రష్యాలో అసద్..! రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించిన పుతిన్ సర్కారు

  • అసద్ ఫ్యామిలీతో కలిసి వచ్చారన్న రష్యన్ మీడియా

న్యూఢిల్లీ/డమాస్కస్: సిరియాను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న తర్వాత పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాలో ల్యాండయ్యారు. రాజకీయ శరణార్థిగా ఆశ్రయం పొందారు. అసద్​ తో పాటు ఆయన ఫ్యామిలీకి మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించామని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రష్యా అధికార మీడియా కూడా ఈ విషయాన్ని కన్ఫమ్  చేసింది. 

అసద్ తలదాచుకునేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్  పుతిన్  ఆమోదం తెలిపారని పేర్కొంది. దీంతో అసద్ ఎక్కడున్నారన్న ఊహాగానాలకు తెరపడింది. అయితే, రష్యాలో ఏ ప్రాంతంలో ఆయనకు ఆశ్రయం కల్పించారో ప్రభుత్వం వెల్లడించలేదు. కాగా.. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు అసద్​తెలిపారని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా, రష్యాకు చెందిన రెండు కీలక మిలిటరీ స్థావరాలు ఇంకా సిరియాలోనే ఉన్నాయి. అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి అసద్ కు రష్యా అండగా నిలిచింది. 13 ఏండ్ల పాటు ఆయన అధికారంలో కొనసాగేందుకు సహకరించింది. 

13 ఏండ్ల తర్వాత సూర్యుడిని చూసిన ఖైదీలు

సిరియా జైళ్లలో దుర్భర జీవితం గడిపిన ఖైదీలకు ఆదివారం ఉషోదయం అయింది. 2011లో అంతర్యుద్ధం నేపథ్యంలో కొన్ని లక్షల మంది నిరసనకారులను అసద్  ప్రభుత్వం జైళ్లలో నిర్బంధించింది. తాజాగా తిరుగుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకోవడంతో ఖైదీలను విడుదల చేశారు. దీంతో ఖైదీలు వీధుల్లో పరుగులు తీస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియోలు సోషల్  మీడియాలో వైరల్  అయ్యాయి. ఈ సందర్భంగా బషర్‌‌‌‌  బర్ హౌమ్ అనే ఖైదీ మాట్లాడుతూ తాను చివరిసారిగా 2011లో సూర్యుడిని చూశానని, మళ్లీ ఇన్నేండ్లకు సూర్యుడిని చూస్తున్నానని చెప్పాడు.

సిరియా సార్వభౌమత్వాన్ని కాపాడాలి: భారత్

సిరియాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. డమాస్కస్​లో ఇండియన్  ఎంబసీ అక్కడి భారతీయులతో టచ్​లో ఉందని, వారి భద్రతను చూసుకుంటోందని పేర్కొంది. సిరియాలో అధికార బదిలీ ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పలు దేశాలకు భారత్  పిలుపునిచ్చిం ది. సిరియా సమాజంలోని అన్ని వర్గాల వారి ప్రయోజనాలు కాపాడాలని కోరింది. కాగా.. సిరియాలోని అనుమానిత రసాయన ఆయుధ స్థావరాలపై ఇజ్రాయెల్​ దాడులు చేసింది. ఆ ఆయుధాలు రెబెల్స్ చేతికి చిక్కకూడదనే ఈ పని చేసినట్లు పేర్కొంది.