జనగామ నియోజకవర్గంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ

  • రోడ్ల మరమ్మతుకు రూ.15.41 కోట్లు మంజూరు తీరనున్న గతుకుల కష్టాలు

జనగామ, వెలుగు: జనగామ నియోజకవర్గంలోని పంచాయతీ రాజ్ రోడ్లకు మహర్దశ పట్టనుంది. త్వరలోనే మట్టి రోడ్లు బీటీ రోడ్లుగా మారిపోనున్నాయి. గుంతల రోడ్లకు మరమ్మతులు జరుగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర సర్కారు రూ.15 కోట్ల 41 లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తీరనున్న గతుకుల రోడ్ల కష్టాలు..

కాంగ్రెస్​సర్కారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పంచాయతీ రాజ్​శాఖ నుంచి నిధులు మంజూరు కావడంతో గతుకుల రోడ్ల కష్టాలు తీరున్నాయి. రోడ్ల సమస్యపై మార్చిలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో ప్రతిపాదనలు రెడీ చేయించి మంత్రి సీతక్కకు విన్నవించారు. బచ్చన్నపేట మండలం బండనాగారం నుంచి కట్కూరు వరకు 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రూ.5.80 కోట్లు మంజూరయ్యాయి. జనగామ జిల్లా కేంద్రంలోని పీడబ్లూడీ రోడ్ నుంచి సుందరయ్య నగర్ కు 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.3.74 కోట్లు, మద్దూరు మండంలం లద్దునూరు–వంగాలపల్లి మధ్య 5.20 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.5.86 కోట్లు మంజూరయ్యాయి. మొత్తంగా రూ.15.41 కోట్లు మంజూరయ్యాయి.  

ఇబ్బందులు తప్పుతయ్..

బండనాగారంతో పాటు పలు గ్రామాల ప్రజలు కట్కూరు మీదుగా సిద్దిపేటకు, చేర్యాలకు బైక్ లపై ప్రయాణం చేస్తరు. మట్టి రోడ్డు, గుంతల మయంగా ఉండడంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షం పడితే గుంతల్లో నీళ్లు నిలిచి ప్రమాదాలు జరుగుతున్నయ్​. బండనాగారం, కట్కూరు గ్రామాల మధ్య బీటీ రోడ్డు మంజూరు అనందం ఉంది. ప్రయాణానికి ఇబ్బందులు తప్పుతయ్.

శివరాత్రి రాజనర్సు, బండనాగారం

రోడ్ల సమస్యలపై చర్యలు తీసుకుంటాం..

జనగామ నియోజకవర్గంలో గతుకుల రోడ్ల కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నం. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతోంది. మార్చిలో పీఆర్ ఇంజినీరింగ్ శాఖ అధికారులతో రోడ్ల కోసం ప్రతిపాదనలు చేయించి, మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లాం. రూ.15.41 కోట్లు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. నిధులు మంజూరు చేసిన మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు.

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్, జనగామ

ఆనందంగా ఉంది..

కట్కూరు నుంచి బండనాగారం వరకున్న మట్టి రోడ్డు నరకం చూపిస్తుంది. వాన పడితే అంతా బురద మయం. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పెడుతుంది. బీటీ రోడ్డు మంజూరు కావడం సంతోషంగా ఉంది. రోడ్డు నిర్మాణం పూర్తైతే రెండు గ్రామాల మధ్య ప్రయాణికుల కష్టాలు తీరుతయ్.   

బావండ్ల నాగజ్యోతి, కట్కూరు