కోల్​కతాలో ట్రైనీ డాక్టర్ రేప్ కేసు.. ప్రధానికి పద్మ అవార్డు గ్రహీత వైద్యుల లేఖ

  • వైద్యుల రక్షణకు మరింత కఠిన చట్టాలు తేవాలని అభ్యర్థన

న్యూఢిల్లీ, వెలుగు: కోల్​కతాలో రెసిడెంట్ డాక్టర్ పై జరిగిన రేప్, అత్యాచార ఘటనపై జోక్యం చేసుకోవాలని 71 మంది పద్మ అవార్డు గ్రహీత వైద్యులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పద్మ అవార్డు గ్రహీత వైద్యులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 

కోల్ కతా ఘటనతో వేదనకు గురై ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి దురాగతాలను అడ్డుకోవడానికి పటిష్టమైన చర్యలు అవసరమని చెప్పారు. ఇప్పటికే ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయడం, లైంగిక హింసకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చేయాలని పేర్కొన్నారు. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ కార్మికుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించి త్వరగా  అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వైద్యులు, వైద్య నిపుణులు, వైద్య సంస్థలపై దాడులను నివారించడానికి ఉద్దేశించిన హింస నిరోధక బిల్లు–2019 సిద్ధంగా ఉన్నప్పటికి పార్లమెంటు ఆమోదం పొందలేదని గుర్తు చేశారు. అలాగే ఆరోగ్య సంరక్షణ కార్మికులపై మానసిక, శారీరక హింసకు పాల్పడే వారికి కఠినమైన శిక్ష విధించేలా ప్రతిపాదిత ఆర్డినెన్స్/బిల్లు  తేవాలని కోరారు. ఇలాంటి కేసులను న్యాయస్థానాలు వేగంగా పరిష్కరించాలని, ఈ నేరాలను నాన్‌బెయిలబుల్‌ కేసులుగా పరిగణించాలని రిక్వెస్ట్ చేశారు.