సంధికి సిద్ధం! కాల్పుల విరమణ దిశగా హమాస్-ఇజ్రాయెల్ అడుగులు

జెరూసలెం/గాజా: ఏడాది నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్–హమాస్​యుద్ధానికి ఎట్టకేలకు తెరపడే దిశగా అడుగులు పడుతున్నాయి. కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని పాలస్తీనియన్ మిలిటెంట్ సంస్థ హమాస్ ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఆపితే తాము కాల్పుల విరమణకు సిద్ధమేనని వెల్లడించింది. అదేసమయంలో గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలో తమ ప్రతినిధి పాల్గొంటారని ఇజ్రాయెల్ వెల్లడించింది. 

దోహాకు చెందిన ఓ అధికార ప్రతినిధి టీం ఈజిప్టు రాజధాని కైరోలో గాజా సంధికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించినట్టు హమాస్​ సీనియర్​ లీడర్ ఒకరు మీడియాకు వెల్లడించారు. ‘‘కాల్పులు విరమించేందుకు హమాస్​ అంగీకరించింది. ఇజ్రాయెల్​ కూడా కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి. ప్రజలందరినీ గాజా స్ట్రిప్​లోకి అనుమతించాలి. ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అంగీకరించాలి. గాజాకు మానవతా సాయానికి అడ్డంకులు లేకుండా చూడాలి” అని తెలిపారు.  

ఈజిప్టు ప్రపోజల్.. స్వాగతించిన నెతన్యాహు 

గాజాలో ఇప్పటికీ మిలిటెంట్ల చేతిలో ఉన్న బందీల విడుదలకు ఓ ఒప్పందాన్ని కుదుర్చేందుకు ఈజిప్ట్​ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఇజ్రాయెల్​ ప్రధాని  నెతన్యాహు తెలిపారు. కైరో మీటింగ్​ ముగిసిన అనంతరం ఇజ్రాయెల్​కు చెందిన మొస్సాద్ స్పై ఏజెన్సీ చీఫ్​ను అజెండాలోని ముఖ్యమైన ప్రోగ్రామ్స్​ను ముందుకు తీసుకెళ్లేందుకు ఖతార్​కు వెళ్లాలని నెతన్యాహు ఆదేశించినట్టు ఇజ్రాయెల్​ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.  ఇదిలా ఉండగా..  అమెరికా​ విదేశాంగ మంత్రి  బ్లింకెన్​ దోహాలో ఖతార్​ నేతలతో గురువారం భేటీ అయ్యారు. 

ఇజ్రాయెల్​– గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు మధ్యవర్తులు కొత్త మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఇజ్రాయెల్​ కాల్పులు విరమిస్తే హమాస్​ కూడా ఆపేస్తుందని, దీంతో పాలస్తీనా ప్రజలు వారి జీవితాలు, భవిష్యత్తును పునర్నిర్మించుకుంటారని తెలిపారు. అయితే, హమాస్ నేత యాహ్యా సిన్వర్‌‌‌‌ ఇటీవల ఇజ్రాయెల్ దాడిలో మృతిచెందిన నేపథ్యంలో ఆ సంస్థ తాజాగా సంధికి ఓకే చెప్పడం గమనార్హం. 

 లెబనాన్, గాజాపై బాంబుల వర్షం..

హమాస్​తో ఓ వైపు కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్​.. మరోవైపు తాజాగా గాజా, లెబనాన్​పై విరుచుకుపడింది. ఆగ్నేయ లెబనాన్​లో జర్నలిస్ట్​లు ఉండే గెస్ట్​హౌజెస్​పై ఎయిర్​స్ట్రైక్​ చేసి, బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో వివిధ న్యూస్​ ఏజెన్సీలకు చెందిన ముగ్గురు జర్నలిస్టులు మృతిచెందినట్టు లెబనాన్​ మీడియా తెలిపింది. 

మృతుల్లో తమ  కెమెరా ఆపరేటర్ ఘస్సన్ నజర్, బ్రాడ్​కాస్ట్​ ఆపరేటర్ మహ్మద్ రిదా ఉన్నారని బీరుట్​కు చెందిన అల్-మయదీన్ టీవీ తెలిపింది. తమ కెమెరా ఆపరేటర్ వాసిమ్ ఖాసిమ్ సైతం ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందినట్టు హెజ్​బొల్లా  ప్రకటించింది. అదే సమయంలో గాజాపైనా ఇజ్రాయెల్​ విరుచుకుపడింది. దక్షిణ గాజాలోని ఖాన్​యూనిస్​పై జరిపిన దాడిలో 38 మంది మరణించారు. ఇందులో చాలామంది చిన్నారులు ఉన్నారు.