బీహార్లో విషాదం.. నదీ స్నానాలకు వెళ్లి 46 మంది మృతి.. 37 మంది చిన్నారులే..

పాట్నా: బీహార్లో విషాదం జరిగింది. నదీ స్నానాలు ఆచరిస్తూ ప్రమాదవశాత్తూ నీట మునిగి బీహార్లోని పలు జిల్లాల్లో  గడచిన 24 గంటల్లో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన 46 మందిలో 37 మంది చిన్నారులే కావడం మరింత బాధాకరమైన విషయం. బీహార్లో ‘జితియా’ పండుగ వేడుకల్లో భాగంగా భక్తులు కుటుంబ సమేతంగా నదీ స్నానాలు ఆచరించారు. ఇంట్లో ఉన్న చిన్నారుల ఆరోగ్యంగా ఉండాలని మహిళలు ఉపవాసం ఉండి వ్రతం ఆచరిస్తుంటారు. ఈ వ్రతంలో భాగంగా నదీ స్నానం ఆచరిస్తారు. నదీ స్నానాలు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ నీళ్లలో మునిగిపోయి ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం శోచనీయం.

బీహార్లోని 15 జిల్లాల్లో ‘జితియా’ పండుగ వేళ 46 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం. రాష్ట్రవ్యాప్తంగా 43 మృతదేహాలు నీటిలో కొట్టుకొచ్చాయని, నదుల్లో కొట్టుకుపోయిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెతుకులాట సాగిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 46 మంది ప్రాణాలు కోల్పోవడంపై బీహార్ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు నితీష్ ప్రభుత్వం 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇప్పటికే 8 బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. 

‘జితియా’ పండుగ జరుపుకుంటున్న ప్రతీసారి ఇలా నదీ స్నానాల్లో పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలు పోతుండటం ఆందోళన కలిగించే విషయం. గతేడాది కూడా బీహార్లో ఒకే రోజు నీట మునిగి 22 మంది మరణించారు. అక్టోబర్ 7న, 2023న బీహార్‌లోని పలు జిల్లాల్లో నీటిలో మునిగి సుమారు 22 మంది చనిపోయారు. భోజ్‌పూర్‌లో ఐదుగురు, జహనాబాద్‌లో నలుగురు, పాట్నా, రోహతాస్‌లో ముగ్గురు, దర్భంగా, నవాడలో ఇద్దరు, మాధేపురా, కైమూర్, ఔరంగాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున నీట మునిగి మరణించారు.