కోట్ల భూములు మింగేస్తున్రు

  • టెన్ పర్సెంట్ లేఅవుట్ భూములకు రెక్కలు
  • సహకరిస్తున్న రిజిస్ట్రేషన్, మున్సిపల్ ఆఫీసర్లు
  • ఇష్టారీతిన అమ్మేస్తున్న ఓనర్లు

గద్వాల, వెలుగు: గద్వాల టౌన్, చుట్టు పక్కల ప్రాంతాల్లోని రూ. కోట్లు విలువ చేసే లే అవుట్లలో వదిలేసిన 10 శాతం భూములను  ఇష్టారీతిన అమ్ముకుంటున్నారు. వీటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  గద్వాల టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో పాటు చుట్టుపక్కల వెంచర్లలో రూల్స్ ప్రకారం వదిలిపెట్టిన 10 శాతం లేఅవుట్ భూములను ఇప్పటికే చాలా వరకు అమ్మేశారు.  గద్వాల టౌన్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 42 లో జమ్మిచెడు శివారులోని సర్వేనెంబర్ 42 హరిత హోటల్ ముందు ఉన్న 10 శాతం లేఅవుట్ భూమిని ప్లాట్లు చేసి కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు.  

దీన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఒకే నెలలో మూడుసార్లు ఈ ప్లాట్ లకు రిజిస్ట్రేషన్ చేసి ఐదు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సృష్టించారు.  దాదాపు ఒక్కొక్క  ప్లాటును రూ.60 లక్షల నుంచి కోటి వరకు విక్రయిస్తున్నారు.  26  జూన్ 2024 రోజు ఒకే ప్లాటుకు రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్లు  తీసుకున్నారు. ఇవన్నీ ఈసీ లో కనపడకుండా చేస్తున్నారు.

కొత్త హౌసింగ్ బోర్డ్ సమీపంలోని ఓం శాంతి ఆఫీస్ ఎదుట  లేఅవుట్ భూమిని అగ్రిమెంట్ చేసుకొని అమ్మకానికి సిద్ధం చేశారు. లేఅవుట్లలో ఉన్న 10 శాతం  ప్రభుత్వ భూములకు ఫినిషింగ్ వేయకపోవడం, ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టకపోవడంతో పాటు మార్కెట్ విలువ కన్నా తక్కువ రేటుకు వస్తున్నాయనే ఉద్దేశంతో చాలామంది కొనుగోలు చేసి మోసపోతున్నారు. 

అమ్ముకున్నా.. ఇల్లు కట్టినా అడిగే వారే లేరు

గద్వాల టౌన్ లోని కుంట వీధిలోని సర్వే నంబర్ 917 లో ఎల్పీ నంబర్ 53/ 71 వేసిన వెంచర్ లోని 10 శాతం లేఅవుట్ భూమిని ఓనర్లు అమ్మేసుకున్నారు. రథశాలకు ఎదురుగా గద్వాల సిటీ మధ్యలో  గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకొని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినా అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. బీరెల్లి చౌరస్తా, కొత్త హౌసింగ్ బోర్డు కాలనీలోని సర్వేనెంబర్ 759 లోని భూములను, వేద నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అమ్మేసుకుంటున్నా మున్సిపల్ , రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడం లేదు.

ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న ఎల్పీ నంబర్లలో 10 శాతం లేఅవుట్ భూములు గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఆధీనంలో ఉండాలి.  వాటికి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. గద్వాలలో మాత్రం ఇలాంటి భూములకు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మార్చి ఈసీలను మార్ఫింగ్ చేసి రిజిస్ట్రేషన్ నంబర్లకు బై నెంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

సర్వే నెంబర్ 42లోని 10 శాతం లే అవుట్ లో ఒక ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒకే నెలలో మూడు సార్లు రిజిస్ట్రేషన్ చేశారు.  పదిశాతం లేఅవుట్ల కబ్జాలపై, అమ్మకాలపై మున్సిపల్ ఆఫీసర్లు  రెండు రోజులు హడావిడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదు. లేఅవుట్ల భూములను కబ్జా చేసి అమ్ముకున్న వారికి ఇదివరకు నోటీసులు ఇచ్చినా వారిపై  ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు 

చర్యలు తీసుకుంటాం

పదిశాతం లేఅవుట్ భూములను అన్యాక్రాంతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చాం. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వాటిపై స్పెషల్ ఫోకస్ చేస్తాం. ఆ భూములను అమ్మినా, కొనినా ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి.

దశరథ్ మున్సిపల్,  కమిషనర్ గద్వాల