పిల్లలను అన్నిరంగాల్లో ప్రోత్సహించాలి

తొర్రూర్, వెలుగు: పిల్లలను తల్లిదండ్రులు అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు పాఠశాల కారస్పాండెంట్ ఏ.దేవేందర్ రెడ్డి, డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు, ప్రముఖ మోటివేటర్, నటుడు ప్రదీప్ గెస్టులుగా హాజరయ్యారు. 

సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా చెర్లపాలెం వాస్తవ్యులు ప్రముఖ కార్డియా లజిస్ట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కూడా నిర్వహించి, శుభాకాంక్షలు తెలిపారు. లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ స్థాపనకు 25 ఏండ్లు పూర్తి అయిన సందర్భంగా స్కూల్ అభివృద్ధికి కృషి చేసిన టీచర్లకు, స్టాఫ్‌నకు ప్రత్యేక సత్కారాలు అందజేశారు. విద్యార్థుల చిన్నారుల సంగీత, నృత్యం, నాటకాల ప్రదర్శనలు, జబర్దస్త్ ఫేమ్ జీవన్, దర్శకుడు, నటుడు, రచయిత గట్టు నవీన్  అలరించారు. 

పూర్వ విద్యార్థులు వారి అనుభవాలను పంచుకున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ ఇన్నేండ్ల ప్రయాణంలో అనేక మందిని ప్రతిభావంతులుగా  తీర్చిదిద్దిందని ప్రశంసించారు. కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, పాఠశాల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.