చెరువులను చెరబట్టారు!.. హైదరాబాద్​కు దగ్గరగా ఉండడంతో భూములకు డిమాండ్

  •     ప్రజా దర్బార్​లో కంప్లైంట్​ చేసినా చర్యలు తీసుకోని ఆఫీసర్లు
  •     ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో లేఅవుట్లు వేసి అమ్మకాలు
  •     పొలిటికల్ లీడర్లు, రియల్ వ్యాపారుల మిలాఖత్!
  •     హైదరాబాద్​కు దగ్గరగా ఉండడంతో భూములకు డిమాండ్ 

పాలమూరు చెరువులు, కుంటలను అక్రమార్కులు చెరబట్టారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లను అమ్ముతున్నారు. కబ్జా పర్వంపై ఆఫీసర్లకు స్థానికులు ఫిర్యాదు చేసినా యాక్షన్​ తీసుకోవడం లేదు.

మహబూబ్​నగర్, వెలుగు : హైదరాబాద్​కు దగ్గరగా ఉండడంతో మహబూబ్​నగర్​జిల్లాలోని భూములకు ఎనలేని డిమాండ్ ఉంది. శంషాబాద్​ఎయిర్​ పోర్టుకు కేవలం 70 కి.మీ. లోపే ఉండటంతో ఎన్​హెచ్​-44 కు ఆనుకొని ఉన్న ఎకరం భూమి విలువ రూ.2–3 కోట్ల వరకు పలుకుతోంది. దీంతో గత ప్రభుత్వంలోని కొందరు బీఆర్ఎస్​లీడర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు, లావుని పట్టాలు, అసైన్డ్​ భూములు కబ్జా చేసినట్లు సమాచారం. గ్రామాల్లోని వైకుంఠ ధామాలను సైతం ధ్వంసం చేసి ఆక్రమణలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఆఫీసర్లను మేనేజ్​చేసి చెరువుల్లో లేఅవుట్లు వేయడానికి కొందరు డీటీసీపీ, మహబూబ్​నగర్​అర్బన్​ డెవలప్​మెంట్​అథారిటీ (ముడా) పర్మిషన్లు కూడా పొందినట్లు తెలుస్తోంది. ఉమ్మడి బాలానగర్​మండలం ముదిరెడ్డిపల్లి చెరువులోని సర్వే నంబర్​ 576, 582, 584లో దాదాపు రెండు ఎకరాల్లో బఫర్​జోన్, ఎఫ్టీఎల్​ఉండగా, ఈ భూమిని ఆక్రమించిన ప్రైవేట్​ వ్యక్తులు 25 ప్లాట్లు చేశారు. ఈ విషయంపై గ్రామస్తులు కంప్లైంట్ చేస్తున్నా అధికారుల నుంచి స్పందన లేదు. జిల్లా స్థాయిలో జరిగే ప్రజావాణిలో ఫిర్యాదులు చేసినా.. కలెక్టర్లు డీపీవోకు, ఇరిగేషన్​ఆఫీసర్లకు రెఫర్​ చేయడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 

‘ప్రజా దర్బార్’ ఫిర్యాదులో చేసినా ఆగని దందా

అయితే, కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ స్థలంలో బోర్డును ఏర్పాటు చేశారు. ప్లాట్ల నంబర్లతో సహా బోర్డులో రాసి ఈ ప్లాట్లు కొనడం, అమ్మడం నేరమని స్పష్టం చేశారు. కానీ, కొద్ది రోజులకే ఈ బోర్డును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఆనవాళ్లు లేకుండా చేశారు. తిరిగి ప్లాట్ల అమ్మకాలకు తెరలేపినట్లు తెలిసింది. దీంతో గ్రామానికి చెందిన కొందరు ఈ విషయంపై సీఎం క్యాంప్​ ఆఫీసులో నిర్వహించే

‘ప్రజా దర్బార్’లో జనవరి 5న ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వగా, ఇంత వరకు జిల్లా ఆఫీసర్లు యాక్షన్ తీసుకోలేదు. ఇరిగేషన్ డిపార్ట్​మెంట్ ఫీల్డ్​ఎంక్వైరీ చేయగా, కబ్జా జరిగిందని జిల్లా కలెక్టర్​కు, ఇటీవల రిటైర్ అయిన డీపీవోకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

కబ్జా కోరల్లో మరిన్ని చెరువులు

మహబూబ్​నగర్​జిల్లాలో 1,265 చెరువులు,190 కుంటలు ఉండగా, వీటిలో సగానికి పైగా మాయమయ్యాయి. ప్రధానంగా పాలమూరు పెద్ద చెరువు ఎఫ్టీఎల్​పరిధిలో యథేచ్ఛగా ఇండ్ల నిర్మాణాలు జరిగాయి. పాలకొండ పెద్ద చెరువులో కబ్జాలు చేసి కాలనీ తరహాలో నిర్మాణాలు చేపట్టారు. ఇమాంకుంట, గంగోసుకుంట, నల్లచెరువు, రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. బాపన్​కుంట,  బతుకమ్మ కుంటతో పాటు మరో పది కుంటలను ఆక్రమించి వాటి ఆనవాళ్లు లేకుండా చేశారు. జడ్చర్లలోని నల్ల చెరువు, పెద్ద చెరువు, దేవరకద్రలో ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న చెరువు, బాలానగర్​ పెద్ద చెరువులను అక్రమార్కులు చెరబెట్టారు. 

వెంచర్ల వెనుక పొలిటికల్ లీడర్లు!

చెరువుల ఆక్రమణలు, వాటిలో వెంచర్లు ఏర్పాటు వెనుక పొలిటికల్​లీడర్లు ఉండటంతో ఆఫీసర్లు చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రియల్​ఎస్టేట్ వ్యాపారులతో ఈ ల్యాండ్స్​కు సంబంధించి  కోట్లల్లో డీల్స్​చేసుకొని, అడ్డదారుల్లో పర్మిషన్లు తీసుకునేందుకు కొందరు ఆఫీసర్లను కూడా మేనేజ్​చేశారనే టాక్ ఉంది. 

మూడు సార్లు ఎంక్వైరీ చేసినం

ముదిరెడ్డిపల్లి చెరువు కబ్జాకు గురైంది వాస్తవమే. 576, 582, 584 సర్వే నంబర్లు చెరువుకు సంబంధించినవి. ఇందులో చెరువు బఫర్​ జోన్, ఎల్టీఎల్ ఉంది. ఏడాదిలో ఇప్పటి వరకు మూడు సార్లు సర్వే చేశాం. సీఎం ‘ప్రజా దర్బార్’ నుంచి సమగ్ర నివేదిక ఇవ్వాలని మాకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో మళ్లీ రీసర్వే కూడా చేశాం. కబ్జాకు గురైందని తేల్చాం. ఈ నివేదికను జిల్లా కలెక్టర్​తో పాటు డీపీవోకు పంపించాం. దీనిపై వాళ్లే చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒక వేళ అక్కడ నిర్మాణాలు జరిగితే వాటిని అడ్డుకుంటాం.

- శివుడు, ఇరిగేషన్​ ఏఈ, జడ్చర్ల