పెట్రోల్ ట్యాంకర్ పేలి 100 మంది మృతి

నైజీరియా: మంగళవారం జిగావా రాష్ట్రంలోని మజియా టౌన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలి వంద మందికి పైగా మరణించగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 95 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మంటల వేడికి బొగ్గులా మారిపోయారు. ప్రమాదం జరగ్గానే ఎమర్జెన్సీ బృందం అక్కడ సహాయక చర్యలు చేపట్టింది.

మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఖాదీజా యూనివర్సిటీ సమీపంలో ఓ పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి ట్రక్కును ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ ఘటన అనంతరం ట్యాంకర్ నుండి పెట్రోల్ లీక్ అవ్వడంతో.. స్థానికులు దానిని నింపుకునేందుకు పోటీపడ్డారు. ఆ సమయంలోనే ట్యాంకర్ పేలిపోయింది.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారందరికీ, బుధవారం సామూహిక అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు జిగావా రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గాయపడిన వారికి రింగిమ్ జనరల్ ఆసుపత్రిలో వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ALSO READ | అదృష్టం బాగుంది: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ హెలికాఫ్టర్ పొలాల్లో దిగింది..!