ఆరోగ్యంతోనే సమాజ అభివృద్ధి : మంత్రి సీతక్క

  • పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క 
  • రాష్ర్టంలోనే తొలిసారిగా అంగన్​వాడీ ఉద్యోగులకు 
  • క్యాన్సర్ పరీక్షలు ప్రారంభం

ములుగు/ తాడ్వాయి, వెలుగు: సరైన ఆరోగ్యంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పంచాయతీరాజ్, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ములుగులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్తంగా జిల్లాలోని అంగన్​వాడీ టీచర్లు, ఆయాలు, మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. కలెక్టర్ దివాకర, గ్రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సీహెచ్.చిన్నబాబు, శిశు సంక్షేమశాఖ జేడీ ఈ.అక్కేశ్వర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్​ తో కలిసి మంత్రి సీతక్క శిబిరాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం మహిళా పక్షపాతి అని, అంగన్​వాడీ టీచర్లు ప్రజలకు విస్తృత సేవలు అందించేక్రమంలో వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధవహిస్తోందన్నారు. ఏండ్ల తరబడి పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరఫున సరైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్​ కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందస్తు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా ములుగు జిల్లాలో  ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. 

క్యాన్సర్ ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదని, దాన్ని ముందస్తు పరీక్షలు చేయించుకొని నిర్ధారణ జరిగితే నియంత్రించుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం రెండు రోజులపాటు నిర్వహించనున్నారని ఆదివారం ఏటూరునాగారం ఐటీడీఏ గిరిజన భవన్ లో సమీప మండలాల అంగన్​వాడీ టీచర్లు, ఆయాలకు శిబిరం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.శిరీష, తాడ్వాయి సీడీపీవో జి.మల్లీశ్వరి, ఐసీఐసీఐ మేనేజర్​ శ్రీకాంత్, హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ నందెల్లా, నిర్మాణ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు మయూర్, అన్ని సెక్టార్ల సూపర్​వైజర్లు, అంగన్​వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులను చిన్నచూపు చూడొద్దు.. 

దివ్యాంగులు తమ వైకల్యంపై ఆందోళన చెందకుండా ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని, వారిని చిన్నచూపు చూడొద్దని మంత్రి సీతక్క సూచించారు. శనివారం ములుగులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.శిరీష, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, బాలల సంరక్షణ అధికారి జె.ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలపై రెండు బృందాల కళాకారుల ప్రచార రథాలను ములుగులో మంత్రి సీతక్క ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన కళాయాత్రలో ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఇప్పటికే ఐదు పథకాలు విజయవంతంగా అమలు చేస్తోందని, మరో రెండు గ్యారెంటీ త్వరలో అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఎండి.రఫిక్, వివిధ శాఖల అధికారులు, టిఎస్ఎస్ కళాకారులు తదితరులు పాల్గొన్నారు. 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తికి చెందిన మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరేం లచ్చు పటేల్, ఉష రాణి పటేల్ నూతన గృహప్రవేశం, వారి  కూతుర్లు రితిక పటేల్, లక్ష్మీ దీదిక పటేల్, కర్ణ వేదన శుభకార్య వేడుకల్లో మంత్రి పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.