Health Alert: 100 కోట్ల మందికి పైగా ఆ సమస్య ఉంది...!

ఊబకాయం, మనకు తెలీకుండానే మన ప్రాణానికి ముప్పు తెచ్చే వ్యాధి. ఈ సమస్య తీవ్రం అయ్యేంతవరకు తమకు ఊబకాయం ఉన్నట్లు చాలా మంది గుర్తించలేరు. మన లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పుల వల్ల ప్రస్తుతం ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. ఇటీవల లాన్సెన్ట్ అనే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా జనాభా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారని తేలింది. ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా దిమ్మతిరిగి పోతుందనే చెప్పాలి.

1990 నుండి 2022 వరకు ఉన్న లెక్కలను ఈ అధ్యయనంలో తేలిన లెక్కలతో పోల్చి చూస్తే పిల్లలు, యుక్తవయసు వారిలో ఈ సమస్య నాలుగు రెట్లు అధికమైందని, పెద్దల్లో రెండు రెట్ల కంటే ఎక్కువ పెరిగిందని. మహిళల్లో ఈ సమస్య సుమారు మూడు రెట్లు ఎక్కువైందని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 159 మిలియన్ల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతుంటే, 879మిలియన్ల మంది పెద్దలు ఈ సమస్యతో బాధపడుతున్నారని తేలింది.

ఊబకాయం సమస్య రోజురోజుకీ రెట్టింపవుతుంటే, తక్కువ బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోందని అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం పెరుగుతున్న తీరు మానవాళికి సమీప దూరంలోనే ముప్పు పొంచి ఉందని సూచిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు మేల్కొని ప్రజారోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే త్వరలోనే ఆరోగ్యపరంగా పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడచ్చు.