యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సామూహిక గిరిప్రదక్షిణ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం 5.30 గంటలకు ఆలయ ఈవో భాస్కర్‌‌రావు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వైకుంఠ ద్వారం వద్ద నారసింహుడి పాదాలకు ప్రత్యేక పూజలు చేసి గిరిప్రదక్షిణను ప్రారంభించారు. కొండ చుట్టూ రెండున్నర కిలోమీటర్లు ప్రదక్షిణ చేసిన అనంతరం కొండపైకి చేరుకుని నారసింహుడిని దర్శించుకున్నారు. 

గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. గిరిప్రదక్షిణలో భాగంగా వైకుంఠద్వారం ఏర్పాటు చేసిన భజనలు, భక్తిగీతాలు, కీర్తనలు, సంకీర్తనలు, నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. మరో వైపు ఆలయంలో స్వామివారికి అర్చకులు నిత్య కైంకర్యాలు, అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. 

శాస్త్రోక్తంగా కార్తీక వనభోజనాలు

కార్తీకమాసం ముగుస్తుండడంతో ఆలయ సంప్రదాయం ప్రకారం శుక్రవారం దేవస్థాన గోశాల ప్రాంగణంలో ఉన్న తోటలో కార్తీక వనభోజనాలు నిర్వహించారు. గోశాల ప్రాంగణంలో మొదట నిర్వహించిన తులసీ దామోదర కల్యాణం, సత్యనారాయణస్వామి వ్రతంలో చైర్మన్‌‌ నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌‌రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సతీమణి బీర్ల అనిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చేపట్టిన కార్తీక వనభోజనాలకు ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్ పోలీసులు హాజరయ్యారు.