు స్తంభాలను అధికంగా వినియోగించకుండా స్తంభాల స్థానంలో ఇనుప కడ్డీలను వినియోగించారు. ఈ ఒడిశా శైలిలో గర్భగుడిపై నిర్మాణం క్రమంగా సన్నబడుతూ వెళ్లి చివరకు లోపలి వైపునకు వంపు కలిగి ఉంటుంది. మండపాలను జగమోహన అని అంటారు. వీటి వేదిక చతురస్రాకారంలో ఉంటుంది. ఈ శైలిలోని ఆలయాల చుట్టూ ప్రహరీ గోడలను తప్పకుండా కలిగి ఉంటాయి. 

సోలంకి దేవాలయ రీతి: ఈ ఆలయాలను 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దాల కాలంలో గుజరాత్​ను పాలించిన చాళుక్య (సోలంకి) రాజులు కట్టించారు. వీటి ప్రముఖ లక్షణం సూక్ష్మస్థాయిలో అద్భుతమైన అలంకరణ  మౌంట్​ అబూలోని దిల్వారా ఆలయాలు, మొధేరాలోని ఆలయాలు. 


గుప్తుల తొలి ఆలయాలు


ఆలయం                                                     ప్రదేశం                                                        ప్రత్యేకత 


17వ నంబర్​ ఆలయం                            సాంచీ                                   ఇది గుప్తుల, ఉత్తర భారతదేశంలో మొదటిది

విష్ణు, శక్తి, కంకాళి దేవి ఆలయం           టిగవ (మధ్యప్రదేశ్​)

విష్ణు దేవాలయం                                   ఎరాన్​ (మధ్యప్రదేశ్​)             నిలువెత్తు హరిహర శిల్పం ఉంది.

వరాహ దేవాలయం                               ఎరాన్​ (మధ్యప్రదేశ్​)             గుప్తులకాలంలో ఎరాన్​ను వెరికిన అని పిలిచేవారు. 
                                                                                                                 వెరికనను శాసనంలో సుబోధ నగరం అని పేర్కొన్నారు. 

పార్వతీ, చౌముఖ్​నాథ్​ ఆలయం          నాచన కుతార( మధ్యప్రదేశ్​)

శివ దేవాలయం                                      భూమ్ర(మధ్యప్రదేశ్​)             మహిషాసురమర్ధిని శిల్పం ప్రత్యేకత

దశావతార ఆలయం                              బేవ్​ఘర్​ (ఉత్తర్​ప్రదేశ్​)             అనంతశయన, గజేంద్రమోక్ష శిల్పాలు