నల్గొండ జిల్లాలో వడ్ల కొనుగోళ్లు వెరీ స్లో

  • లక్ష్యం 4 లక్షల టన్నులు
  • ఇప్పటివరకు 3,722 టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తి
  • పలుచోట్ల ఓపెన్ కానీ సెంటర్లు
  • ఓపెన్ అయినా.. కొనుగోళ్లు ప్రారంభం కాలే

యాదాద్రి, వెలుగు : జిల్లాలో వడ్ల కొనుగోళ్లు స్లోగా సాగుతున్నాయి. ఒకవైపు పూర్తి స్థాయిలో సెంటర్లు ఓపెన్ కాలేదు. మరోవైపు ఓపెన్​చేసిన సెంటర్లలో వడ్లు కొనుగోలు సరిగా జరగడం లేదు. మిల్లులకు సీఎంఆర్​ కేటాయించకపోవడంతో వడ్ల కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. సెంటర్లు ఓపెన్ చేసి 15 రోజులు కావస్తున్నా.. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోలేదు.

నిర్దేశించిన లక్ష్యానికి ఒక్క శాతం వడ్లను కూడా ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. యాదాద్రి జిల్లాలో ఈ వానాకాలంలో 2.85 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. దిగుబడి ఆరు లక్షల టన్నులు వస్తుందని, కొనుగోలు సెంటర్లకు 4 లక్షల టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆఫీసర్లు అంచనా వేశారు. మిగిలిన వడ్లు తిండి అవసరాలతోపాటు మిల్లర్లు కొనుగోలు చేస్తారని లెక్కలు వేశారు. 

అన్ని సెంటర్లు ప్రారంభం కాలే..

భూదాన్​పోచంపల్లి, మోత్కూరు సహా మరికొన్ని మండలాల్లో గత నెల మొదటి వారంలోనే కోతలు ప్రారంభమయ్యాయి. అప్పటికీ జిల్లాలో ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభం కాలేదు. జిల్లావ్యాప్తంగా మొత్తం 369 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఆఫీసర్లు, దసరా పండుగ నుంచి వాటిని ప్రారంభిస్తున్నారు. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, ఎఫ్​పీవో కలిపి ఇప్పటివరకు 231 సెంటర్లను ఓపెన్ చేశారు. 

ఒక్క శాతం కూడా కొనుగోలు చేయలే..

ఓపెన్ చేసిన అన్ని సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. 231 సెంటర్లు ఓపెన్​ చేస్తే కేవలం 50  సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. 4 లక్షల టన్నుల కొనుగోలే లక్ష్యంగా సివిల్ సప్లయ్​డిపార్ట్​మెంట్​ రంగంలోకి దిగింది. అయితే ఇప్పటివరకు కేవలం 280 మంది రైతులకు చెందిన 3,722 టన్నుల వడ్లను మాత్రమే కొనుగోలు చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం ఒక్క శాతం వడ్లను కూడా కొనుగోలు చేయలేదు.

సెంటర్లలో వడ్ల కుప్పలు ఉన్నప్పటికీ కొనుగోళ్లు జరగడం లేదు. కొన్ని సెంటర్లకు ఇప్పటికీ గన్నీ బ్యాగులు సరిగా అందలేదని తెలుస్తోంది. మరికొన్ని సెంటర్లకు తేమ, ప్యాడీ క్లీనర్లు సమకూర్చలేదు. కొనుగోలు వివరాలు ఎంట్రీ చేయడానికి ట్యాబ్స్​కూడా అందించలేదని సమాచారం. పైగా మిల్లులకు కస్టమ్​మిల్లింగ్​రైస్​(సీఎంఆర్​) కేటాయించకపోవడంతో ఎక్కడ నిల్వ చేయాలన్న కారణంగా వడ్ల కొనుగోళ్లు సాఫీగా సాగడం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన వడ్లను మార్కెట్​కమిటీల్లోని గోదాములకు తరలించారు. 

తరచూ వాన.. తడుస్తున్న వడ్లు..

జిల్లాలో ఇటీవల తరచూ వానలు కురుస్తుండడంతో కొనుగోలు సెంటర్లకు చేరుకున్న వడ్ల కుప్పలు తడిచిపోతున్నాయి. దీంతో వడ్ల కుప్పలను కాపాడుకోవడానికి రైతులు తిప్పలు పడుతున్నారు. వానల వల్ల వడ్ల కుప్పలు తడుస్తుండడంతో తేమ శాతం పెరిగుతోంది. దీంతో వాటిని కొనుగోలు చేయడానికి అధికారులు విముఖత చూపిస్తున్నారు. తేమ శాతం తగ్గిన తర్వాతే కొనుగోలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. వాన కారణంగా పొలం బురదగా మారడంతో కొన్నిచోట్ల ఇంకా వరి కోతలు 
ఆగిపోయాయి.