ఆఫ్ఘాన్‎పై అర్ధరాత్రి విరుచుకుపడిన పాక్.. మెరుపు దాడుల్లో 15 మంది మృతి

ఇస్లామాబాద్: పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్‌‎పై పాకిస్థాన్ విరుచుకుపడింది. ఆప్ఘాన్-పాక్ సరిహద్దులోని పక్తికా ప్రావిన్స్‌‎పై మంగళవారం (డిసెంబర్ 24) అర్ధరాత్రి పాక్ మెరుపు దాడులు చేసింది. పాక్ చేసిన వైమానిక దాడుల్లో 15 మంది మరణించారని భద్రతా అధికారులు తెలిపారు. ఇందులో మహిళలు, పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. పాక్ మీడియా ప్రకారం.. 2024, డిసెంబర్ 24 అర్ధరాత్రి పక్తికా ప్రావిన్స్‌ బర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాక్ ఎయిర్ ఫోర్స్ బాంబుల వర్షం కురిపించింది. 

లామన్‌తో సహా ఏడు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైనికులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ముర్గ్ బజార్ గ్రామంలో ధ్వంసమైనట్లు సమాచారం. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) రహస్య స్థావరాలే లక్ష్యంగా పాక్ ఈ మెరుపు దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.  ఈ వైమానికి దాడుల్లో కొందరు ఉగ్రవాదులతో పాటు సామాన్య పౌరులు, శరణార్ధులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

పాక్ వైమానికి దాడులను తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పాక్ మెరుపు దాడులను పిరికిపంద చర్యగా అభివర్ణించింది. బర్మాల్, పక్తికాపై జరిగిన వైమానిక దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ రక్షణ మంత్రి ఇనాయతుల్లా ఖ్వారాజ్మీ శపథం చేశారు. ఆప్ఘాన్ సార్వభౌమాధికారాన్ని రక్షించడం మా హక్కు అని పునరుద్ఘాటించారు. పాక్ వైమానిక దాడుల్లో వజీరిస్థానీ శరణార్థులు కూడా ఉన్నారని తెలిపారు. ఈ చర్యకు పాకిస్థాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

కాగా, 2022 నుండి తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ పాకిస్తాన్ సైనికులు, పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోంది. టీటీపీ దాడుల్లో ఇప్పటి వరకు చాలా మంది పాక్ సైనికులు, పోలీసులు మృతి చెందారు. ఈ ఏడాది మార్చిలో టీటీపీ చేసిన దాడుల్లో లెఫ్టినెంట్ కల్నల్ మరియు కెప్టెన్‌తో సహా ఏడుగురు సైనికులు మరణించారు. అప్పటి నుండి కోపంతో రగిలిపోతున్న పాక్.. తాజాగా టీటీపీ స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా దాడుల నేపథ్యంలో మరోసారి పాక్, ఆప్ఘాన్ దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి.