అధిక వడ్డీ ఇస్తానని .. రూ. కోటిన్నరతో పరార్‌‌

  • నిందితుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు

మెట్‌‌పల్లి, వెలుగు: అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపించి గ్రామస్తుల నుంచి రూ. కోటిన్నర వసూలు చేసిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లి మండలం జగ్గసాగర్‌‌కు చెందిన పి.మహిపాల్‌‌ అధిక వడ్డీ ఇస్తానని ఆశ పెట్టి గ్రామంలోని పలువురి వద్ద డబ్బులు తీసుకున్నాడు. సుమారు 100 మంది రూ. 50 వేల నుంచి రూ. 3 లక్షల వరకు అప్పు ఇచ్చారు. డబ్బులు ఇస్తానన్న టైం దాటిపోవడంతో అప్పు ఇచ్చిన వారు మహిపాల్‌‌పై ఒత్తిడి పెంచారు. ఇయ్యాల, రేపు అంటూ తప్పించుకు తిరుగుతుండడంతో విసుగు చెందిన బాధితులు వడ్డీ లేకున్నా అసలైనా చెల్లించాలని పట్టుబట్టారు.

అయితే నెల రోజులుగా మహిపాల్‌‌ కనిపించకపోవడంతో గ్రామస్తులు రెండు రోజుల కింద అతడి ఇంటికి వెళ్లి గురువారం వరకు డబ్బులు చెల్లించాలని, లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. గురువారం బాధితులంతా మహిపాల్‌‌ ఇంటికి వెళ్లగా తాళం వేసి కనిపించింది. దీంతో మోసపోయినట్లు గ్రహించి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.