వడ్ల పైసలు లేట్ .. కొనుగోలు కేంద్రాలు మూసేసి వారమైంది

  • అన్నదాలకు ఇంకా పైసలు రాలే
  • 2 వేల మందిపైగా రూ.50 కోట్లు పెండింగ్
  • పైసల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు

యాదాద్రి, వెలుగు : రైతులకు వడ్ల పైసలు ఇంకా రాలేదు. వడ్లు అమ్మిన రెండు, మూడు రోజుల్లోనే పైసలిస్తామంటూ సర్కారు చెప్పినా ఆచరణలో సాధ్యం కావడం లేదు. నెల రోజులు గడిచినా కొందరు రైతుల అకౌంట్లలో పైసలు పడలేదు. దీంతో వేలాది మంది రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్​లో జిల్లావ్యాప్తంగా 2.93 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. సీజన్​లో వానలు సరిగా కురవకపోవడం, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో కొన్నిచోట్ల పంటలు ఎండిపోయి దిగుబడి కొంత తగ్గింది.

సాగు చేసిన ప్రకారం 6 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, 5.25 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్​ఆఫీసర్ల అంచనా వేశారు. ఏప్రిల్​1 నుంచి జిల్లాలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభించారు. మొత్తంగా హమాలీల కొరత, లారీలు రాకపోవడం, మిలర్ల కొర్రీలు, అకాల వర్షాల కారణంగా కొన్ని సెంటర్లలో వడ్లు తెచ్చిన నెల గడిస్తే కానీ కొనుగోళ్లు చేయలేదు. రాజాపేట సహా పలు మండలాలకు చెందిన కొందరు రైతులు కొనుగోలు సెంటర్​కు ఏప్రిల్​రెండో వారంలో వడ్లు తెస్తే మే రెండో వారంలో కొనుగోలు చేశారు. పైగా తేమ పేరుతో కటింగ్​తోపాటు హమాలీ చార్జీలు కూడా వసూల్​చేశారు. 

నెల గడిచినా పైసలు పడ్తలే..

జిల్లాలో ఏర్పాటు చేసిన 323 సెంటర్లలో రెండు నెలలకు పైగా 35,865 మంది రైతుల వద్ద రూ.741 కోట్ల విలువైన 3.37 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేశారు. కొనుగోళ్లు చేసిన రెండు, మూడు రోజుల్లోనే రైతుల అకౌంట్లలో పైసలేస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలో అది జరగడం లేదు. నెల గడిచినా వడ్ల పైసలు రైతుల ఖాతాల్లో పడడం లేదు. వడ్ల కొనుగోళ్లు ముగిసి ఇప్పటికీ వారం రోజులు గడిచింది. ఇప్పటివరకు దాదాపు 3,3500  మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.690 కోట్లు జమ చేశారు. ఇంకా 2,365 మంది రైతుల ఖాతాల్లో రూ. 50 కోట్లకు పైగా డబ్బులు జమ చేయలేదు.

అయితే, జిల్లాలోని సీఎంఆర్​మిల్లుల్లో స్థలం కొరత కారణంగా ఇతర జిల్లాలకు వడ్లు పంపించడంతో పేమెంట్​విషయంలో ఆలస్యం జరుగుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇతర జిల్లాలకు చెందిన మిల్లర్లు వడ్లను త్వరగా అన్​లోడ్​ చేసుకోకపోవడం వంటి కారణాలతో పేమెంట్​ఆలస్యమైందని అంటున్నారు. అయితే, ఇక్కడి నుంచి వడ్లతో వెళ్లిన లారీలు ఏ మిల్లుకు వెళ్లాయో కూడా సరిగా ట్యాగింగ్​కాలేదని, ఒక్కో రైతు నుంచి పలుమార్లు ఓటీపీ అడిగి తీసుకున్నారు. మే 18న వడ్లను కాంటా పెట్టిన ఓ రైతు నుంచి రెండుమార్లు ఓటీపీ తీసుకోవడం ఇందుకు నిదర్శనం. 

డబ్బుల కోసం రైతుల ఎదురుచూపు..

వానాకాలం సీజన్​ ప్రారంభంకావడంతో వ్యవసాయ పనులకు పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. యాసంగి సీజన్​వడ్లు అమ్మి నెల గడిచినా 2,365 మంది రైతులకు రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు. దీంతో రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. 

నెల కావస్తున్న వడ్ల పైసలు రాలేదు

నేను వడ్లు కాంటా పెట్టి నెల కావస్తున్నది. ఇప్పటివరకు వడ్ల పైసలు రాలేదు. వడ్ల పైసలు రాక ట్రాక్టర్, వరి కోత మిషన్ కు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. డబ్బుల గురించి అధికారులను అడిగితే ఇంకా వారం రోజులు పడుతుందని చెబుతున్నారు. వడ్ల పైసలు త్వరగా ఇవ్వాలి. 

పడిగం స్వామి, రైతు, బేగంపేట 

త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం- 

వడ్ల కొనుగోలు ముగిసింది. ఇతర జిల్లాలకు పంపించిన వడ్ల కారణంగా రైతుల ఖాతాల్లో డబ్బు వేయడం కొంత ఆలస్యమైంది. త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 గోపికృష్ణ, సివిల్​ సప్లయ్​ డీఎం, యాదాద్రి జిల్లా