పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు

  •     స్థానిక మిల్లుల్లో స్థలాభావం
  •     రంగారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాలకు ధాన్యం 
  •     ఇప్పటికే తరలించిన 40 వేల టన్నులు
  •     సమయానికి రాని లారీలు
  •     సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో కొనుగోలు చేసిన వడ్లు ఇతర జిల్లాలకు పంపిస్తున్నారు. జిల్లాలోని రైస్​ మిల్లుల్లో స్థలాభావం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. లారీలు సరిగా రాకపోవడంతోపాటు వివిధ కారణాలతో జిల్లాలో వడ్ల కొనుగోలు స్పీడ్​గా సాగడం లేదు. జిల్లాలో 2.93 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేయగా, సుమారు 5.25 లక్షల మెట్రిక్​టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్​ఆఫీసర్లు అంచనా వేశారు.

ప్రైవేట్​గా మిల్లర్లు కొనుగోలు చేసినా 4 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు సెంటర్లకు వస్తాయని ఆఫీసర్లు భావించారు. కాగా, జిల్లాలో ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించి 50 రోజులు కావస్తోంది. ఇప్పటివరకు జిల్లాలోని 323 సెంటర్లలో దాదాపు 26 వేల మంది రైతుల వద్ద 2.50 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. 

లారీలు రావు.. 

ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా లారీల సమస్య నెలకొంది. కొనుగోలు సెంటర్లు నుంచి కాంటా వేసిన వడ్ల బస్తాలను తరలించడంలో ఆలస్యం జరుగుతోంది. బస్తాల తరలింపు కోసం రైతుల వద్ద లారీ డ్రైవర్లు అదనంగా సొమ్ము డిమాండ్​చేస్తున్నారు. అదేవిధంగా మిల్లుల్లో హమాలీ కొరత కూడా ఉంది. దీంతో వెళ్లిన లారీలు వెళ్లినట్టే రోజుల తరబడి మిల్లుల వద్దే ఆగిపోతున్నాయి. సెంటర్లలో వడ్ల కొనుగోలు రోజుల తరబడి ఆలస్యం అవుతోంది. 

పక్క జిల్లాలకు వడ్లు.. 

మిల్లుల్లో జాగ లేకపోవడం, మిల్లర్లు ఇబ్బంది పెడుతూ ఉండడంతో కొనుగోలు చేసిన వడ్లను ఇతర జిల్లాలకు పంపించాలని సివిల్ సప్లయ్​ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు జిల్లాలైన రంగారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాల్లోని సీఎంఆర్​మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 2.50 లక్షల టన్నుల్లో రంగారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాల్లోని మిల్లులకు 40 వేల మెట్రిక్​టన్నుల వడ్లను తరలించారు. మరికొంత పంపించేందుకు కూడా ఇండెంట్ రెడీ చేస్తున్నారు. 

నెల దాటినా ధాన్యం కొంటలేరు : నగేశ్​, బొందుగుల బొందుగులలోని సెంటర్​కు వడ్లను తీసుకొచ్చి నెల దాటింది. అయినా కాంటా వేస్తలేరు. సెంటర్​కు వడ్లను తీసుకొచ్చిన తర్వాత నాలుగుసార్లు వాన పడి తడిచిపోయాయి. తడిసిన వాటిని మళ్లీ మళ్లీ ఆరబెట్టాల్సి వస్తోంది. కాంటా వేసిన కొందరు రైతుల వడ్లను కూడా లారీలు రాకపోవడంతో తీసుకుపోతలేరు. 

మిల్లుల్లో జాగ లేదు..

వడ్ల కొనుగోలు ఆలస్యం కావడానికి మిల్లుల్లో జాగ లేకపోవడం కారణంగా మారింది. జిల్లాలోని సీఎంఆర్​ మిల్లుల్లో 3.50 లక్షల టన్నుల వడ్లను నిల్వ చేయడానికి జాగ ఉంటే.. అంతకు మించి నిల్వలున్నాయి. కస్టం మిల్లింగ్​రైస్​(సీఎంఆర్​)ను మిల్లర్లు​టైమ్​కు అందించకపోవడంతో మిల్లుల్లో నిల్వలు పేరుకుపోయాయి. వీటితోపాటు టెండర్ వడ్లను ఖాళీ చేయకపోవడంతో మిల్లుల్లో 5.25 లక్షల టన్నులు ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఈ కారణంగా మిల్లుల వద్దకు వచ్చిన వడ్లను అన్​లోడ్ చేయడంలో మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హమాలీలు లేరంటూ కొందరు సాకులు చెబుతున్నట్టుగా తెలిసింది.